అమెరికాలో భారీ వరదలు: 41 మంది మృతి | Sakshi
Sakshi News home page

అమెరికాలో భారీ వరదలు: 41 మంది మృతి

Published Mon, Dec 28 2015 8:26 AM

అమెరికాలో భారీ వరదలు: 41 మంది మృతి - Sakshi

అమెరికాలోని ఏడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా 41 మంది మరణించారు. ఇల్లినాయిస్ లాంటి రాష్ట్రాల్లో భారీ వరదలు, టెక్సాస్‌లో టోర్నడోలు ఈ ఘోరానికి కారణమయ్యాయి. వరదల కారణంగా ఇల్లినాయిస్‌ రాష్ట్రంలో ఐదుగురు మరణించినట్లు అక్కడి మారియన్ కౌంటీ అధికారులు తెలిపారు. సెంట్రల్ మిసౌరీలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అలబామాలో ఇద్దరు, మిసిసిపిలో 10 మంది, టెన్నెస్సీలో ఆరుగురు, ఆర్కాన్సాసస్‌లో ఒకరు కూడా వరదల కారణంగా మృతిచెందారు. అలబామాలో బర్మింగ్‌హామ్ ప్రాంతంలో టోర్నడో కారణంగా ఇళ్లు కుప్పకూలి, శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు.

దక్షిణ, మధ్య పశ్చిమ ప్రాంతాల్లో టోర్నడోలు, వర్షాలు రావడంతో 14 మంది మరణించారు. టెక్సాస్ రాష్ట్రంలోని డల్లస్ ప్రాంతంలో టోర్నడోలు రావడంతో 11 మంది మరణించారు. ఇక్కడ పలు భవనాలు కుప్పకూలాయి. గాయాలతో పలువురు ఆస్పత్రుల పాలయ్యారు. డల్లస్ శివార్లలోని గార్లండ్ ప్రాంతంలో ఈఎఫ్-4 టోర్నడో విరుచుకుపడటంతో 8 మంది మరణించారు. మరో ముగ్గురు కోలిన్ కౌంటీలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 6 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తమ రాష్ట్రంలో ప్రజా జీవితాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నట్లు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. అమెరికన్ రెడ్‌క్రాస్ టెక్సాస్ విభాగానికి అమెరికన్ ఎయిర్‌లైన్స్ లక్ష డాలర్ల విరాళం ప్రకటించింది.

Advertisement
Advertisement