రాజధాని నిర్మాణంలో కజక్‌కు భాగస్వామ్యం | Sakshi
Sakshi News home page

రాజధాని నిర్మాణంలో కజక్‌కు భాగస్వామ్యం

Published Mon, Jul 11 2016 1:02 AM

రాజధాని నిర్మాణంలో కజక్‌కు భాగస్వామ్యం - Sakshi

- కజకిస్తాన్ రాజధాని అస్తానాతో వచ్చేనెలలో ఎంఓయూ
- అస్తానా మేయర్‌తో సీఎం చంద్రబాబు భేటీలో నిర్ణయం
 
 సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర నూతన రాజధాని అమరావతి నగర నిర్మాణంలో మరొక కొత్త దేశం కజకిస్తాన్‌కు కూడా భాగస్వామ్యం కల్పించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. కజకిస్తాన్‌లో పర్యటిస్తున్న బాబు ఈ మేరకు కజక్ రాజధాని అస్తానాతో రాష్ట్ర రాజధాని నిర్మాణం విషయంలో ఒప్పందం(ఎంవోయూ) చేసుకోనున్నారు.సీఎం నేతృత్వం లోని రాష్ట్ర ప్రతినిధి బృందం ఆదివారం కజకిస్తాన్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా అస్తానా మేయర్ అస్సెట్ లెస్కెషోవ్, సీఎం చంద్రబాబు మధ్య జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి వచ్చేనెలలో ప్రాథమిక అవగాహన ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు.

ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒప్పంద పత్రాలపై ఆంధ్రప్రదేశ్ తరఫున వర్కింగ్ గ్రూపునకు పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ నేతృత్వం వహిస్తారంది. రాష్ట్ర వర్కింగ్ గ్రూపులో ఐదుగురు, అస్తానా వర్కింగ్ గ్రూపులో ఐదుగురు చొప్పున సభ్యులుంటారంది. అమరావతి నిర్మాణానికి అస్తానా అనుభవాలను స్వీకరించదలిచామని, అస్తానా నగర రూపశిల్పులు, నిర్మాణ నిపుణుల వివరాలు, వారి అనుభవాలు తమకివ్వాలని సీఎం చంద్రబాబు ఆ దేశ ప్రతినిధుల్ని కోరారని పేర్కొంది. ‘‘పరస్పరం సహకరించుకోవడానికి వీలుగా రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికిగాను అమరావతికి రావాలని అస్తానా మేయర్‌ను చంద్రబాబు ఆహ్వానించారు.  కలసి పనిచేయడానికి అంగీకరించిన అస్తానా నగర మేయర్..తమ వర్కింగ్ గ్రూపులోని సభ్యుల పేర్లను రెండు రోజుల్లో ప్రకటిస్తానన్నారు. వచ్చేఏడాది అస్తానాలో జరిగే ఎక్స్‌పో-2017లో పాల్గొనాలని చంద్రబాబును ఆహ్వానించారు’’ అని వివరించింది.

 విమాన సర్వీసులు కూడా
 తమ దేశ రవాణాశాఖ మంత్రితో మాట్లాడి అస్తానా నుంచి అమరావతికి నేరుగా విమాన సర్వీసు నడిపేందుకు ప్రయత్నిస్తానని మేయర్ లెస్కెషోవ్ సీఎంకు హామీ ఇచ్చారని, దీనివల్ల పర్యాటకుల సంఖ్య, ఆదాయం పెరిగే వీలుందని రాష్ట్రప్రభుత్వ మీడియా సలహాదారు కార్యాలయం తన ప్రకటనలో వివరించింది.

 చంద్రబాబు బృందంతో రష్యాలోని భారత రాయబారి భేటీ
 కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో రాజస్థాన్, మహారాష్ట్రల సీఎంలు వసుంధరరాజే, దేవేంద్ర ఫడ్నవీస్‌లతో కలసి సీఎం చంద్రబాబు ఆదివారం రష్యాలోని ఎకటెరిన్‌బర్గ్‌లో ఇన్నోప్రోమ్-2016 ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్యాలోని భారత రాయబారి పంకజ్ శరణ్... వీరితో సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు.

Advertisement
Advertisement