నయవంచన చేసి నవనిర్మాణ దీక్షా? | Sakshi
Sakshi News home page

నయవంచన చేసి నవనిర్మాణ దీక్షా?

Published Thu, Jun 2 2016 1:51 AM

నయవంచన చేసి నవనిర్మాణ దీక్షా? - Sakshi

బాబుపై వైఎస్సార్‌సీపీ నేత తమ్మినేని సీతారాం ధ్వజం
 
 సాక్షి, హైదరాబాద్:  రెండేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజల్ని నయవంచనకు గురిచేసిన  సీఎం చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష చేయాలని పూనుకోవడం విడ్డూరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. విభజన వల్ల నష్టపోయిన ఏపీని బీజేపీతో కలసి అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని మాటిచ్చిన చంద్రబాబు మాటతప్పారని దుయ్యబట్టారు. ఈ హామీ అమలు జరక్కపోయినా ‘ఓటుకు కోట్లు’ కుంభకోణంలో ఇరుక్కున్న చంద్రబాబు నోటికి తాళం వేసుకుని ఉండటం నయవంచన కాదా? అని ప్రశ్నించారు.

‘‘రైల్వేజోన్ ఇవ్వకున్నా, కృష్ణా-గోదావరి నదీజలాల హక్కు కోల్పోతున్నా అడగలేని పరిస్థితుల్లో ఉండటం ప్రజల్ని నయవంచనకు గురిచేయడం కాదా? రైతులు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ చేయకుండా, నిరుద్యోగులకు ఉద్యోగాలుగానీ, నిరుద్యోగ భృతిగానీ ఇవ్వకపోవడం వంచన  కాదా?’’ అని నిలదీశారు. నవనిర్మాణ దీక్ష జీవోలో ఏపీ విభజన శాస్త్రీయంగా జరగలేదని పేర్కొనడాన్ని సీతారాం తీవ్రంగా తప్పుపట్టారు. వాస్తవానికి రాష్ట్రాన్ని విభజించాలంటూ ఒకటికి నాలుగుసార్లు లేఖలిచ్చింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ఆరోజున సమైక్యతకు నిలబడింది ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేనని, లోక్‌సభలో ఒక్కడే ప్లకార్డు తీసుకుని వెళ్లారని సీతారాం గుర్తుచేశారు.

 విలువలు వల్లె వేయడమా?
 వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు విలువల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని సీతారాం విమర్శించారు. ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికై పదవికి రాజీనామా చేయకుండా టీడీపీలోకి వెళ్లిన ఫిరాయింపుదార్లకు విలువలున్నాయా అని ప్రశ్నించారు.

Advertisement
Advertisement