నా కథకి మా బాబాయే హీరో! | Sakshi
Sakshi News home page

నా కథకి మా బాబాయే హీరో!

Published Mon, Dec 9 2019 3:01 PM

Dhanlaxmi Happy Ending Telugu Love Story From Bangalore - Sakshi

నేను నా చిన్నప్పటినుంచి అబ్బాయిలతో ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. కానీ, ఒక రోజు నాకు తెలియకుండా మా అమ్మానాన్న నా పెళ్లి గురించి మాట్లాడుకుంటుండగా విన్నాను. మా పిన్ని తమ్ముడికిచ్చి చెయ్యాలని. కానీ, నేను అతన్ని ఒకటి, రెండు సార్లు చూశానంతే. ఫేస్ కూడా సరిగా గుర్తులేదు. కానీ, నాలో ఏదో తెలియని భావం మొదలైంది. మెల్లగా నాకే తెలియకుండా ఇష్టపడటం మొదలుపెట్టాను. ఆ తర్వాత అతను మా ఇంటికి వస్తాడని చాలా రోజులు ఎదురు చూశాను కానీ, రాలేదు. అప్పటికి తనకు ఉద్యోగం రాలేదు. ఆ తర్వాత ఒక సంవత్సరానికి ఉద్యోగం వచ్చింది. మా ఇంటికి వస్తాడని నేను అతని కోసం ఎదురుచూశాను. కొన్ని రోజులకు నా నిరీక్షణ ఫలించింది. అతను మా ఇంటికి ఓ రోజు సాయంత్రం వస్తాడని తెలిసింది. అతను వస్తున్నాడని తెలిశాక నా మనస్సు ఆనందంతో పొంగిపోయింది, ఉబ్బితబ్బుబ్బయ్యాను. అతను వచ్చాడు! కానీ, నేను ఏమీ మాట్లాడలేకపోయాను.

కనీసం అతని ముఖంలోకి కూడా చూడలేకపొయాను. అతను వెళ్లిపోయాడు. చాలా ఏడ్చాను, మళ్లీ ఎప్పుడు చూస్తానో అని. ఆ తర్వాత కొన్ని రోజులకు వాళ్ల పేరెంట్స్ మా సంబంధం క్యాన్సిల్ చేసుకున్నారని తెలిసింది. తనకి నేను నచ్చలేదేమో అనుకున్నా. ఎంతలా ఏడ్చానో మాటల్లో చెప్పలేను. ఆ తర్వాత కొన్ని రోజులకు తేరుకుని నా దృష్టంతా స్టడీస్ మీద పెట్టాను. గతాన్ని మర్చిపోవాలని ఏకాగ్రతగా చదివాను. అయినప్పటికి కొన్ని సందర్బాలలో ఆ గతం నన్ను చాలా బాధపెట్టింది. అలా ఒక సంవత్సరం గడిచింది. పరీక్షలు పూర్తయ్యాక ఇంటికి వెళ్లాను. నాకు ఒక విషయం తెలిసింది. నేను ఇష్టపడ్డ వ్యక్తే నన్ను పెళ్లిచూపులు చూసుకోవడానికి వస్తున్నారని.

నా ఆనందానికి అవధులు లేవు. అంతలోనే నిరాశ అలుముకుంది. అతనికి నేను నచ్చుతానో లేదోనని. ఆ తర్వాత అతని ఫోన్ నెంబర్ దొరికింది. నేను ఆ సస్పెన్స్ తట్టుకోలేక అతని నెంబరుకి కావాలనే నా ఫ్రెండ్‌కు మెసేజ్ చేస్తున్నట్లుగా మెసేజ్ చేశాను. తర్వాత నన్ను నేను పరిచయం చేసుకున్నా. కొన్నిరోజులకు ఇద్దరం బాగా దగ్గరయ్యాము. అతను నన్ను ఇష్టపడ్డాడు. మా ఫ్యామిలీస్ కూడా మా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఆ తర్వాత చకచకా మా పెళ్లి జరిగిపోయింది. మా పెళ్లి జరగడానికి ముఖ్యకారణం మా బాబాయ్. మా వెనుకే ఉండి పెళ్లి జరిపించాడు. అతని పేరెంట్స్‌ని కూడా ఒప్పించాడు. సో.. నా కథకి మా బాబాయే హీరో.
- ధనలక్ష్మి, బెంగళూరు


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement

తప్పక చదవండి

Advertisement