వందేళ్ల వసంతం | Sakshi
Sakshi News home page

వందేళ్ల వసంతం

Published Sun, Nov 6 2016 3:31 AM

పెట్రోగ్రాడ్‌లో విప్లవ సైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న లెనిన్

అదొక మహత్తరమైన మలుపు. ప్రపంచాన్ని గడగడలాడించిన ఘటన. కార్మికవర్గ విప్లవంతో సమసమాజ స్థాపన జరుగుతుందన్నాడు కార్ల్ మార్క్స్. ఆ సిద్ధాంతాన్ని లెనిన్ ఆచరణలో పెట్టిన సందర్భమది. ప్రపంచంలో తొలిసారిగా కార్మికులు రాజ్యాధికారం చేజిక్కించుకున్న ఉదంతం. తొలి సోషలిస్టు దేశం ఆవిర్భవించిన చరిత్ర. అదే అక్టోబర్ విప్లవం! రష్యా విప్లవం! బోల్షివిక్ విప్లవం! యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టు రష్యా! 1917 లో సంభవించిన ఆ మహా విప్లవానికి ఈ నవంబర్ 7వ తేదీతో వందేళ్లు నిండుతున్నాయి. కానీ ఇప్పుడు సోషలిస్టు రష్యా లేదు. పాతికేళ్ల కిందటే రద్దయింది! 1991లో సోషలిజాన్ని అధికారికంగా రద్దు చేసుకుని రష్యా సమాఖ్యగా మారింది. కానీ సోషలిస్టు రష్యా మనుగడ సాగించిన 75 ఏళ్లలో ప్రపంచగతిని సమూలంగా మార్చేసింది.

మరిన్ని దేశాలు సోషలిస్టు దేశాలుగా అవతరించాయి. ఆ సమయంలో ప్రపంచం రెండు భిన్న ధృవాలుగా చీలిపోయింది. ఆ ధృవాల మధ్య వైరం ఎప్పుడు విస్ఫోటనమవుతుందోనన్న భయాందోళనలు సర్వత్రా నెలకొని ఉండేవి. కానీ.. సోవియట్ రష్యా విచ్ఛిన్నంతో ప్రపంచం ఏకధృవంగా మారిపోయింది. మార్క్స్ సిద్ధాంతానికి కాలం చెల్లిపోయింది, సోషలిజం సాక్షాత్కారానికి ఆస్కారం లేదు, పెట్టుబడిదారీ వ్యవస్థ, స్వేచ్ఛా విపణి సమాజమే అంతిమం అనే వాదనలు, విశ్లేషణలు వెల్లువెత్తాయి. కానీ.. కార్మికవర్గానికి, సోషలిస్టు వాదులకు అక్టోబర్ విప్లవం ఎప్పటికీ మార్గదర్శిగానే నిలిచిపోయింది.

సోవియట్ రష్యా కూలిపోవడానికి కారణం లెనిన్ అనంతర ఆర్థిక, రాజకీయ కార్యక్రమాల్లో లోపాలే కానీ.. అంతటితో సోషలిజం అంతం కాలేదని నమ్మేవారూ ప్రపంచ వ్యాప్తంగా బలంగానే ఉన్నారు. సోషలిస్టు రష్యాలో అక్టోబర్ విప్లవ దినోత్సవాన్ని ఏటా అధికారికంగా ఎంతో ఘనంగా నిర్వహించేవారు. అది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వామపక్ష శక్తులకు కూడా పండగగానే ఉండేది. ఇప్పుడు అక్టోబర్ వందేళ్ల విప్లవ ఉత్సవాన్ని  రష్యాలో అధికారికంగా నిర్వహిస్తారా లేదా అన్నది అటుంచితే.. ప్రపంచ వ్యాప్తంగా వామపక్ష పార్టీలు, మేధావులు తమ పునరేకీకరణకు, మరింత లోతైన అధ్యయనానికి ఈ సందర్భాన్ని ఒక వేదికగా మలచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రష్యా విప్లవంపై ‘సాక్షి’ ఫోకస్...  - సెంట్రల్ డెస్క్
 
రష్యా సోషలిస్టు విప్లవానికి శతాబ్దం పూర్తి
ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన అక్టోబర్ విప్లవం

