Sakshi News home page

మున్సి‘పోల్స్’పై టీఆర్‌ఎస్ గురి

Published Mon, Feb 22 2016 3:04 AM

మున్సి‘పోల్స్’పై టీఆర్‌ఎస్ గురి - Sakshi

♦ పార్టీలో మొదలైన ఎన్నికల సందడి
♦ వరంగల్, ఖమ్మంలో మంత్రుల పర్యటనలు
♦ మొదలైన ‘ఆపరేషన్ ఆకర్ష్’
♦ వరాల జాబితా తయారీలో నిమగ్నం
 
 సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్‌లో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీకి ఆదివారం ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్ గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపైనా దృష్టి పెట్టింది. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో రికార్డు మెజారిటీతో విజయం సాధించిన ఆ పార్టీ గ్రేటర్ వరంగల్ ఎన్నికలపైనా అదే విశ్వాసంతో ఉంది.

ఈ నెలలోనే ముగిసిన మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నికలోనూ గులాబీ పార్టీ గెలుపొందింది. ఇలా వరసగా అన్ని ఎన్నికల్లో విజయాలు సాధిస్తూ వస్తున్న టీఆర్‌ఎస్ మున్సిపల్ ఎన్నికలపైనా ధీమాతో ఉంది. షెడ్యూలు విడుదల కంటే ముందు నుంచే ఈ ఎన్నికలపై హోంవర్క్ చేసిన అధికార పార్టీ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో చేపట్టాల్సిన అభివృద్ధిపై స్పష్టత ఇచ్చింది. మంత్రులూ ఈ రెండు నగరాల్లో పర్యటించడం మొదలుపెట్టారు. ఇప్పటికే విపక్షాలు సైతం ఎన్నికలకు సిద్ధం అవుతుండటం, కాంగ్రెస్ ఎన్నికల ఇన్‌చార్జులను కూడా నియమించుకోవడంతో టీఆర్‌ఎస్‌లోనూ ఎన్నికల వేడి మొదలైందని అంటున్నారు.

రాష్ట్రంలో తమ పార్టీకి అనుకూలంగా గాలి వీస్తున్నందున ఈ ఎన్నికల్లోనూ అవలీలగా విజయం సాధిస్తామని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారంతోపాటు, వరంగల్, ఖమ్మం నగరాల్లో ప్రత్యేకంగా చేపట్టే పనుల గురించి ప్రచారం చేయాలని టీఆర్‌ఎస్ నాయకత్వం నిర్ణయించింది. నగర ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఇప్పటికే ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. వాస్తవానికి వరంగల్‌లోనూ కేసీఆర్ పర్యటించాల్సి ఉన్నా, అది వాయిదా పడింది. వరంగల్‌లో ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామావు పర్యటించగా, ఆ జిల్లాల మంత్రులే కాకుండా సీనియర్ మంత్రుల పర్యటనలూ మొదలయ్యాయి. పనిలోపనిగా ఆపరేషన్ ఆకర్ష్‌ను అధికార పార్టీ కొనసాగిస్తోంది. దీంతో ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వ లసలూ మొదలయ్యాయి.

వరంగల్ నగర టీడీపీ అధ్యక్షుడు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఖమ్మంలో మాజీ ఎమ్మెల్యే సుల్తాన్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర్‌రావు కూడా గులాబీ గూటికి చేరారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలప్పుడు అమలు చేసిన చేరికల వ్యూహాన్నే ఇక్కడా సైతం మొదలుపెట్టినట్లు తాజా చేరికలు రుజువు చేస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ రెండు నగరాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుధ్యం, డబుల్ బెడ్‌రూం ఇళ్లు తదితరాలను ప్రచారాంశాలుగా ఎంచుకుంది. మరోవైపు రెండు కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట నగర పంచాయతీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన వరాల జాబితాను రూపొందిస్తున్నారని చెబుతున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement