నిద్రలేమితో కోట్ల రూపాయల నష్టం! 

8 Jan, 2019 22:02 IST|Sakshi

సరిపడా నిద్రలేకపోతే ఏమవుతుంది? ఆరోగ్య సమస్యలు వస్తాయంటారా!  అయితే నిద్రలేమి కేవలం వ్యక్తుల ఆరోగ్యాలకే కాదు.. ఆర్థిక నష్టాలకూ కారణమవుతోందట! నిద్రలేమికి, ఆర్థిక నష్టానికి సంబంధమేంటని ఆలోచిస్తున్నారా... అయితే ఈ స్టోరీ చదవండి...          

సరైన నిద్రలేకపోతే మనిషి ఆరోగ్యంగా ఉండలేడు. ఆరోగ్యంగా లేకపోతే సరిగా పనిచేయలేడు. ఇప్పుడిదే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్‌ కంపెనీలకు నష్టంగా మారుతోంది. నిద్రలేమి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా  ఏటా లక్ష కోట్ల డాలర్ల మేర నష్టపోతున్నట్లు తాజా సర్వేలో తేలింది. రాండ్‌ అనే ఓ సంస్థ 34 ఓఈసీడీ (ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కో–ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) దేశాల్లో సర్వే నిర్వహించి ఈ వివరాలు వెల్లడించింది. ఉద్యోగులు తమ పని ఒత్తిడిని ఇంటికి తీసుకెళ్తున్నారు. అక్కడా పని చేస్తున్నారు. దీనివల్ల రాత్రి సరిగా నిద్రపోవడం లేదు. సరిపడా విశ్రాంతి లేకుండానే మళ్లీ ఆఫీసులకు వస్తున్నారు. దీనివల్ల ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోతోంది. ఇలా భారీ నష్టాలు కంపెనీల కొంప ముంచుతున్నాయి. 

మొదటి స్థానంలో అమెరికా... అభివృద్ధి విషయంలో ప్రపంచంలో ముందుండే అమెరికా నిద్రలేమి కారణంగా ఎక్కువగా నష్టపోతున్న దేశాల్లోనూ ముందువరుసలో ఉండడం గమనార్హం. నిద్రలేమి కారణంగా ఈ దేశం ఏటా 41,100 కోట్ల డాలర్లు నష్టపోతున్నట్లు తేలింది. ఇక 13,800 కోట్ల డాలర్ల నష్టంతో జపాన్‌ రెండో స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో జర్మనీ, యూకే, కెనడా ఉన్నాయి. ఇక ఎక్కువ ఉద్యోగులుండే భారత్, చైనాలో నిద్రలేమితో జరుగుతోన్న నష్టాన్ని ఇప్పటి వరకు ఎవరూ లెక్కించలేదు. నిద్రలేమితో కలుగుతోన్న నష్టాన్ని పూడ్చుకోవడానికి జపాన్‌లోని కొన్ని కంపెనీలు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా ఉద్యోగులు కాసేపు కునుకు తీయడానికి ఆఫీసుల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాయి.

మరిన్ని వార్తలు