తోకచుక్కపై తొలి అడుగు! | Sakshi
Sakshi News home page

తోకచుక్కపై తొలి అడుగు!

Published Thu, Nov 13 2014 4:17 AM

తోకచుక్కపై తొలి అడుగు!

* దిగ్విజయంగా తోకచుక్కపై దిగిన ఫీలే ల్యాండర్
* పదేళ్లు ప్రయాణించి ల్యాండర్‌ను జారవిడిచిన రోసెట్టా వ్యోమనౌక
* ఖగోళ చరిత్రలో అద్భుత ఘట్టం
* ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈసా) అరుదైన విజయం  
* చైనాకు మోదీ పరోక్ష చురక
* దక్షిణ చైనా సముద్రంలో శాంతి నెలకొనాలని ఆకాంక్ష

 
లండన్: ఖగోళ చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. తొలిసారిగా ఓ తోకచుక్క చేతికి చిక్కింది. ‘67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో’ అనే తోకచుక్కను వెంటాడుతూ పదేళ్లుగా అంతరిక్షంలో ప్రయాణించిన ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈసా)కు చెందిన రోసెట్టా వ్యోమనౌక ఎట్టకేలకు ఫీలే ల్యాండర్‌ను తోకచుక్కపైకి జారవిడిచింది. తోకచుక్కపై తమ ఫీలే ల్యాండర్ విజయవంతంగా దిగిందని బుధవారం ఈసా ప్రకటించింది. దీంతో ఓ తోకచుక్కపై తొలిసారిగా వ్యోమనౌకను దింపిన ఘనతను ఈసా సొంతం చేసుకుంది. తోకచుక్కలపై అధ్యయనం ద్వారా 450 కోట్ల ఏళ్ల క్రితం సౌరకుటుంబం ఏర్పడినప్పటి పరిస్థితుల గురించి తెలుసుకోవచ్చు. అందుకే సుమారు 160 కోట్ల డాలర్ల ఖర్చుతో ఈసా ఈ ప్రయోగం చేపట్టింది.  
 
 ఉత్కంఠగా ఆ ఏడుగంటలు...
 ప్రతి ఆరున్నరేళ్లకోసారి సూర్యుడిని చుట్టి వస్తున్న ‘67పీ’ తోకచుక్క సెకను 18 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ 12 గంటలకోసారి తనచుట్టూ తాను తిరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ తోకచుక్క సమీపంలోకి వెళ్లి, దాని చుట్టూ తిరుగుతూనే ల్యాండర్ దానిపై పడేలా జారవిడవటం అనేది అతిక్లిష్టమైన ప్రక్రియ కావడంతో ఈసా శాస్త్రవేత్తల్లో ఉత్కంఠ నెలకొంది. 2004లో నింగిలోకి వెళ్లిన రోసెట్టా పదేళ్లుగా తోకచుక్క వెంటాడుతూ ఈ ఏడాది సెప్టెంబరులో దాని సమీపంలోకి చేరి చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ల్యాండర్‌ను జారవిడిచింది. సుమారు ఏడు గంటల పాటు 20 కి.మీ. దూరం కిందికి దిగిన ఫీలే ఎట్టకేలకు తోకచుక్కపై దిగిపోయి కొక్కేలను గుచ్చి దిగబడిపోయింది.

Advertisement
Advertisement