ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ జేమ్స్‌ డిస్మిస్‌ | Sakshi
Sakshi News home page

ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ జేమ్స్‌ డిస్మిస్‌

Published Thu, May 11 2017 12:58 AM

ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ జేమ్స్‌ డిస్మిస్‌ - Sakshi

► అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన నిర్ణయం
► సంస్థను ప్రభావితం చేసేందుకేనని విమర్శలు  

వాషింగ్టన్‌: సంచలనాలకు, వివాదాలకు కేంద్రంగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ దేశంలోని అత్యున్నత దర్యాప్తు విభాగమైన ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌ జేమ్స్‌ కొమెను పదవి నుంచి తొలగించారు. ఈ విషయాన్ని ట్రంప్‌ నేరుగా కొమెకు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను కొమెకు పంపించారు. దీనిలో ‘మీరు బ్యూరోను సమర్థంగా నిర్వహించలేకపోతున్నారనే అమెరికా అటార్నీ జనరల్‌ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

ఈ మేరకు ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ జేమ్స్‌ కొమెను డిస్మిస్‌ చేస్తూ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారని వైట్‌హౌస్‌ అధికార ప్రతినిధి సీన్‌ స్పైసర్‌ ప్రకటించారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ జేమ్స్‌ కొమెను తక్షణమే విధుల నుంచి తొలగించాల్సిందిగా అటార్నీ జనరల్‌ జెఫ్‌ సెస్సన్స్, డిప్యూటీ అటార్నీ జనరల్‌ రాడ్‌ రోసెన్‌స్టెయిన్‌ సంయుక్తంగా ప్రెసిడెంట్‌కు లేఖ రాయడంతో, వారి వినతిని ట్రంప్‌ ఆమోదించారని సీన్‌ స్పైసర్‌ వెల్లడించారు. ఈనిర్ణయం తీవ్ర సంచలనం సృష్టించింది.

సరైన సమాచారం ఇవ్వనందునే...
రష్యాతో ట్రంప్‌నకు ఉన్న సంబంధాలపై ఎఫ్‌బీఐ విచారిస్తున్న సమయంలో ఆ సంస్థను ప్రభావితం చేసేందుకు తాజా చర్య తీసుకున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. అయితే.. క్లింటన్‌ ఈ–మెయిల్స్‌ దర్యాప్తు అంశానికి సంబంధించి గతవారం కాంగ్రెస్‌కు సరైన సమాచారం ఇవ్వని కారణంగానే ఆయన్ను తొలగించినట్లు ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా పదేళ్లు పదవిలో కొనసాగాల్సిన కొమె.. నాలుగేళ్లకే దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.

కొమె స్థానంలో ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న ఆండ్రూ మెక్‌కాబెను యాక్టింగ్‌ డైరెక్టర్‌గా నియమించారు. ఇలా తొలగింపునకు గురైన డైరెక్టర్లలో కొమె రెండో వ్యక్తి. 1993లో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ఉన్న విలియమ్‌ ఎస్‌ సెషన్స్‌ను అప్పటి అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ తొలగించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై చేపట్టిన దర్యాప్తు ట్రంప్‌కు చుట్టుకుంటుందన్న భయంతోనే కొమెను తొలగించినట్లు సెనెట్‌ నాయకుడు చుక్‌ షుమెర్‌ ఆరోపించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement