మెట్రో పిల్లర్లకు రిఫ్లెక్టర్లు | Sakshi
Sakshi News home page

మెట్రో పిల్లర్లకు రిఫ్లెక్టర్లు

Published Tue, May 23 2017 12:29 AM

మెట్రో పిల్లర్లకు రిఫ్లెక్టర్లు - Sakshi

- మధ్యలో ఖాళీలు లేకుండా మీడియన్స్‌
- నగరవ్యాప్తంగా 3,000 ట్రాఫిక్‌ సూచిక బోర్డులు
- వెల్లడించిన ట్రాఫిక్‌ చీఫ్‌ రవీందర్‌   


సాక్షి, హైదరాబాద్‌: మెట్రో పిల్లర్ల కారణంగా జరుగుతున్న ప్రమాదాలను పరిగణనలోకి తీసుకున్న ట్రాఫిక్‌ పోలీసులు చక్కదిద్దే చర్యలు ప్రారంభించారు. దీనికోసం మెట్రో రైల్‌ అధికారులతో కలసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు నగర సంయుక్త పోలీసు కమిషనర్‌ (ట్రాఫిక్‌) డాక్టర్‌ వి.రవీందర్‌ సోమవారం పేర్కొన్నారు. రాజధానిలోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలోనూ మెట్రో రైల్‌ మార్గం ఉంది. ప్రతి ప్రాంతంలోనూ ప్రధాన రహదారుల మీదుగానే ఈ నిర్మాణాలు జరిగాయి. దీంతో రహదారికి మధ్యలో మెట్రో రైల్‌ పిల్లర్స్‌ ఉంటున్నాయి. దీని నిర్మాణం నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో డివైడర్లను సైతం తొలగించారు. దీంతో ఆయా చోట్ల ఏ రెండు మెట్రో పిల్లర్ల మధ్య చూసినా చిన్న చిన్న సిమెంట్‌ దిమ్మెలు మినహా పటిష్టమైన ఏర్పాట్లు కరువయ్యాయి. ఈ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకున్న ట్రాఫిక్‌ చీఫ్‌ ప్రాథమికంగా అన్ని మెట్రో పిల్లర్లకు రేడియం రిఫ్లెక్టివ్‌ స్టిక్కర్లు ఏర్పాటు చేయిస్తున్నారు. రాత్రి వేళల్లో వాహనాల లైటు వీటిపైన పడిన వెంటనే అక్కడ పిల్లర్‌ ఉన్నట్లు మెరుస్తూ సూచిస్తుంది.

అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం స్టిక్కర్లు
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఈ స్టిక్కర్లు ఉండేలా డిజైన్‌ చేసిన ట్రాఫిక్‌ పోలీసులు.. ఆ మోడల్‌ను మెట్రో రైల్‌ అధికారులకు అందించారు. త్వరలోనే అన్ని పిల్లర్లకూ ఇవి ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. మరోపక్క మెట్రో పిల్లర్ల మధ్య స్థలం ఖాళీగా ఉండకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం వాటి మధ్య ప్రాంతంలో మీడియన్స్‌గా పిలిచే తాత్కాలిక సిమెంటు డివైడర్లను ఏర్పాటు చేయనున్నారు. దిశ, వేగ పరిమితి తదితరాలను సూచించే ట్రాఫిక్‌ సూచిక బోర్డుల్నీ నగర వ్యాప్తంగా ఏర్పాటు చేయడానికి ట్రాఫిక్‌ పోలీసులు ప్రణాళిక సిద్ధం చేశారు. రేడియో రిఫ్లెక్టివ్‌ సదుపాయం ఉండే వీటిని తొలి దశలో మూడు వేలు తయారు చేయిస్తున్నారు. వీటిని ఏఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నది ట్రాఫిక్‌ ఠాణాల వారీగా నిర్దేశిస్తున్నట్లు రవీందర్‌ పేర్కొన్నారు. పదికి మించి ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్న ఉల్లంఘనులపై న్యాయ స్థానాల్లో చార్జ్‌షీట్లు దాఖలుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ర్యాష్‌ డ్రైవింగ్, రేసింగ్‌ చేసే వాహనాలకు చెక్‌ చెప్పడానికి గడిచిన మూడు వారాలుగా చేపట్టిన చర్యలు ఫలితాలు ఇస్తున్నా యని ట్రాఫిక్‌ చీఫ్‌ అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement