మాకేవి పదవులు! | Sakshi
Sakshi News home page

మాకేవి పదవులు!

Published Sun, Mar 18 2018 11:08 AM

TRS Seniors leaders hopes on nominated posts in Karimnagar  - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాకు సంఖ్యాపరంగా పదవులు పెద్దసంఖ్యలోనే వచ్చినప్పటికీ టీఆర్‌ఎస్‌ మొదటితరం నాయకుల్లో కొందరికి అంతగా అవకాశం లేకుండా పోతోందని బాధపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది మాత్రమే మిగిలి ఉండడంతో ఇప్పుడు పదవులు రాకపోతే ఇక ఎప్పటికీ రానట్టేనన్న భావనలో ఉన్నారు. తమ బాధను వ్యక్తం చేసేందుకు అధినేత దర్శన భాగ్యమే కరువవుతోందని కొందరు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన నేతలకు పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ వంటి పోస్టులు రాగా, కొందరికి కీలకమైన రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ పదవులు దక్కాయి. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి చురుగ్గా పనిచేస్తున్న జీవీ రామకృష్ణారావుకు రెండు రోజుల క్రితమే ‘సుడా’ చైర్మన్‌ పదవి దక్కగా, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మిగిలిన సీనియర్‌ నేతలు నామినేటెడ్‌ పదవుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.

టీఆర్‌ఎస్‌ ఉద్యమం కేరాఫ్‌ కరీంనగర్‌
తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు నుంచి పార్టీలో పలువురు నేతలు పనిచేశారు. మరి కొందరు ఆలస్యంగా వచ్చినప్పటికీ ఉద్యమ కీలక సమయంలో క్రియాశీల పాత్ర పోషించారు. ఇందులో చాలా మందికి పార్టీ, నామినేటెడ్‌ పోస్టులు దక్కాయి. అయితే చివరి వరకు పేర్లు ప్రచారంలోకి వచ్చినా చాలా మందికి ఆ పదవులు అందని ద్రాక్షగానే  మారాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన పన్యాల భూపతిరెడ్డి, కట్ల సతీశ్, గంటల వెంకటరమణారెడ్డి, హుజూరాబాద్‌కు చెందిన బండ శ్రీనివాస్, కోరుకంటి చందర్, జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్, ఏవీ మైపాల్‌రెడ్డి తదితరులకు నామినేటెడ్‌ పదవులు దరిచేరలేదు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశాలు దక్కలేదు.

జిల్లాస్థాయి దూరమే!
ఇటీవల రైతుసమన్వయ సమితి కమిటీలు చేశారు. కరీంనగర్‌ జిల్లా చైర్మన్‌గా ఎంపికైన గూడెల్లి తిరుపతి గతంలో టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసి ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరారు. పెద్దపల్లి జిల్లా చైర్మన్‌గా ఎంపికైన కోట రాంరెడ్డి సుల్తానాబాద్‌ మండలం తొగర్రాయి సర్పంచ్‌గా పలుమార్లు పనిచేశారు. కాంగ్రెస్‌లో కీలకనేతగా పనిచేసిన రాంరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరగానే పదవీ వరించింది. రాజన్నసిరిసిల్ల జిల్లా రైతు సమన్వయ సమితి కో–ఆర్డినేటర్‌గా నియమితులైన గడ్డం నర్సయ్య గతంలో కాంగ్రెస్‌ పార్టీ బీసీసెల్‌ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి పదవులు కాకున్నా, జిల్లా స్థాయి నామినేటెడ్‌ పదవుల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న వేదన కనిపిస్తోంది. 

ఆశల పల్లకిలోనే సీనియర్లు 
నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి తాజాగా జాబితాలు సిద్ధమవుతున్నాయన్న ప్రచారంతో సీనియర్‌ టీఆర్‌ఎస్‌ నేతలు ఎవరికి వారుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్‌లు ఈ విషయంలో ఆచీతూచీ వ్యవహరిస్తుండగా, ఎమ్మెల్యేలు సైతం అందరినీ సమన్వయం చేసి జాబితా ఇచ్చే పనిలో ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా నామినేటెడ్‌ పోస్టుల కోసం రూపొందించిన జాబితాల్లో ఎవరెవరి పేర్లున్నాయనేది ప్రశ్నార్థకం కాగా, ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో ఆశావహుల పేర్లు పుకార్లు చేస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లాకు వచ్చే సరికి రాష్ట్ర, జిల్లాస్థాయి నామినేటెడ్‌ పదవుల కోసం పన్యాల భూపతిరెడ్డి, కట్ల సతీశ్, కొత్తకొండ శ్రీనివాస్, జక్కం నర్సయ్య, తిరుపతినాయక్, పొనగంటి మల్లయ్య, బండ శ్రీనివాస్, వీర్ల వెంకటేశ్వర్‌రావులతోపాటు 15 మందికిపైగా పేర్లు వినిపిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి చిక్కాల రామారావు, గ్రంథాలయసంస్థ చైర్మన్‌ కోసం ప్రయత్నించిన గూడూరి ప్రవీణ్, మాజీ ఎమ్మెల్యే రేగులపాటి పాపారావు, రవీందర్‌రావు తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ప్రతిష్టాత్మకమైన వేములవాడ ఆలయ కమిటీ చైర్మన్‌ పదవీ బాధ్యతలు మాత్రం ఎమ్మెల్యే రమేశ్‌బాబుకే సీఎం కేసీఆర్‌ అప్పగించనున్నట్లు చెప్తున్నారు. పెద్దపల్లి జిల్లాకు వస్తే రామగుండం నుంచి ఎమ్మెల్యేగా పార్టీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన కోరుకంటి చందర్‌తోపాటు దీటి బాలరాజు, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, పెద్దంపేట శంకర్, నల్ల మనోహర్‌రెడ్డి తదితరులు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లాలో కోరుట్ల, ధర్మపురి నియోజవకర్గాల నుంచి లోక బాపురెడ్డికి మార్క్‌ఫెడ్, కటారి చంద్రశేఖర్‌రావుకు గ్రంథాలయసంస్థ చైర్మన్లు దక్కగా, ప్రధానంగా డాక్టర్‌ సంజయ్‌కుమార్, తాటిపర్తి శరత్‌రెడ్డితోపాటు ఏడేనిమిది మంది పేర్లు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement