140 ఏళ్లు బతికేస్తాం..!

25 Jan, 2018 02:26 IST|Sakshi
దావోస్‌లో సదస్సులో మాట్లాడుతున్న సత్య నాదెళ్ల

మరికొన్ని దశాబ్దాల్లో సాకారం

దావోస్‌లో నిపుణుల ధీమా  

దావోస్‌: ఆరోగ్యరంగంలో చోటుచేసుకుంటున్న అత్యాధునిక సాంకేతిక మార్పుల కారణంగా మనిషి ఆయుర్దాయం 140 ఏళ్లకు పెరిగే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడ్డారు. మరి కొన్ని దశాబ్దాల్లోనే ఇది సాకారం కానుందన్నారు. కృత్రిమ మేథ సహకారంతో చికిత్సా విధానాల్లో విప్లవాత్మక మార్పులు జరగనున్నాయన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు నేపథ్యంలో ‘ఆరోగ్యరంగాన్ని మారుస్తున్న నాలుగోతరం పారిశ్రామిక విప్లవం’ పేరుతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

కార్యక్రమంలో పాల్గొన్న  మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. ‘ఆరోగ్యరంగంలో కృత్రిమ మేథను వినియోగించడం వల్ల వైద్య నిపుణులు త్వరితగతిన, అత్యుత్తమ ఫలితాలను పొందవచ్చు’ అని తెలిపారు. కొత్త టెక్నాలజీ వల్ల ఆస్పత్రి నిర్వహణ రూపురేఖలే మారిపోతాయనీ, సిబ్బంది సంఖ్యతో పాటు ఆస్పత్రి ఖర్చులు భారీగా తగ్గిపోతాయని వెల్లడించారు. మెడిసిన్, సాంకేతికతల కలయికతో ప్రపంచం మరింత ఆరోగ్యకరంగా మారుతుందని పేర్కొన్నారు. ‘రాబోయే కొన్ని దశాబ్దాల్లో మనుషుల సగటు ఆయుఃప్రమాణం 140 ఏళ్లకు చేరుకుంటుంది.

ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం పౌరుల బాధ్యతగా మారడంతో ఆస్పత్రులు కేవలం నామమాత్రంగా మారుతాయి. ప్రమాదానికి గురయ్యే రోగిని ఆస్పత్రికి తరలించేలోపే అంబులెన్సులోని వైద్య సిబ్బంది రోగి ఆరోగ్యచరిత్రను 5జీ టెక్నాలజీ సాయంతో వేగంగా సేకరించి చికిత్సను ప్రారంభిస్తారు’ అని కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నిపుణులు తెలిపారు. శరీరంలో కార్టిసాల్, గ్లూకోజ్‌ స్థాయిల్లో ఏమాత్రం తేడా వచ్చినా హెచ్చరించే పరికరాలను రూపొందిస్తున్నట్లు నోకియా సంస్థ అధ్యక్షుడు రాజీవ్‌ సూరీ వెల్లడించారు. సాంకేతికత సాయంతో నాణ్యమైన మందుల్ని వేగంగా రోగులకు అందించగలమనీ, వ్యాధుల్ని కూడా చాలాముందుగానే పసిగట్టగలమని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు