నిద్ర లేమితో సమస్యలెన్నో..! | Sakshi
Sakshi News home page

నిద్ర లేమితో సమస్యలెన్నో..!

Published Wed, Jun 3 2015 9:15 AM

నిద్ర లేమితో సమస్యలెన్నో..!

ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే కారకాల్లో నిద్ర ముఖ్యమైంది. రాత్రి తగినంత సమయం ప్రశాంతంగా నిద్రపోతేనే మరునాడు కార్యక్రమాలు సక్రమంగా చేసుకోగలం. లండన్ పరిశోధకుల తాజా అధ్యయనంలో దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి. తగినంత నిద్ర లేకపోతే పిల్లలు, పెద్దలూ కూడా అవసరమైన దాని కంటే ఎక్కువ ఆహారం తీసుకుంటారని పరిశోధకులు తెలిపారు. ఇది ఊబకాయానికి దారితీస్తుందని అన్నారు. సరిగ్గా నిద్ర పోకపోవడం వల్ల కలిగే ఒత్తిడే దీనికి ప్రధాన కారణమని వెల్లడించారు. దీని వల్ల హార్మోన్లలో కూడా సమతుల్యం లోపించి ప్రవర్తనలో విభిన్నమైన మార్పులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదే పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే మధుమేహం, గుండెపోటు వచ్చే ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. ‘నిద్రలేమి వల్ల వచ్చే సమస్యలపై చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల దీన్ని ఒక సాధారణ సమస్యగా భావిస్తున్నారు. తొలి దశలోనే ఈ సమస్యను గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే జీవితమే నాశనం అయ్యే ప్రమాదం ఉంది’ అని ఈ అధ్యయనంలో పాల్గొన్న లుండాల్, నెల్సన్‌లు తెలిపారు. ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి వివరాలు ‘హెల్త్ సైకాలజీ’ అనే జర్నల్‌లో ప్రచురిత మయ్యాయి.
 

Advertisement
Advertisement