యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులు | Sakshi
Sakshi News home page

యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులు

Published Mon, Mar 14 2016 12:56 AM

యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులు - Sakshi

♦ మండలి ప్రశ్నోత్తరాల్లో మంత్రి హరీశ్‌రావు వెల్లడి
♦ కాంట్రాక్టర్లకు కొత్త ఎస్‌ఎస్‌ఆర్ రేట్లు ఇచ్చేది లేదని స్పష్టీకరణ
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ఉందని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు.   జూలైలోగా కొన్నింటిని, అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మెజారిటీ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుల కోసం పూర్తిస్థాయిలో బడ్జెట్ పెట్టాలనే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. ఆదివారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కొందరు కాంట్రాక్టర్లు కొత్త స్టాండెడ్ షెడ్యూల్డ్ (ఎస్‌ఎస్‌ఆర్) రేట్లు కావాలంటూ పనులు చేయడం లేదని, వారికి కొత్త రేట్లు ఇచ్చే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టంచేశారు. వారిని బ్లాక్‌లిస్ట్ లో పెట్టడానికి ఒక్కరోజు పట్టదన్నారు. 

షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకరరెడ్డి, ఎం.రంగారెడ్డి, కె.దామోదరరెడ్డి, రామచంద్రరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెపుతూ కోయిల్‌సాగర్, ఎల్‌ఐఎస్, ఎస్‌ఆర్‌ఎస్‌పీ-2, సింగూరు, నీల్వాయి, సుద్దవాగు, కిన్నెరసాని, పాలెంవాగు ప్రాజెక్టులు పెం డింగ్‌లో ఉన్నాయని, వీటి కోసం రూ.150.50 కోట్ల బడ్జెట్ అవసరమని తెలిపారు. ఆయా ప్రాజెక్టులకు భూసేకరణ, జాతీయ రహదారులు/రైల్వేక్రాసింగ్‌ల వంటి అంశాలపై క్లియరెన్స్, ఇతర అడ్డంకులను పరిష్కరించాల్సి ఉందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని నాలుగు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.1,900-2,000 కోట్లు అవసరమన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలోని కొమురం భీమ్ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఖరీఫ్‌కల్లా 30 వేల ఎకరాలకు నీళ్లు ఇస్తామని, 2017-18లో దానిని పూర్తిచేస్తామని చెప్పారు. విపక్షనేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ పెండింగ్  ప్రాజెక్టుల పర్యవేక్షణకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. పొంగులేటి సుధాకరరెడ్డి మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ.1,000-1,500 కోట్లు కేటాయిస్తే అవి పూర్తయ్యే అవకాశముందన్నారు. ఖమ్మం జిల్లాలోని వివిధ ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించాలని కోరారు. ఉదయసముద్రం ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలని  కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

 మూడేళ్లలో డిండిని పూర్తిచేస్తాం
 నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టును రెండున్నర, మూడేళ్లలో పూర్తిచేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. భూసేకరణ ఆలస్యం కాకుండా ఉండేందుకు నల్లగొండ జిల్లా కలెక్టర్ వద్ద రూ.90 కోట్లు డిపాజిట్ పెట్టామని, ఆ మొత్తం ఖర్చు కావడంతో మరో రూ.50 కోట్లు విడుదల చేశామన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement