'మెట్రో'లో బాంబు పెట్టింది వీడే.. | Sakshi
Sakshi News home page

'మెట్రో'లో బాంబు పెట్టింది వీడే..

Published Tue, Apr 4 2017 10:52 PM

'మెట్రో'లో బాంబు పెట్టింది వీడే.. - Sakshi

మాస్కో‌: సెయింట్‌పీటర్స్‌బర్గ్‌ మెట్రో సబ్‌వే స్టేషన్‌లో జరిగిన బాంబు పేలుడు కేసులో నిందితుడిని కిర్గిస్తాన్‌వాసి అక్బర్‌ఝాన్‌ జలిలోవ్‌గా గుర్తించారు. ఈ  విషయాన్ని కిర్గిస్తాన్‌ రిపబ్లిక్‌ జాతీయ భద్రతా కమిటీ అధికార ప్రతినిధి రఖత్‌ సులైమనోవ్‌ మంగళవారం వెల్లడించారు. నిందితుడికి రష్యా పౌరసత్వం కూడా ఉంది. పేలుడు కేసును రష్యా సిబ్బందితో కలిసి విచారిస్తున్నామని రఖత్‌ చెప్పారు. 
 
సోమవారం సాయంత్రం టెక్నాలజీచెస్కీ స్టేషన్‌ నుంచి బయల్దేరిన రైలు సెన్నయ్య లోశ్చద్‌ స్టేషన్‌ దిశగా ప్రయాణిస్తుండగా ఓ బోగీలో గుర్తుతెలియని వస్తువు పేలిపోవడం తెలిసిందే. ఇది ఉగ్రవాదుల దుశ్చర్యేనని రష్యా పేర్కొంది. ఈ ఘటనలో 11 మంది చనిపోగా మరో 51 మంది గాయపడడం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో మూడురోజులపాటు సంతాప దినాలను పాటిస్తున్నట్టు సెయింట్‌పీటర్స్‌బర్గ్‌ అధికారులు ప్రకటించారు. పేలుడు జరిగిన సమయంలో తన పర్యటనలో భాగంగా అనూహ్యంగా అక్కడే ఉన్న రష్యా అధ్యక్షుడు ఘటనాస్థలిని సందర్శించి మృతదేహాలపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించడం తెలిసిందే.
 
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
ఈ ఘటన నేపథ్యంలో మెట్రో మార్గంలోని అన్ని స్టేషన్లలోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. టెక్నాలజీచెస్కీ స్టేషన్‌ను మంగళవారం తిరిగి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లో మంగళవారం రష్యా జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. మరోవైపు ఈ ఘటనపై ఉగ్రవాద దాడి కోణంలో విచారణ ప్రారంభించారు. అయితే ఇతర కారణాలేమయినా ఉన్నాయా అనే దిశగా కూడా దర్యాప్తు జరుపుతామని సంబంధిత అధికారులు తెలియజేశారు. 
 
ఖండించిన చైనా 
సెయింట్‌పీటర్స్‌బర్గ్‌ స్టేషన్‌లో జరిగిన పేలుడు ఘటనను చైనా ఖండించింది. ఉగ్రవాదం ముప్పును నిరోధించేందుకు రష్యాతో కలసి పనిచేయడానికి సుముఖమేనని ప్రకటించింది. ‘ఈ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. ఉగ్రవాదం మానవాళికి సార్వత్రిక ముప్పుగా పరిణమించింది. ఈ సవాళ్లను అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా ఎదుర్కోవాలి’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్‌ మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
ఐసిస్‌లోకి మాజీ సోవియట్‌ వాసులు
మాజీ సోవియట్‌ యూనియన్‌ దేశాలకు చెందిన ఏడు వేలమంది ఐసిస్‌ ఉగ్రవాద సంస్థలో చేరారు. వీరిలో 2,900 మంది రష్యన్లు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని రష్యా గూఢచార సంస్థ మంగళవారం మీడియాకు వెల్లడించింది. 
 
14కు చేరిన మృతుల సంఖ్య
సెయింట్‌పీటర్స్‌బర్గ్‌ మెట్రో స్టేషన్‌లో జరిగిన బాంబు పేలుడు ఘటనలో చనిపోయినవారి సంఖ్య మంగళవారం 14కు చేరింది. ఈ విషయాన్ని రష్యా ఆరోగ్య శాఖ మంత్రి వెరోనికా స్క్వోర్ట్‌సోవా వెల్లడించారు.  
 
ఆత్మాహుతి దళ సభ్యుడి పనే
మెట్రో రైలులో బాంబు పేలుడు,,, ఆత్మాహుతి దళ సభ్యుడి పనే అయిఉండొచ్చని తాము అనుమానిస్తున్నట్టు దర్యాప్తు సంస్థ పేర్కొంది. రైలు బోగీలో ముక్కలైన మృతుడి శరీర భాగాలు లభించాయని, రైలులోని మూడో బోగీలో పెట్టిన పదార్థాన్ని అతడే పేలిపోయేలా చేసి ఉండొచ్చని భావిస్తున్నట్టు సంబంధిత అధికారులు చెప్పారు.

Advertisement
Advertisement