వైట్‌ హౌజ్‌ తప్పిదం.. నవ్వులపాలు | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 30 2018 11:01 AM

White House Error on Congress Invitation - Sakshi

వాషింగ్టన్‌ :  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసే ట్వీట్లలో తప్పిదాలు తరచూ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతుంటాయి. అయితే అందుకు తామూ మినహాయింపు కాదని ​వైట్‌ హౌజ్‌ అధికారులు నిరూపించారు. వారు చేసిన ఓ పొరపాటు ఇప్పుడు వార్తల్లో నిలిచింది.

మంగళవారం 115వ కాంగ్రెస్‌ సమావేశాల్లో భాగంగా స్టేట్‌ యూనియన్‌ సభ్యులను ఉద్దేశించి ట్రంప్‌ ప్రసంగించాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి వైట్‌ హౌజ్‌ నుంచి సభ్యులకు ఆహ్వానం పంపించారు. ఇన్విటేషన్‌ కార్డుల మీద ‘యూనియన్‌’ బదులు ‘యూనివోమ్‌’ అని పడింది. ఇంకేం ట్రంప్‌ కోసం కాసుకుని కూర్చునే వారంతా ఆ ఫోటోను పోస్టు చేసి ట్రోల్‌ చేస్తున్నారు. అధ్యక్షుడే చేసిన ట్వీట్లలో(స్పెల్లింగ్‌ల్లో) తప్పులు దొర్లినప్పుడు.. ఆయన కింద పని చేసే అధికారులు ఇలాంటి తప్పులు చేయటం మాములేనంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఇక​ దీనిపై వైట్‌ హౌజ్‌ అధికారులు స్పందించారు. టికెట్ల ముద్రణ బాధ్యతలు తమ చేతుల్లో లేవని చెబుతున్నారు. అయినప్పటికీ తప్పును గుర్తించిన అధికారులు వాటిని మళ్లీ ముద్రించి వెంటనే పంపిణీ చేశారంట. అయితే అవి పూర్తి స్థాయిలో జరగకపోవటంతో విమర్శల పర్వం ఆగటం లేదు. ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రోజున ‘‘HONERED to Serve’’ అంటూ ట్వీట్‌ చేసి నవ్వుల పాలవ్వటం తెలిసిందే. వెంటనే ట్రంప్‌ దానిని తొలగించేశారు.

'కోవ్‌ఫెఫె' (కమ్యూనికేషన్స్‌ ఓవర్‌ వేరియస్‌ ఫీడ్స్‌ ఎలక్ట్రానికల్లీ ఫర్‌ ఎంగేజ్‌మెంట్‌)... ఈ బిల్లు ప్రకారం అధ్యక్షుడు పోస్ట్‌ చేసే ట్వీట్లు, ఇతర సోషల్‌ మీడియా వ్యాఖ్యలను అధికారిక రికార్డులుగా పరిగణిస్తూ నేషనల్‌ ఆర్కైవ్స్‌లో భద్రపర్చాల్సి వుంటుంది. అధ్యక్షుడు ఆకస్మికంగా ప్రభుత్వ విధానాలను ప్రకటించేందుకు సోషల్‌ మీడియాను వేదికగా చేసుకున్నపుడు ఆ ప్రకటనలను భవిష్యత్‌ అవసరాల కోసం భద్రపరచాలని అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు ఈ కొత్త బిల్లును ప్రతిపాదించారు. కానీ, దీనిపై ట్రంప్‌ మొదటి నుంచి ఈ బిల్లుపై అంతగా ఆసక్తి చూపటం లేదు.

Advertisement
Advertisement