హమాస్ ద్రోన్‌ను కూల్చేసిన ఇజ్రాయెల్ | Sakshi
Sakshi News home page

హమాస్ ద్రోన్‌ను కూల్చేసిన ఇజ్రాయెల్

Published Tue, Jul 15 2014 1:45 AM

Israel says it has shot down drone launched from Gaza

గాజా/జెరూసలెం: గాజాపై ఇజ్రాయెల్ సోమవారం కూడా వైమానిక దాడులు చేసింది. పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ తొలిసారి ప్రయోగించిన మానవ రహిత విమానాన్ని(ద్రోన్) కూల్చేసింది. తమ దేశంలోని అషదాద్ నగరానికి దగ్గర్లో తీరం వద్ద ఇది కనిపించిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. హమాస్ పాలనలోని గాజాలో ఆ సంస్థకు చెందిన మూడు సైనిక శిక్షణ కేంద్రాలపై విమానాలతో బాంబు దాడులు చేశామని వెల్లడించింది. ఈ దాడుల్లో నలుగురు చనిపోయారు. దీంతో ఇజ్రాయెల్ దాడుల మృతుల సంఖ్య 175కు చేరింది.  ఇజ్రాయెల్ భూభాగంలోని చాలా ద్రోన్‌లను పంపామని, వివరాలు తర్వాత వెల్లడిస్తామని హమాస్ తెలిపింది.
 
  ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసిన గాజాలోని బీత్ లహియాలో 17 వేల మంది రక్షణ కోసం ఐక్యరాజ్య సమితి శిబిరాలకు చేరుతున్నారు. మరోవైపు.. లెబనాన్ నుంచి సోమవారం కూడా తమ భూభాగంలోకి రాకెట్ దాడులు జరిగాయని ఇజ్రాయెల్  తెలిపింది. ఇదిలా ఉండగా, గాజాపై దాడుల్లో అమాక ప్రజల మృతిపై జమ్మూకాశ్మీర్‌కు చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) సోమవారం లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై చర్చకు  స్పీకర్ అంగీకరించకపోవడంతో ఆ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు.

Advertisement
Advertisement