మొదటలేఖ ఇచ్చిందే చంద్రబాబే | Sakshi
Sakshi News home page

మొదటలేఖ ఇచ్చిందే చంద్రబాబే

Published Wed, Jun 1 2016 3:50 PM

ysrcp leader tammineni sitharam takes on chandra babu

హైదరాబాద్: రాష్ట్ర విభజనకు అనుకూలగా మొదట లేఖ ఇచ్చింది చంద్రబాబు నాయుడేనని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం అన్నారు. బుధవారం మీడియా సమావేశంలో తమ్మినేని మాట్లాడుతూ.. టీడీపీ  పోలిట్ బ్యూరోలో చంద్రబాబు ఏకగ్రీవ తీర్మానం చేయించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ పంపారని చెప్పారు. అప్పటి కేంద్ర హోం శాఖ మంత్రి చిదంబరానికి కూడా విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారని, చంద్రబాబు రాష్ట్ర విభజన చేయించి ఇప్పుడు నాటాకాలు ఆడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించింది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు.

రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్లో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్లకార్డు పట్టుకుని విభజనను వ్యతిరేకించారని తమ్మినేని చెప్పారు. అప్పడు విభజనకు అనుకూలంగా టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఓటు వేశారని తెలిపారు. చంద్రబాబు చేసేది నవ నిర్మాణ దీక్ష కాదని, నయవంచన దీక్ష అని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడం నయవంచన కాదా అని నిలదీశారు. ఏ గ్రామంలో ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు కడుతుంటే మాట్లాడకపోవడం నయవంచన కాదా అని ప్రశ్నించారు.

విభజన చట్టంలోని అన్ని అంశాలను తుంగలోకి తొక్కారని తమ్మినేని ఆరోపించారు. ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ నేతలు కలసి డ్రామాలు ఆడారని విమర్శించారు. ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలన్నవారు ఇప్పుడు మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement