కరోనా ‘గ్రేట్‌ స్ప్రెడ్డర్‌’ ఎవరు? | Sakshi
Sakshi News home page

కరోనా ‘గ్రేట్‌ స్ప్రెడ్డర్‌’ ఎవరు?

Published Mon, Feb 10 2020 3:30 PM

British Man Feared To Be Coronavirus Super Spreader - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇంగ్లండ్‌తోపాటు ఫ్రాన్స్, స్పెయిన్‌ దేశాల్లో కనీసం ఏడుగురికి కరోనా వైరస్‌ రావడానికి కారణమైన ప్రముఖ బ్రిటిష్‌ వ్యాపారవేత్త పేరును బహిర్గతం చేయాల్సిందిగా ఇంగ్లండ్‌లో వైద్యాధికారులపై ఒత్తిడి రోజు రోజుకు పెరుగుతోంది. 50 ఏళ్ల వయస్సున్న ఆయన పేరును బహిర్గగం చేయడానికి అధికారులు నిరాకరించడంతో ఆయన్ని ‘గ్రేట్‌ స్ప్రెడ్డర్‌’గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ బ్రిటీష్‌ గ్యాస్‌ విశ్లేషణ సంస్థ సింగపూర్‌లోని గ్రాండ్‌ హయత్‌లో జనవరి 24 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన సదస్సుకు హాజరైన ఆయనకు అక్కడే కరోనావైరస్‌ సోకినట్లు అనుమానిస్తున్నారు. 

గ్రేట్‌ స్ప్రెడ్డర్‌ 28వ తేదీన ‘స్కై చాలెట్‌’ ఏర్‌లైన్స్‌కు చెందిన స్థానిక విమానం ఎక్కి మాంట్‌ బ్లాంక్‌లో వారంతం విడిది చేశారు. ఆయనతోపాటు అక్కడికి వెళ్లిన ఐదుగురు బ్రిటీషర్లకు కూడా కరోనావైరస్‌ సోకింది. అక్కడి నుంచి గ్రేట్‌ స్ప్రెడ్డర్‌ గురువారంనాడు లండన్‌ విమానాశ్రయానికి వచ్చీ రాగానే వైరస్‌తో తీవ్రంగా జబ్బు పడ్డారు. ఆయన్ని లండన్‌లోని సెయింట్‌ థామస్‌ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి ఎలా ఉందో ఎవరు చెప్పడం లేదు. అయితే సింగ్‌పూర్‌లోని మౌంట్‌ బ్లాంక్‌లొ ఆయన కారణంగా జబ్బు పడిన ఐదుగురు బ్రిటీషర్ల ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించిందని తెలిపారు. (ఇక్కడ చదవండి: ‘కరోనా’కు ఒక్క రోజులో వంద మంది మృతి)

గ్రేట్‌ స్ప్రెడ్డర్‌ బస చేసిన మాంట్‌ బ్లాంక్‌లో స్థానిక ప్రజలకు ప్రస్తుతం వైద్య పరీక్షలు చేస్తున్నారు. అలాగే ఆ రోజు అక్కడి నుంచి ఆయన వచ్చిన ఈజీ జెట్‌ విమానాన్ని, అందులో ప్రయాణించిన 183 మంది ప్రయాణికులు, ఆరుగురు విమానసిబ్బందిని అధికారులు గుర్తించారు. అత్యవసరంగా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా వారిని అధికారులు ఆదేశించారు. బ్రిటన్‌కు వచ్చేటప్పుడు ఆ విమానం ఫ్రాన్స్‌ మీదుగా స్పెయిన్‌ వెళ్లి వచ్చింది. ఆ దేశాల్లో దిగిపోయిన ఇద్దరు ప్రయాణికులకు కూడా వైరస్‌ సోకినట్లు అనుమానిస్తున్నారు. స్ప్రెడ్డర్‌ ద్వారా సింగపూర్‌లోని గ్రాండ్‌ హైత్‌ హోటల్లో, అక్కడ బస చేసిన ఇతర దేశస్థుల్లో పలువురికి  కరోనావైరస్‌ వచ్చే ప్రమాదం ఉందని వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
Advertisement