పై అంతస్తు నుంచి దూకిన భార్య జుట్టందుకొని.. | Sakshi
Sakshi News home page

పై అంతస్తు నుంచి దూకిన భార్య జుట్టందుకొని..

Published Wed, Feb 8 2017 10:27 AM

Suicidal woman is saved from falling seven storeys after husband grabs her ponytail

బీజింగ్‌: ఈ సంఘటన చూస్తే ఎవరికైనా ఓ క్షణం గుండె ఆగిపోవాల్సిందే. భర్తపై కోపంతో ఏడంతస్తుల మీద నుంచి దూకిన ఓ భార్యను  జుట్టు పట్టుకొని భర్తే ఎలా రక్షించాడో చూస్తే అత్యంత ఉత్కంఠభరితులై పోవాల్సిందే. చూస్తున్నవారిని, రక్షించేందుకు అక్కడి వచ్చిన పోలీసులను తీవ్రంగా కంగారుపెట్టిన ఈ ఘటన చైనాలోని షాంగ్జీలో చోటుచేసుకుంది.  భార్యభర్తలైన కాంగ్‌, లీయూ షాంగ్జీలోని ఓ ఏడంతస్తుల భవనంలోని చివరి ఫ్లోర్‌లో నివాసం ఉంటున్నారు.

కుటుంబం విషయంలో భార్యభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి, ఒత్తిడికి గురైన కాంగ్‌ కోపంతో ఆత్మహత్య చేసుకునేందుకు పరుగెత్తింది. ఆమె వెంటే భర్త కూడా పరుగెత్తాడు. ఒక్కసారిగా ఆమె ఏడంతస్తుల మీద నుంచి దూకగా అనూహ్యంగా భర్త చేతికి ఆమె జుట్టు అందడంతో దాన్ని పట్టుకున్నాడు. కాంగ్‌  మాత్రం నన్ను వదిలేయ్‌ ప్లీజ్‌.. నన్ను చావనివ్వు.. అంటూ కేకలు పెడుతూనే గాల్లో వేలాడింది. కానీ భర్త మాత్రం పట్టువిడవకుండా అలాగే పట్టుకొని భార్యను పైగిలాగి ప్రయత్నం చేశాడు.

ఈలోగా పోలీసులు కూడా వచ్చి సహాయం చేసి కాంగ్‌  కిందపడకుండా రక్షించారు. ఈ తంతు దాదాపు అరగంటపాటు ఉత్కంఠగా సాగింది. ఓ పోలీసు భుజానికి గాయాలు కూడా అయ్యాయి. అయితే, కేవలం ఆమె జుట్టును పట్టుకోవడం వల్లే అతడు కాపాడలేదని, అక్కడ ఒక మురుగు నీరు పారే పైపు ఉండటంతో ఆమె ప్రాణాలు రక్షించడం సులువైంది. అయితే, మనిషి జుట్టుకు దాదాపు 12 టన్నుల బరువును ఆపగలిగే సత్తా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

Advertisement
Advertisement