కొత్త జిల్లాల ఎస్పీ కార్యాలయాలు సిద్ధం చేయండి | Sakshi
Sakshi News home page

కొత్త జిల్లాల ఎస్పీ కార్యాలయాలు సిద్ధం చేయండి

Published Sun, Sep 4 2016 12:53 AM

కొత్త జిల్లాల ఎస్పీ కార్యాలయాలు సిద్ధం చేయండి

హోం శాఖకు సీఎస్ రాజీవ్ శర్మ ఆదేశం
 
 సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడనున్న జిల్లాల్లో ఎస్పీ కార్యాలయాల ఏర్పాటుకు సన్నాహక చర్యలను సత్వరం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయాల ఏర్పాటుకు భవనాల గుర్తింపు, ఫర్నిచర్, వాహనాల సర్దుబాటు తదితర పనులు పూర్తి చేయాలన్నారు. కొత్త జిల్లాల్లో తాత్కాలిక సిబ్బందిని నియమించడానికి ముసాయిదా సిద్ధం చేయాల న్నారు. జిల్లాల్లో  సిబ్బందిని సర్దుబాటు చేయాలన్నారు. కొత్త జిల్లాలకు అవసరమైన పోలీసు సిబ్బంది నియామకాల కోసం ప్రతిపాదనలు పంపిస్తే పరిశీలించి అనుమతిస్తామని హోం శాఖ అధికారులకు సూచించారు. కొత్త జిల్లాల్లో సిబ్బంది సర్దుబాట్లపై శనివారం సచివాలయంలో హోం, కార్మికశాఖ అధికారులతో ఆయన టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజీవ్ శర్మ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది వివరాలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) వెబ్‌సైట్‌కు అప్‌లోడ్ చేయాలని కోరారు. కొత్త జిల్లాలకు ప్రస్తుత  సిబ్బందిని సర్దుబాటు చేసే ప్రతిపాదనలను రూపొందించాలని ఆదేశించారు. జిల్లా పోలీసు శాఖ ఫైల్స్, రికార్డులను ఫొటోకాపీలు చేయడంతో పాటు అనుసూచికలు రూపొందించాలన్నారు. పోలీసు శాఖ ఆర్గానోగ్రామ్ రూపొందించాలన్నారు. పోలీసు శాఖ కార్యాలయాల ఏర్పాటుకు తక్షణ, దీర్ఘకాల చర్యలు రూపొందించాలన్నారు. సాధారణ పరిపాలన శాఖ, సీజీజీలతో సమన్వయం కోసం పోలీసు శాఖ నుంచి నోడల్ అధికారిని నియమించాల న్నారు. డీజీపీ అనురాగ్‌శర్మ మాట్లాడుతూ.. జిల్లాల్లో అవసరమైన సిబ్బంది నియామకం గురించి వివరించారు. పోలీసు శాఖలో నూతన నియామకాలకు అనుమతివ్వాలని కోరారు. సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, పీఆర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ముఖ్యకార్యదర్శులు బీపీ ఆచార్య, అధర్ సిన్హా, శాంతికుమారి, రామకృష్ణారావు, రాజీవ్ త్రివేది పాల్గొన్నారు.

Advertisement
Advertisement