‘రవాణా’పై ఆరా | Sakshi
Sakshi News home page

‘రవాణా’పై ఆరా

Published Sat, Aug 10 2013 12:14 AM

‘రవాణా’పై ఆరా - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ప్రత్యేక రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో మహా నగరంలోని అన్ని ప్రభుత్వ విభాగాలపై ‘ఎఫెక్ట్’ పడుతోంది. కేంద్రం వివిధ ప్రభుత్వ శాఖల ఆదాయ వ్యయాలపై దృష్టి కేంద్రీకరించింది. ప్రధానంగా సర్కార్‌కు అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే ప్రభుత్వ శాఖ అయిన రవాణాపై కేంద్ర ఉన్నతాధికారులు వివరాలను సేకరించారు. ఇప్పటికే దీనిపై రవాణా అధికారులు నివేదికలను కూడా అందజేసినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాల పన్నుల రూపంలో రవాణా శాఖ నుంచి సర్కార్‌కు లభించే ఆదాయాన్ని అంచనా వేయడంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి లభించే ఆదాయంపైనా ప్రధానంగా దృష్టి సారించారు. 
 
రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాల కంటే ఈ రెండు జిల్లాల్లోనే వాహనాలు భారీ సంఖ్యలో ఉండటం, ఏటా లక్షల్లో వాహనాల అమ్మకాలు, వాటిపైన వచ్చే జీవితకాల పన్ను, రవాణా వాహనాలపై లభించే త్రైమాసిక పన్ను వంటి వివిధ ఆదాయ మార్గాల ద్వారా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఏటా ఎంత మేరకు వసూలవుతోందనే దానిపై అధికారులు కేంద్రానికి నివేదిక సమర్పించారు. పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా చేయనున్న నేపథ్యంలో వివిధ శాఖల నుంచి వచ్చే ఆదాయాలు, నిర్వహణ వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో హైదరాబాద్‌తో కలిసి ఈ రెండు జిల్లాల్లో అన్ని రకాల వాహనాలు ప్రస్తుతం 38 లక్షలకు చేరుకున్నాయి. ఏటా 2 లక్షల వాహనాలు కొత్తగా చేరుతున్నాయి. ఈ క్రమంలో ఆదాయం మరింత పెరిగే అవకాశాలపై అంచనా వేస్తున్నారు. 
 
 భారీగా పెరగనున్న అంతర్రాష్ట పన్నులు
 
 రాష్ట్ర విభజన ఖాయమైన పక్షంలో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వస్తు, ప్రయాణికుల రవాణా వాహనాల ఇంటర్‌స్టేట్ (అంతర్రాష్ట్ర) పన్నులు కూడా భారీగా పెరుగుతాయి. ప్రస్తుతం ఒకే రాష్ట్రంలో తిరుగుతున్న ఈ వాహనాలు కూడా రెండు రాష్ట్రాలుగా విడిపోనున్నాయి. దీంతో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు, అక్కడి నుంచి ఇక్కడకు రాకపోకలు సాగించే వాహనాలు ఆల్ ఇండియా పర్మిట్లను తీసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేట్ బస్సులపై ఈ భారం ఎక్కువగా పడే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1500కు పైగా ప్రైవేట్ బస్సులు తిరుగుతున్నాయి. 
 
మరో  500 బస్సులు ఆల్ ఇండియా పర్మిట్లపైన ముంబయి, షిరిడీ, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆల్ ఇండియా పర్మిట్లపై ఈ బస్సులు ఒక్కో సీట్‌పైన రూ.3600 చొప్పున చెల్లిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటైన తరువాత ప్రస్తుతం రాష్ర్ట స్థాయి పర్మిట్ల కింద ఒక్కో సీట్‌పై రూ.2600 చొప్పున 1500కు పైగా బస్సులు సైతం ఆల్‌ఇండియా పర్మిట్లను తీసుకోవలసి ఉంటుంది. అంటే వీటిపై ఒక్కో సీట్‌కు రూ.వెయ్యి చొప్పున అదనపు భారం పడనుంది. అంతర్రాష్ర్ట వాహనాల వివరాలను కేంద్రం సేకరించినట్లు తెలిసింది.
 
 పాలనాపరమైన అంశాల్లో...
 
 ప్రస్తుతం రవాణాశాఖలో ఐఏఎస్ స్థాయి అధికారి కమిషనర్‌గా ఉన్నారు. మరొక అదనపు రవాణా కమిషనర్, హైదరాబాద్ ఆర్టీఏతో కలుపుకొని నలుగురు జేటీసీలు ఉన్నారు. అదనపు కమిషనర్‌తో పాటు ముగ్గురు సీమాంధ్ర అధికారులు కాగా, ఇద్దరు జేటీసీలు తెలంగాణకు చెందినవారు. వీరు కాక మెదక్, గుంటూరు, కరీంనగర్ జిల్లాల్లో మరో ముగ్గురు సీమాంధ్రకు చెందిన అధికారులు ఉపరవాణా కమిషనర్లుగా పని చేస్తున్నారు. విభజన నేపథ్యంలో తెలంగాణకు చెందిన అదనపు రవాణా కమిషనర్ స్థాయి అధికారిని ఇన్‌చార్జి కమిషనర్‌గా నియమించవచ్చని ఆ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో అదనపు రవాణా కమిషనర్‌గా పనిచేసిన మల్యాద్రి రెండున్నరేళ్ల పాటు ఇన్‌చార్జి కమిషనర్‌గా పనిచేసిన అనుభవాన్ని అధికారులు ఉదహరిస్తున్నారు.
 

Advertisement
Advertisement