ట్రంప్.. నీ టెంపర్ తగ్గించుకుంటే మంచిది: ఒబామా | Sakshi
Sakshi News home page

ట్రంప్.. నీ టెంపర్ తగ్గించుకుంటే మంచిది: ఒబామా

Published Tue, Nov 15 2016 9:08 AM

ట్రంప్.. నీ టెంపర్ తగ్గించుకుంటే మంచిది: ఒబామా - Sakshi

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి కొత్తగా ఎన్నికైన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తన టెంపర్ (కోపం) తగ్గించుకుంటే మంచిదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఆయన మునుపటిలాగా వ్యవహరిస్తే బాగోదని చెప్పారు. ఆయన మాట్లాడే ప్రతి మాటను ఇక నుంచి చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుందని, ప్రచారంలో మాదిరిగా మాట్లాడొద్దని సూచించారు. శ్వేత సౌదం వద్ద జరిగిన పత్రికా మండలి సదస్సులో ట్రంప్కు ఒబామా పలు సూచనలు చేశారు.

’ట్రంప్కు తెల్లవారు జామున కూడా ఫోన్ కాల్స్ వస్తుంటాయి. వాటికి ఓపిగ్గా ఆయన బదులివ్వాలి. తన ఆవేశాన్ని కొంత సర్దుకోవాలి. జనవరి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కలుసుకునే వారితో సహనంగా మెలిగాలి. ట్రంప్ కోపానికి చాలా కారణాలు ఉండొచ్చు. కానీ, అవి ఆయనకు మంచిది కాదు.. ఒక వేళ ఎప్పుడైనా నోరు జారినా తిరిగి వాటిని గుర్తించి తిరిగి అలాంటివి జరగకుండా  చూసుకోవాలి. ఎన్నికల బరిలో అభ్యర్థిగా ఉన్నప్పుడు ఏదైనా చెప్పొచ్చు.. అది వివాదం కావొచ్చు.. సరికానిది కావొచ్చు.. దానివల్ల ప్రభావం కొంతే ఉంటుంది. కానీ ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారో వెంటనే ప్రపంచమంతా ఇటువైపే చూస్తోంది. అందుకే ట్రంప్ జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని అన్నారు. ట్రంప్ చేసుకుంటున్న నియామకాల గురించి మాత్రం ఒబామా స్పందించేందుకు నిరాకరించారు. అది ఆయన వ్యక్తిగతమన్నారు.
 

Advertisement
Advertisement