కునుకు పట్టట్లేదా..! | Sakshi
Sakshi News home page

కునుకు పట్టట్లేదా..!

Published Tue, Jul 11 2017 1:27 AM

కునుకు పట్టట్లేదా..!

కొందరికి రాత్రి వేళల్లో నిద్రపట్టాలంటే గగనమే. ఎంత ప్రయత్నించినా నిద్ర రావట్లేదు అని మనలో చాలామందే అనుకుంటూ ఉంటాం. ఇలా నిద్రపట్టకపోవడానికి జన్యుపరమైన కారణాలు కావొచ్చని చెబుతున్నారు రాక్‌ఫెల్లర్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు. చాలామందికి నిద్రలేమి వారసత్వంగా కూడా రావొచ్చని చెబుతున్నారు. జీవితాంతం తెల్లవారుజామున రెండు మూడు గంటలకు మాత్రమే నిద్రపట్టే మహిళపై చేసిన పరిశోధనల ఆధారంగా తాము ఈ అంచనాకు వచ్చినట్లు అలీనా పార్కే తెలిపారు.

సీఆర్‌వై 1 అనే జన్యువులో తేడా ఉండటం వల్ల నిద్ర తొందరగా పట్టదని, నిద్రకు ఉపకరించే హార్మోన్‌ మెలటోనిన్‌ కూడా చాలా ఆలస్యంగా ఉత్పత్తి జరుగుతుందని పేర్కొన్నారు. సీఆర్‌వై1 జన్యువు క్లాక్, బీఎంఏఆర్‌ వంటి ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తుందని.. ఈ ప్రొటీన్లు మరిన్ని జన్యువులు పనిచేసేందుకు కారణమవుతాయని వివరించారు. ఈ జన్యువులో తేడా కారణంగా ఈ రెండు ప్రొటీన్లు ఉత్పత్తి కావని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో పనిచేసే ఇద్దరు వ్యక్తుల్లో జన్యుమార్పులు ఉన్నప్పటికీ వారికి ఏ విధమైన నిద్ర సమస్యల్లేవని తెలిసింది. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించొచ్చని అలీనా అంచనా వేస్తున్నారు.

Advertisement
Advertisement