పక్షులను దారిమళ్లించే రోబర్డ్..! | Sakshi
Sakshi News home page

పక్షులను దారిమళ్లించే రోబర్డ్..!

Published Wed, Sep 3 2014 2:20 AM

పక్షులను దారిమళ్లించే రోబర్డ్..! - Sakshi

లండన్: ఆకాశంలో విహరిస్తున్న ఈ పక్షి పేరేంటో తెలుసా? అరే.. కాళ్లు కూడా లేవు. పెద్దపెద్ద రెక్కలతో భలే ఎగురుతోందే అనుకుంటున్నారా? అయితే దీనిని ఇంతవరకూ ఎక్కడా చూసి ఉండరు లెండి. ఎందుకంటే ఇది డేగ రూపంలో ఉన్న రోబో! ‘రోబర్డ్’ అనే  ఈ రోబో పక్షిని నెదర్లాండ్స్‌లోని క్లియర్ ఫ్లైట్ సొల్యూషన్స్ సంస్థకు చెందిన నికో నిజెన్‌హూస్ తయారు చేశారు. ఉత్తర అమెరికాలో నివసించే పెరిగ్రిన్ ఫాల్కన్ అనే డేగను పోలి ఉన్న రోబర్డ్ అసలైన పక్షిలానే రెక్కలు ఊపుతూ ఎగురుతుందట. రకరకాల విన్యాసాలు చేస్తూ అసలైన పక్షులను ఆకర్షిస్తుందట.
 
 విమానాలకు పక్షులు ఢీకొనే ప్రమాదం ఎక్కువగా ఉన్నచోటికి ఈ రోబర్డ్‌ను పంపిస్తే.. అక్కడ అసలైన పక్షులను మాయచేసి ఇది వాటిని దూరంగా వేరేచోటికి తీసుకుపోతుందట. ముఖ్యమైన ప్రదేశాల్లో గుంపులుగా చేరి న్యూసెన్స్ చేసే పక్షులనూ ఇది వేరే చోటికి వెంటపెట్టుకుపోతుందట. నిజమైన డేగలానే 58 సెం.మీ. పొడవైన దేహం, 120 సెం.మీ. పొడవైన రెక్కలతో 3 కిలోల బరువుండే రోబర్డ్ గంటకు 80 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. అన్నట్టూ... కొన్ని మొండి లేదా అమాయక పక్షులు దీని మాయలో పడలేదనుకోండి.. అప్పుడు వాటిని భయపెట్టి అక్కడి నుంచి తరిమేసేందుకని దీనికి రెట్టింపు సైజున్న పెద్ద రోబర్డ్‌నూ నికో తయారు చేశాడట.

Advertisement
Advertisement