 
 మార్క్స్ ‘కార్మిక విప్లవా’న్ని ఆచరణలో పెట్టిన లెనిన్
- ప్రపంచంలో తొలి కార్మికవర్గ రాజ్యంగా అవతరణం
- ఎన్నో దేశాల్లో కమ్యూనిస్టు విప్లవాలకు స్ఫూర్తి ప్రదాత
- రెండు భిన్న ధృవాలుగా చీలిపోయిన ప్రపంచ దేశాలు
- రష్యా, అమెరికాలు ‘సూపర్ పవర్’లుగా ఆవిర్భావం
- ఇరువురి మధ్య అర్ధ శతాబ్దం పాటు ప్రచ్ఛన్న యుద్ధం
- పాతికేళ్ల కిందట పతనమైన సోవియట్ సోషలిస్ట్ రష్యా
 
 బ్లడీ సండే: తొలి సోవియట్ ఆవిర్భావం
 రష్యాలో 1917లో సోషలిస్టు విప్లవం రావడానికి అది విజయవంతం కావడానికి ఎన్నో చారిత్రక కారణాలున్నాయి. జార్ రాచరిక నిరంకుశ పాలనలోని రష్యాలో 1905 లోనే ఈ విప్లవానికి పునాదులు పడ్డాయి. పట్టణాల్లోని కార్మికవర్గం అవధులు లేని పనిగంటలతో సతమతమవుతుండేది. పెట్రోగ్రాడ్ (ఇప్పుడు సెయింట్ పీటర్స్‌బర్గ్.. అప్పటి రష్యా రాజధాని)లో జనవరి 22వ తేదీన (ఆదివారం) కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చక్రవర్తి (జార్) నికొలస్-2కు వినతిపత్రం ఇవ్వడం కోసం నిరాయుధంగా, శాంతియుతంగా ప్రదర్శనగా వెళుతున్నపుడు సైనికులు వారిపై కాల్పులు జరిపారు. ఆ ఘటనలో 1000 నుంచి 4000 మంది వరకూ చనిపోవడం, గాయపడటం జరిగిందని భిన్న అంచనాలు ఉన్నాయి. ‘బ్లడీ సండే’గా పేర్కొనే ఈ సంఘటనతో దేశవ్యాప్తంగా కార్మికవర్గ నిరసనలు, సమ్మెలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో కార్మికులు తొలి సోవియట్ (సహకార మండలి)ని స్థాపించారు. అక్కడి నుంచి దాదాపు అన్ని నగరాల్లోనూ ఈ సోవియట్‌లు ఏర్పడ్డాయి. కమ్యూనిస్టు రాజకీయ నిరసన అప్పుడే మొదలైంది.
 
 రెడ్ అక్టోబర్...
 ఫిబ్రవరి విప్లవం విజయవంతం కావడంతో అప్పటివరకూ స్విట్జర్లాండ్‌లో ప్రవాసంలో ఉన్న అతివాద బోల్షివిక్ నాయకుడు లెనిన్ తదితరులు ఏప్రిల్‌లో రష్యా చేరుకున్నారు. పెట్రోగార్డ్ సోవియట్‌లో బోల్షివిక్‌ల కన్నా మితవాద మెన్షెవిక్‌లు, సోషలిస్టు విప్లవవాదులు బలంగా ఉండేవారు. అయితే.. తాత్కాలిక ప్రభుత్వంలో డ్యూమాకు సోవియట్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. అక్టోబర్ నాటికి ఈ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ పరిస్థితులు సోషలిస్టు విప్లవానికి అనుకూలంగా ఉన్నాయని లెనిన్ గుర్తించాడు. లెనిన్ రాకతో అంతకంతకూ పుంజుకుంటూ వచ్చిన బోల్షివిక్‌లు విప్లవం లేవదీశారు. అప్పటికే పెట్రోగార్డ్ సోవియట్‌కు అనుబంధంగా నిర్మించిన రెడ్ గార్డ్స్ సాయంతో అక్టోబర్ 25వ తేదీన (కొత్త క్యాలెండర్ ప్రకారం నవంబర్ 7) ప్రభుత్వాన్ని తమ స్వాధీనం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా కార్మికుల సోవియట్‌ల చేతుల్లోకి అధికారాన్ని తీసుకోవడం మొదలైంది. ఈ విప్లవంలో ఏ వైపూ ఒక్కరు కూడా చనిపోలేదు. అందుకే ఇది రక్తపాత రహిత విప్లవంగా చరిత్రలో నమోదయింది. లెనిన్ సారథ్యంలో రష్యా కమ్యూనిస్టు పార్టీ అధికారం చేపట్టింది. ప్రపంచ చరిత్రలో సరికొత్త శకం ఆరంభమైంది.

 అంతర్యుద్ధం..: కానీ.. విప్లవం అంతటితో పూర్తవలేదు. అక్టోబర్ విప్లవం తర్వాత అంతర్యుద్ధం రాజుకుంది. సోవియట్లను, సోషలిస్టు వ్యవస్థను వ్యతిరేకించే వర్గాలు, జార్ రాచరిక అనుకూల వర్గాలతో పాటు.. అతివాద బోల్షివిక్‌లను వ్యతిరేకించే సోషలిస్టు రివల్యూషనరీలు ఒకవైపు.. బోల్ష్‌విక్‌లు మరొకవైపుగా అంతర్యుద్ధం జరిగింది. ఈ యుద్ధం కోసం రెండు పక్షాల వారూ కార్మికులు, రైతులను బలవంతంగా సైన్యంలో చేర్చేవారు. 1918లో జార్ కుటుంబాన్ని బోల్షివిక్‌లు చంపేశారు. కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రాగానే మొదటి ప్రపంచ యుద్ధం నుంచి రష్యా వైదొలగినా.. అమెరికాతో కూడిన మిత్రరాజ్యాలు అంతర్యుద్ధంలో జోక్యం చేసుకోవటంతో సోవియట్ల రెడ్ ఆర్మీ వారితోనూ పోరాడింది. నాలుగేళ్ల పాటు సాగిన ఈ అంతర్యుద్ధంలో లక్షలాది మంది చనిపోయారు. చివరికి రెడ్ గెలిచిన తర్వాత 1922 డిసెంబర్ 29న సోవియట్ రష్యా ఆవిర్భవించింది.
 
 విప్లవ కెరటాలు
 రష్యా విప్లవం స్ఫూర్తితో అదే సమయంలో జర్మనీలో, హంగరీ, ఇటలీ, ఫిన్‌లాండ్,  వంటి పలు దేశాల్లో కమ్యూనిస్టు విప్లవాలు తలెత్తాయి. కానీ.. పెద్దగా విజయాలు సాధించలేదు. కొన్నిచోట్ల విజయవంతమైనా కూడా ఎంతో కాలం నిలువలేదు.  అయితే అంతర్జాతీయ కమ్యూనిస్టు విప్లవం లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమాలు బలపడ్డాయి. అందులో రష్యా కమ్యూనిస్టు పార్టీ పాత్ర, సాయం కూడా ఉంది. అనంతర కాలంలోనూ చైనా, వియత్నాం, ఉత్తర కొరియా, క్యూబా తదితర దేశాల్లో కమ్యూనిస్టు విప్లవాలు విజయవంతమయ్యాయి. భారత్ సహా చాలా దేశాల్లో కమ్యూనిస్టులు కొందరు సాయుధ విప్లవ పంథా ఎంచుకోవడానికి రష్యా, చైనా విప్లవాలు మార్గదర్శిగా నిలిచాయి. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు విప్లవ ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి.

 సోషలిజం నిర్మాణ ప్రయత్నాలు...
 సోషలిస్టు రష్యాలో ఎన్నో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. కార్మికులకు 8 గంటల పనిదినం, రైతులకు భూముల పంపిణీ, బ్యాంకులు, పరిశ్రమల జాతీయీకరణ వంటి కార్మికవర్గ అనుకూల సంస్కరణలు జరిగాయి. సామూహిక వ్యవసాయం అమలు చేశారు. అందరికీ విద్యా హక్కు కల్పించారు. పారిశ్రామికీకరణ వేగవంతమైంది. అందరికీ పని అందించేందుకు కృషి చేశారు. దేశంలో పితృస్వామ్యం ఆధిపత్యాన్ని తగ్గించేందుకు కృషి జరిగింది. మహిళలకు, జాతిపరంగా మైనారిటీలకు సమాన హక్కులు కల్పించారు. వ్యవస్థీకృత మతాన్ని వ్యతిరేకించారు. ఇంట్లో మినహా అన్నిచోట్లా మత బోధనను నిషేధించారు. హేతువాద భావజాలాన్ని ప్రోత్సహించారు. విద్యను చర్చి నుంచి వేరుచేశారు. హేతువాదంతో కూడిన విద్యను అమలు చేశారు. అభివృద్ధిలో చాలా వెనుకబడిన దేశంలో సోషలిస్టు సమాజం నిర్మాణానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. పంచవర్ష ప్రణాళికలతో సోవియట్ రష్యా అనతి కాలంలోనే ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.  భారత్ సహా అభివృద్ధి చెందుతున్న, తృతీయ ప్రపంచ దేశాలకు డ్యాములు, పరిశ్రమల నిర్మాణం, ఆయుధాల సరఫరా వంటి వాటితో సహా ఆర్థికంగా, సాంకేతికంగా ఎంతో సాయం అందించింది.
 
 ప్రచ్ఛన్న యుద్ధం...
 మరోవైపు.. అదే సమయంలో అధికార కమ్యూనిస్టు పార్టీలో అంతర్గత పోరూ మొదలైంది. 1924లో లెనిన్ చనిపోయాక స్టాలిన్ అధికారం చేపట్టాడు. స్టాలిన్ విధానాలను వ్యతిరేకించిన రెడ్ ఆర్మీ వ్యవస్థాపకుడు ట్రాట్‌స్కీ దేశబహిష్కరణకు గురయ్యాడు. ఇదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం సంభవించింది. ఆ యుద్ధంలో హిట్లర్ సారథ్యంలోని నాజీ జర్మనీని రష్యా ఓడించింది. ప్రపంచ చరిత్రలో అది మరింత కీలకమైన మలుపు. కానీ యుద్ధంలో 2.6 కోట్ల మంది రష్యా ప్రజలు చనిపోయారు. అయితే.. యుద్ధం ముగిసిన తర్వాత రష్యా, అమెరికా ప్రయోజనాలు పరస్పరం విరుద్ధమైనవి కావడంతో వాటి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. తూర్పు యూరప్ మధ్య ఆధిపత్యం అంశంపై విభేదాలు తీవ్రమయ్యాయి. అణ్వాయుధాల తయారీ సహా రెండు దేశాల మధ్యా అన్ని రంగాల్లో పోటీ పెరిగిపోయింది. రష్యా, అమెరికాలు రెండూ ‘సూపర్ పవర్‌‘లుగా నిలిచాయి. దాదాపు ప్రపంచం మొత్తం ఈ రెండు దేశాల వెనుకా రెండు ధృవాలుగా విడిపోయింది. వాటి మధ్య ఎప్పుడైనా మూడో ప్రపంచ యుద్ధం జరగవచ్చన్నంత ఉత్కంఠగా పరిస్థితి మారిపోయింది.
 
  ఫిబ్రవరి విప్లవం...
 ఇక మొదటి ప్రపంచ యుద్ధం కూడా రష్యా ప్రజల్లో జార్‌పై, ఆయన పరిపాలనపై వ్యతిరేకతను పెంచింది. జార్ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునే లక్ష్యంతో రైతాంగాన్ని యుద్ధరంగంలోకి పంపించాడు. కానీ.. తన కన్నా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జర్మనీ చేతిలో రష్యా తీవ్రంగా నష్టపోయింది. వేలాది మంది యుద్ధరంగంలో నేలకూలుతున్నారు. మరోవైపు.. యుద్ధం కోసం భారీగా కరెన్సీ నోట్లు ముద్రించటంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. 1917 వచ్చేసరికి ధరలు నాలుగేళ్లలో నాలుగు రెట్లు పెరిగాయి. రైతులకు గిట్టుబాటు ధరలు లభించలేదు. పట్టణాల్లో పరిశ్రమలు సగానికి సగం మూతపడ్డాయి. నిరుద్యోగం అమాంతంగా పెరిగిపోయింది. కార్మికులకు రొట్టెలు దొరకటం గగనమైపోయింది. ఇంకోవైపు ఉన్న పరిశ్రమల్లో కార్మికులు పన్నెండు గంటలకు పైగా వెట్టిచాకిరి చేయాల్సిన దుస్థితి. అందులో మహిళలూ అధిక సంఖ్యలో ఉన్నారు.

ప్రభుత్వ విధానాలను సరళం చేయాలన్న డ్యూమా (పార్లమెంటు)ను జార్ రద్దు చేశాడు. ఈ పరిస్థితుల్లో  యుద్ధం ఆపాలని, శాంతి కావాలని, రొట్టెలు కావాలనే డిమాండ్లతో పెట్రోగార్డ్‌లో కార్మికులు సమ్మెకు దిగారు. భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. ప్రవాసంలో ఉన్న కమ్యూనిస్టు నాయకులు ఈ సమ్మెలకు, ఆందోళనలకు మద్దతు తెలిపారు. ఈ ఆందోళనలను అణచివేయాలని జార్ తన సైన్యాన్ని ఆదేశించాడు. కానీ అప్పటికే యుద్ధంలో దెబ్బతిని ఉన్న సైన్యంలో అధిక భాగం కార్మికులకు మద్దతుగా నిలిచారు. చాలా మంది పారిపోయారు. ఇక గత్యంతరం లేక 1917 మార్చి 2న (కొత్త క్యాలెండర్ ప్రకారం మార్చి 15న) జార్ నికొలస్-2 చక్రవర్తి పీఠాన్ని త్యజించాడు. ఆయన సోదరుడు ఆ పీఠం స్వీకరించేందుకు నిరాకరించాడు. దీంతో రాచరిక డ్యూమా, పెట్రోగార్డ్ సోవియట్ కలిసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రాజ్యాంగ శాసనసభకు ఎన్నికలు నిర్వహించడం ఈ సర్కారు ముఖ్య లక్ష్యం.
 
 సోవియట్ పతనం...
 1953లో స్టాలిన్ మరణంతో రష్యాలో అధికారం కోసం అంతర్గత పోరాటం మొదలైంది. కృశ్చేవ్ అధికారం చేపట్టి తన పట్టు బిగించాడు. ఆయన విఫలమయ్యాడంటూ కమ్యూనిస్టు పార్టీ స్వయంగా 1964లో తొలగించింది. ఆ తర్వాత బెద్నేవ్, కోసిజిన్, పోద్గోర్నీలు ఉమ్మడిగా నాయకత్వం వహించారు. అనంతరం బ్రెజ్నేవ్ నాయకత్వం చేపట్టాడు. కృశ్చేవ్, బ్రెజ్నేవ్‌ల హయాంలో రష్యా పారిశ్రామిక, అంతరిక్ష రంగాల్లో శిఖరస్థాయికి చేరుకుంది. కానీ.. ఆ సమయంలో వేగంగా సాగుతున్న ఆధునికీకరణ, కంప్యూటరీకరణల్లో రష్యా అంతకంతకూ వెనుకబడిపోయింది. రష్యా ఆర్థిక వ్యవస్థలో కీలక భాగమైన చమురు ధరలు ఎగుడుదిగుళ్లు కావడంతో సమస్యలు మొదలయ్యాయి. ఆండ్రపోవ్, చెరెన్కోల తర్వాత అధికారం చేపట్టిన గోర్బచేవ్.. రష్యా కమ్యూనిస్టు పార్టీని ఆధునీకరించే పని మొదలుపెట్టాడు. అధికారంలో పార్టీ పట్టును సడలించాడు. సామాజిక సమస్యలపై ప్రజలు దృష్టి సారించడం పెరిగింది. ఈ క్రమంలో గోర్బచేవ్, పార్టీ నాయకుడు ఎల్సిన్‌ల మధ్య అధికార పోరు తీవ్రమైంది. అనేక నాటకీయ పరిణామాల తర్వాత 1991 డిసెంబర్ 26న సోవియట్ యూనియన్ రద్దయింది. రష్యా ఫెడరేషన్ అవతరించింది. రష్యా సూపర్ పవర్ హోదా కోల్పోయింది.

 కమ్యూనిజం భవిష్యత్?
 సోవియట్ రష్యా పతనం ప్రపంచ వ్యాప్తంగా వామపక్ష వాదులను ఎంతో నిస్పృహకు లోను చేసింది. ఇక మార్క్సిజం, కమ్యూనిజాలు విఫలమయ్యాయన్న వాదనలు వ్యతిరేక వర్గం నుంచి వెల్లువెత్తాయి. సరళీకృత స్వేచ్ఛా మార్కెట్ వ్యవస్థే ప్రపంచానికి అంతిమ పరిష్కారమన్న సూత్రీకరణలు జరిగాయి. అయితే వామపక్ష వాదులు అది కేవలం విప్లవానికి ఒక ఎదురు దెబ్బేనని, సోషలిస్టు స్థాపనకు నిరంతర ప్రయత్నం సాగుతూనే ఉంటుందని విశ్వసిస్తున్నారు.  
 
 నవంబర్‌లో అక్టోబర్ విప్లవం..!
 రష్యా సోషలిస్టు విప్లవానికి అక్టోబర్ విప్లవం అని పేరు. కానీ.. ఆ విప్లవం సంభవించింది ప్రస్తుత కేలండర్‌లో నవంబర్ 7వ తేదీ. విప్లవం వచ్చే సమయానికి రష్యాలో జూలియన్ కేలండర్ ఉపయోగించేవారు. ఆ కేలండర్ ప్రకారం.. అక్టోబర్ 25వ తేదీన ఈ విప్లవం సంభవించింది. ఆ తర్వాతి నుంచి ఉపయోగిస్తున్న గ్రెగోరియన్ కేలండర్‌లో అది నవంబర్ 7వ తేదీ అయింది. అందుకే అక్టోబర్ విప్లవం ఉత్సవాన్ని నవంబర్‌లో నిర్వహించుకుంటారు.

Advertisement
Advertisement