ఆ ఎక్స్‌-రే హాలీవుడ్‌ స్టార్‌ మార్లిన్‌ మన్రోదట..

18 Sep, 2019 18:34 IST|Sakshi

న్యూఢిల్లీ : అదేంటి! ఎక్స్‌రే ఫిల్మ్‌ హాలీవుడ్ సినీ అభిమానుల కలల సుందరి మార్లిన్ మన్రో అంటున్నారేంటి, ఆమె ఎప్పుడో చనిపోయిందిగా అనుకుంటున్నారా ? అక్కడే ఉంది అసలు విషయం .ముందు స్టోరీ మొత్తం చదవండి, తర్వాత మీకే విషయం మొత్తం అర్థమవుతుంది. జింబాబ్వేలో ఓ వ్యక్తి తన ఛాతిలో బొద్దింక కనిపించిన ఎక్స్‌రే ఫిల్మ్‌ను 'మిస్టర్‌ సైంటిఫిక్‌' ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి ఛాతి పరీక్ష కోసం జింబాబ్వేలో ఓ ఆసుపత్రికి వెళ్లగా..  వైద్య పరీక్షలు నిర్వహించి ఎక్స్‌రే తీశారు. ఎక్స్‌రే ఫిల్మ్‌లో బొద్దింక కనిపించడంతో వెంటనే సదరు వ్యక్తిని సర్జరీ చేయించుకోవడానికి ఇండియాకు వెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు.

డాక్టర్లు చెప్పిన విషయాన్ని నమ్మిన ఆ వ్యక్తి తనకున్న ఆస్తిని మొత్తం అమ్మి సర్జరీ కోసం ఇండియాకు వచ్చాడు. కాగా, ఇక్కడి వైద్యులు అతనికి అన్ని పరీక్షలు నిర్వహించి అతని ఛాతిలో బొద్దింక లేదని, అది కేవలం ఎక్స్‌రే మిషన్‌లో ఉన్న బొద్దింక ఇమేజ్‌... ఆ ఫిల్మ్‌ మీద పడటంతో అలా కనిపించిందని తెలిపారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న బాధితుడు గుండెలు బాదుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది.  

ఫేక్‌ న్యూస్‌లను పసిగట్టడంలో సిద్ధహస్తులైన యాంటీ ఫేక్‌ న్యూస్‌ వార్‌ రూమ్‌ రంగంలోకి దిగింది. ఇదంతా కల్పితమని, కేవలం ఫోటోలను మార్పింగ్‌ చేశారని బయటపెట్టింది. గూగుల్‌ ద్వారా రివర్స్‌ ఇమేజింగ్‌ ప్రాసెస్‌ ద్వారా ఒరిజినల్‌ ఇమేజ్‌ను కనుగొన్నామని పేర్కొన్నారు. కాగా, ఆ ఎక్స్‌రే ఫిల్మ్‌ ఒకప్పటి హాలీవుడ్‌ స్టార్‌ మార్లిన్ మన్రోదని, కొన్నేళ్ల క్రితం కూడా ఇలాంటి కథనమే సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిందని తెలిపారు. 1954లోమార్లిన్ మన్రో గైనకాలజీకి సంబంధించిన ఆపరేషన్‌ కోసం ఓ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు నిర్వహించుకున్నారు. అందులో ఒకటి ఛాతికి సంబంధించిన ఎక్స్‌రే ఫిల్మ్‌ కూడా ఉందని వెల్లడించారు. కాగా 2010లో మన్రోకు సంబంధించిన మూడు ఫిల్మ్‌ ఎక్స్‌రేలు వేలం వేయగా 45వేల డాలర్ల ధర పలికిందని స్పష్టం చేశారు. ఇప్పుడు ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేసిన ఫోటోనూ రివర్స్‌ ఇమేజింగ్‌ ప్రాసెస్‌ చేయడంతో అసలు విషయం బయటపడిందని పేర్కొన్నారు. అదండీ దీని వెనకున్న అసలు రహస్యం. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు