గృహ హింసలో పెరిగిపోతున్న పిల్లల పాత్ర! | Sakshi
Sakshi News home page

గృహ హింసలో పెరిగిపోతున్న పిల్లల పాత్ర!

Published Tue, Jan 26 2016 8:31 PM

గృహ హింసలో పెరిగిపోతున్న పిల్లల పాత్ర!

ఇండియాలో గృహ హింస అంటే  మహిళలపై భర్త, అత్తింటివారు జరిపే దారుణాలే కనిపిస్తాయి. లేదంటే అక్కడక్కడా చాలా అరుదుగా పిల్లలపై తల్లిదండ్రుల వేధింపులు కనిపిస్తాయి. కానీ ఆ దేశంలో గృహ హింసలో పిల్లలూ పోటీ పడుతున్నారట. పైగా వారంతా పదిహేడేళ్ళ లోపు వయసున్నవారే ఉంటున్నారట. ఇంతకూ వారి అడ్రస్ ఎక్కడో తెలుసుకోవాలనుకుంటున్నారా?

ఇంగ్లాండ్ కు చెందిన మెర్సీసైడ్ ప్రాంతంలో ఇప్పుడు... గృహ హింసకు పాల్పడుతున్న పిల్లల కేసులు ఎక్కువయ్యాయట. గతేడాది నమోదైన 11,586 గృహ హింస కేసుల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు  పదిహేడేళ్ళ లోపు వయసున్న పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రులపై వేధింపులకు పాల్పడుతున్నట్లు తేలింది. నెలకు వెయ్యిమంది దాకా తల్లిదండ్రులు..  పిల్లలు తమపై దాడికి దిగుతున్నారంటూ రిపోర్ట్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అటువంటి కేసుల్లో ఓ నాలుగు సంవత్సరాల కుర్రాడు, ఐదేళ్ళ బాలిక కూడా ఉన్నట్లు తెలిపారు.  

గతేడాది మొత్తం నమోదైన గృహ హింస కేసుల్లో విచారణ చేపట్టిన పోలీసులు 1,441 మందిని అదుపులోకి తీసుకోగా, 1,006 మంది పదిహేడేళ్ళ లోపు వయసున్న వారికి హెచ్చరికలు జారీ చేశారు. అయితే 2,106 అత్యధిక ఫిర్యాదులు 'మెర్సీసైడ్' ప్రాంతం నుంచే ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. లీ సెస్టర్ షైర్ లోని 49 ఏళ్ల మహిళపై దాడి చేసిన ఓ పన్నెండేళ్ళ బాలుడిని అలాగే 32 ఏళ్ళ మహిళపై దాడికి దిగిన 14 ఏళ్ల బాలికను కూడా పోలీసులు హెచ్చరించి వదిలిపెట్టినట్లు చెప్తున్నారు. మరోవైపు వెస్ట్ మెర్సియాలో నాలుగేళ్ళ కుర్రాడు, కుంబ్రియాలోని ఐదేళ్ళ బాలిక కూడా తల్లిదండ్రులపై వేధింపులకు పాల్పడినట్లు పోలీసు బలగాల దర్యాప్తులో వెల్లడైనట్లు ' ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ' గణాంకాలు చెప్తున్నాయి.

రోజు రోజుకూ గృహ హింసలో పిల్లల పాత్ర పెరిగిపోతుండటంతో ఈ సమస్య ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇలా పిల్లల విషయంలో సమస్యలు వచ్చినపుడు ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయాలా? తల్లిదండ్రుల సమస్యగా భావించాలా అంటూ  నేషనల్ ఛిల్డ్రన్ బ్యూరో ఛారిటీ సభ్యుడు ఎన్వర్ సాల్మన్ అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై వెస్ట్ మెర్సికా పోలీసులు విధానాలను సమీక్షించి చెప్తామంటూ సమాధానమిచ్చారు.

Advertisement
Advertisement