ప్రొటీన్ ఉత్పత్తి జన్యువులు19 వేలే! | Sakshi
Sakshi News home page

ప్రొటీన్ ఉత్పత్తి జన్యువులు19 వేలే!

Published Tue, Jul 8 2014 3:06 AM

ప్రొటీన్ ఉత్పత్తి జన్యువులు19 వేలే!

లండన్: మన శరీరంలో కణాలకు, జీవక్రియలకు అత్యవసరమైన ప్రొటీన్ల ఉత్పత్తికి ఆదేశాలిచ్చే జన్యువులు 19 వేలు మాత్రమే ఉన్నాయట. గతంలో ఇవి సుమారు లక్ష వరకూ ఉండొచ్చని భావించేవారు. కానీ మానవ జన్యుపటం(జీనోమ్)లో ప్రొటీన్ ఉత్పత్తి జన్యువులు 20,700 వరకూ మాత్రమే ఉండొచ్చని రెండేళ్ల క్రితం తేలింది. అయితే వాటిలో మరో 1,700 జన్యువులకు కూడా ప్రొటీన్ల ఉత్పత్తితో సంబంధం లేదని తాజాగా స్పానిష్ నేషనల్ కేన్సర్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఈ జన్యువులన్నీ కూడా సుమారు 5 కోట్ల ఏళ్లనాటి ప్రైమేట్ల నుంచే వారసత్వంగా వచ్చాయని, అప్పటి ప్రైమేట్లకు, ప్రస్తుత మానవులకు మధ్య జన్యుపరమైన తేడాలు చాలా స్వల్పమేనని కూడా వారు కనుగొన్నారు. కీలకమైన జన్యువుల సంఖ్య తగ్గేకొద్దీ వాటిపై మరింత విస్తృత పరిశోధనలు చేసేందుకు మార్గం సుగమం కానుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీరి పరిశోధన వివరాలు ‘హ్యూమన్ మాలిక్యులర్ జెనెటిక్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
 
 

Advertisement
Advertisement