21వ శతాబ్దంలో వాటితో పెను ముప్పు! | Sakshi
Sakshi News home page

21వ శతాబ్దంలో వాటితో పెను ముప్పు!

Published Sat, Feb 3 2018 8:05 PM

America warns all countries on Nuclear Weapons - Sakshi

వాషింగ్టన్‌: ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే దేశాలు చాలా అప్రమత్తంగా ఉండాలని ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. కొన్ని దేశాలు అణ్వాయుధాలు తయారు చేయడం కొన్నిసార్లు వినాశనానికి దారితీస్తుందని అమెరికా అభిప్రాయపడింది. 2018లో న్యూక్లియర్‌ పోస్టర్‌ రివ్యూ (ఎన్‌పీఆర్‌) సమావేశంలో ఉన్నతాధికారులు, కొన్ని శాఖల అధిపతులు పలు అంశాలపై చర్చించారు. 21వ శతాబ్దంలో అణ్వాయుధ ఉగ్రవాదంతో పెను ముప్పు పొంచి ఉంటుందని అమెరికా రాజకీయ వ్యవహారాలశాఖ కార్యదర్శి టామ్‌ షానన్‌ పేర్కొన్నారు.

ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం గానీ, ఉగ్రవాదులకు ఆశ్రయంగానీ ఇచ్చినట్లు గుర్తిస్తే ఇతర దేశాలను ఉపేక్షించేది లేదన్నారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నట్లు ఏదైనా దేశంపై ఆరోపణలు రుజువైతే ఆ దేశాన్ని ఉగ్రవాద దేశాల జాబితాలో చేర్చుతామని హెచ్చరికలు జారీ చేశారు. ఇదివరకే పలుమార్లు ఈ అంశంపై పాకిస్తాన్‌ను హెచ్చరించామని, అయితే తాము ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం లేదని, తమ దేశంలో ఉగ్రవాదులే లేరని పాక్‌ చెబుతోందని ఈ సందర్భంగా షానన్‌ గుర్తుచేశారు. ఉగ్రవాద దేశాలు, అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న దేశాలపై 100 పేజీల నివేదికను అమెరికా సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇరాన్‌, ఉత్తర కొరియాలు అణ్వస్త్ర సామర్థ‍్యాన్ని మెరుగు పరుచుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయని.. వాటిని ఆ దేశాలు ఎందుకోసం వినియోగించనున్నాయన్న దానిపై ఎన్‌పీఆర్ సమావేశంలో చర్చించినట్లు షానన్‌ వెల్లడించారు.

Advertisement
Advertisement