3డీబ్రెయిన్... ఎలుక మెదడులా పనిచేస్తుంది! | Sakshi
Sakshi News home page

3డీబ్రెయిన్... ఎలుక మెదడులా పనిచేస్తుంది!

Published Wed, Aug 13 2014 3:23 AM

3డీబ్రెయిన్... ఎలుక మెదడులా పనిచేస్తుంది! - Sakshi

అచ్చం ఎలుక మెదడు మాదిరిగా పనిచేసే కృత్రిమ త్రీడీ మెదడు ఇది. ఆప్టికల్ మైక్రోస్కోపు ద్వారా తీసిన ఈ చిత్రాన్ని బోస్టన్‌లోని టఫ్ట్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు విడుదల చేశారు. చిత్రంలో ఆకుపచ్చ, పసుపు రంగుల్లో కనిపిస్తున్నవి నాడీకణాలు కాగా.. నీలి రంగులో ఉన్నది పట్టుతో తయారుచేసిన మూస. మెదడు కణజాలాన్ని పోలినట్లు కృత్రిమ కణజాలంతో శాస్త్రవేత్తలు ఇలా నాడీకణాలను అభివృద్ధిచెందించారు. మూస రంధ్రాలు(నల్లరంగులో ఉన్నవి) గుండా వ్యాపించి, ఒకదానితో ఒకటి అల్లుకున్న ఈ నాడీకణాలు మెదడులోని నాడీకణాల మాదిరిగానే పనిచేస్తాయట. ఇంతవరకూ ఇలాంటి నాడీకణాలను చిన్నచిన్న గాజు గిన్నెల్లో, అదీ 2డీ రూపంలో మాత్రమే రూపొందించారు.
 
 ఇలా 3డీ నాడీకణాలను, కణజాలాన్ని తయారుచేయడం మాత్రం ఇదే తొలిసారట. ఈ 3డీ మెదడు రెండు నెలలకుపైనే సజీవంగా ఉంటుందట. మెదడు కణజాలానికి దెబ్బ తగిలినప్పుడు ఎలాంటి మార్పులు, నష్టం కలుగుతాయి? ఆ గాయాన్ని మాన్పేందుకు వివిధ మందులు వాడినప్పుడు మెదడు కణజాలం ఎలా ప్రతిస్పందిస్తుంది? అన్నది అధ్యయనం చేసేందుకు ఈ త్రీడీ మెదడును సృష్టించారట. తమ పరిశోధనతో మెదడు గాయాలకు, నాడీ వ్యాధులకు కొత్త చికిత్సలను కనుగొనేందుకు వీలుకానుందని వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.

Advertisement
Advertisement