వైఫైతో గోడల్లోంచీ చూడొచ్చు! | Sakshi
Sakshi News home page

వైఫైతో గోడల్లోంచీ చూడొచ్చు!

Published Tue, Aug 12 2014 2:35 AM

వైఫైతో గోడల్లోంచీ చూడొచ్చు!

వాషింగ్టన్: ఉగ్రవాదులు ఒక భవనంలో దాక్కున్నారు.. చుట్టూ పోలీసులు మోహరించారు. కానీ లోపల ఎంత మంది ఉన్నారు? ఆయుధాలేమున్నాయి? అసలు లోపల గదులు, వస్తువులు ఏమున్నాయో తెలియదు.. పోలీసులు వెంటనే ఒక రోబోను రంగంలోకి దించారు. ఆ భవనాన్ని స్కాన్ చేసిన ఆ రోబో.. గోడల అవతల ఏముందో, ఎక్కడెక్కడ మనుషులున్నారో చూపించేసింది.. అంతే పోలీసులకు తమ పని సులువైపోయింది. అమెరికాకు చెందిన కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన సరికొత్త టెక్నాలజీ మహిమ ఇది. అసలు ఇలా గోడల అవతల ఏముందో స్కాన్  చేసి గుర్తించేందుకు ఉపయోగించేదేమిటో తెలుసా?.. ‘వైఫై’ టెక్నాలజీ. అదేనండీ ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లన్నింటిలోనూ ఉండే టెక్నాలజీయే!
 
రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నళ్ల ఆధారంగా గోడల అవతల ఉన్న వస్తువులు, మనుషులను ఇది గుర్తిస్తుంది. అంతేకాదు కలపతో చేసిన ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, లోహపు వస్తువులు ఇలా ఏ తరహాకు చెందినవో గుర్తించడంతోపాటు... గోడ అవతల ఎక్కడ, ఎంత దూరంలో ఉన్నాయో కూడా చెప్పేస్తుంది. మరో విశేషం ఏమిటంటే ఈ టెక్నాలజీని కేవలం రోబోలతో మాత్రమే కాకుండా... వైఫైతో పనిచేసే ఇతర పరికరాల్లోనూ వినియోగించుకోవడానికి అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులను గుర్తించడానికి ఈ టెక్నాలజీ ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement