ప్రతీ అమ్మాయి వెంట పడేవాడిని.. కానీ..

21 Nov, 2019 15:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వయస్సులో ఉన్న అబ్బాయిలకి అమ్మాయిల వెంట పడడం అంటే ఈ రోజుల్లో ఒక అలవాటుగా మారింది. నాకూ అలాంటి అలవాటు ఉండేది. కాకపోతే ఆ అలవాటు నాకు కాస్త ఎక్కువగానే ఉండేది. కానీ, అలవాటుని మార్చిందో అమ్మాయి. ఆ అమ్మాయి పేరు ప్రియ. మన జీవితాల్లోకి కొందరు వ్యక్తులు అనుకోకుండా పరిచయం అవుతారు. వారి వల్ల మన జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. వాటిని మనం ఊహించలేం కూడా. అలా నా జీవితంలో నాకు పరిచయం అయిన వ్యక్తి ప్రియ! తన రాకతో నా తలరాతలో ఎన్నో మార్పులు వచ్చాయి. నేను కళాశాలలో చదువుతున్న రోజుల్లో నాకు అమ్మాయిల వెంట పడడం అనేది ఒక అలవాటుగా ఉండేది. నాకు కనిపించిన ప్రతి అమ్మాయి వెంట నేను పడేవాడిని. అమ్మాయి నాకు నచ్చితే చాలు ఇక ఆ అమ్మాయి వెంట తిరిగే వాడిని. ఆ అమ్మాయి నాతో మాట్లాడేంత వరకు ఆ తర్వాత ఆ అమ్మాయితో కలిసి సినిమాలకు, బేకరీలకు, పార్కులకి తిరిగే వాడిని. అలా తిరగడంతో నన్ను చూసి తిట్టుకోని అమ్మాయి లేదు.

అలా ఉన్న నా జీవితం ప్రియ రాకతో ఒక్కసారిగా మలుపు తిరిగింది. అమ్మాయిల వెంట తిరిగే నేను ఆ తర్వాత తిరగడం కాదు కదా! వాళ్లని చూడటం కూడా మానేశాను. అందరు అబ్బాయిలు వాళ్లకి నచ్చిన అమ్మాయిలని కళాశాలలోనో.. బస్‌స్టాప్‌లోనో చూసి ఉంటారు. కానీ, నా జీవితంలో విచిత్రం ఏమిటంటే నేను ప్రియని మొదటి సారిగా చూసింది మా ఇంట్లోనే. ఆ రోజు ఆదివారం సెలవు కావటంతో నేను ఇంట్లోనే ఉన్నా. ఆ రోజు ఉదయం నేను టీవీ చూసుకుంటూ కూర్చునా​. మా అమ్మ కూరగాయలు తెస్తా అని మార్కెట్‌కి వెళ్లింది. వచ్చే దారిలో అమ్మకి కళ్లు తిరిగి కింద పడిపోతుంటే ఒక అమ్మాయి వచ్చి పట్టుకుని అమ్మని జాగ్రత్తగా మా ఇంటికి తీసుకొచ్చింది. ఆ అమ్మాయి మరెవరో కాదు ప్రియ. నేను ప్రియని మొదటిసారిగా చూసింది కూడా అప్పుడే. అమ్మని ఇంటికి తీసుకొచ్చి జరిగింది అంతా నాకు చెప్పి అమ్మని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్లిపోయింది.

నాకు తనలో ఇతరులకి సహాయం చేసే మంచి వ్యక్తిత్వం, స్వభావం నన్ను చాలా ఆకట్టుకున్నాయి. ఏ అమ్మాయిని చూసినా ఈ అమ్మాయి వెంట పడాలి అని అనిపించే నాకు మొదటి సారిగా ఆ అమ్మాయిని చూడగానే నాకోసమే పుట్టిందేమో అన్న భావన!! బ్రతికితే ఈ అమ్మాయి కోసమే, ఈ అమ్మాయితోనే అన్న ఆలోచన నాలో కలిగింది. ఇక వెంటనే అమ్మని జాగ్రత్తగా పడుకోపెట్టి ఆ అమ్మాయిని తన ఇంటి దగ్గర దింపి వద్దాం అనే వంకతో తనతో మాట్లాడొచ్చు అని తన దగ్గరికి వెళ్లి ‘అమ్మని తీసుకొచ్చినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు. మీ ఇల్లు ఎక్కడో చెప్తే నేను మిమ్మల్ని అక్కడ దిగబెట్టి వస్తా’ అని చెప్పాను. దానికి తను ‘వద్దు! పర్లేదు.. నేను వెళ్లగలను. మీ అమ్మని జాగ్రత్తగా చూసుకోండి’ అని చెప్పి వెళ్లబోయింది. అంతలోనే అమ్మ పిలిచి తనతో కాసేపు మాట్లాడి ‘నువ్వు ఒక్క దానివే ఏం వెళ్తావు, మా కొడుకు నిన్ను మీ ఇంటి దగ్గర దింపి వస్తాడు’ అని ప్రియను ఒప్పించింది.

అందుకు అమ్మ మాట కాదనలేక ప్రియ ఒప్పుకుంది. తనతో మాట్లాడొచ్చని నాకు చాలా సంతోషం కలిగింది. తను మొదటి సారి అప్పుడే నా బైక్ ఎక్కింది. తనని నా బైక్‌పై ఎక్కించుకుని వెళ్లాను. దారి మధ్యలోనే మెల్లగా తన పేరు అడిగాను. అప్పుడే నాకు తన పేరు ప్రియ అని తెలిసింది. ఇక అదే సమయం అనుకుని మెల్లగా తను ఏం చేస్తుంది, ఎక్కడ ఉంటుంది అని  తెలుసుకున్నా. ఇక అంతలోనే తన ఇల్లు వచ్చింది. ఇక తను వెళ్లిపోయింది. అప్పటి నుండి నేను ప్రతి రోజూ తన కళాశాల దగ్గరికి వెళ్లేవాడిని తనని కలవడానికి. తను మొదట్లో నాతో సరిగ్గా మాట్లాడలేదు కానీ , ఒక రోజు తను ఇంటికి వెళ్లాల్సిన బస్సు రాలేదు చీకటి పడిపోతోందని తను కంగారుపడుతూ ఉంది. అప్పుడే నేను వెళ్లి తనని కలిశాను. తను ఆ సమయంలో ఎంతో సంతోషపడి తనని తన ఇంటి దగ్గర దింపమని అడిగింది. తను అలా అడగడంతో నా ప్రాణాలు గాలిలో లేచాయి. ఇక తనని జాగ్రత్తగా తన ఇంటి వద్ద దిగపెట్టి వెళ్లాను.

ఆ సంఘటన తర్వాత తను నాతో మెల్లమెల్లగా మాట్లాడడం మొదలు పెట్టింది. అలా అలా మా పరిచయం కాస్తా స్నేహంగా మారింది. నేను ప్రతి రోజు తను చదువుకునే కళాశాలకు వెళ్లేవాడిని. ప్రతి రోజు కళాశాల అయిపోగానే తనని తన ఇంటి వద్ద దింపి వెళ్లేవాడిని. ఆ సమయంలోనే తను నాకు ఇంకా దగ్గర అయింది. తన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడంతో తనకి నాకు మధ్య దూరం కాస్తా దగ్గర అయింది. అలా తనతో ప్రతి రోజూ మాట్లాడేవాడిని, కలిసేవాడిని. నాకు సంబంధించిన ప్రతి విషయం నేను తనతో పంచుకున్నాను. కానీ తను నాతో అన్నీ చెప్పుకునేది కాదు, నేను తనని ఇబ్బంది పెట్టలేక అడిగేవాడిని కాదు. అలా అలా తనపై నాకు ఉన్న ఇష్టం కాస్తా ప్రేమగా మారింది. ఇక ఎలాగైనా నా ప్రేమ విషయం తనతో చెప్పాలి అనుకున్నాను. ఎప్పటిలాగే తనని కలవడానికి అని కళాశాలకి వెళ్లాను. తనని కళాశాల నుండి వేరోచోటుకి తీసుకుని వెళ్లి తనతో "నువ్వు అంటే నాకు ఇష్టం. పెళ్లి అంటూ చేసుకుంటే అది నిన్నే" అని చెప్పాను.

తను నా మాటలు విని నిర్ఘాంత పోయింది. ‘నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు ఏం అర్థం కావటంలేదు. నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి? నేను ఎప్పుడు నిన్ను ఒక మంచి స్నేహితుడిగా భావించాను. నువ్వు ఇలా మాట్లాడుతూ మన మధ్య ఉన్న మంచి స్నేహాన్ని కాస్తా దూరం చెయ్యకు’ అని చెప్పింది. అయినా నేను వినకుండా తను అంటే ఇష్టం అని, నాలోని ఆ మార్పుకి కారణం కూడా తనే అని తననే నా జీవిత బాగస్వామిగా ఊహించుకున్నానని చెప్పాను. వెంటనే తను నన్ను లాగిపెట్టి ఒక్కటి కొట్టి ‘నువ్వంటే నాకు ఇష్టం లేదు! నేను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నాను’ అని చెప్పింది. అది విని నేను ఒక్కసారిగా ఆశ్యర్యపోయాను. ఇక అప్పుడు తను ఆ అబ్బాయి గురించి చెప్పింది. ఆ అబ్బాయి పేరు వినయ్ వాళ్లిద్దరూ గత 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఉద్యోగంలేని కారణంగా ప్రియ వాళ్ల ఇంట్లో ఒప్పుకోవడం లేదని వినయ్ ప్రస్తుతం ఉద్యోగం వెతికే పనిలో ఉన్నాడు.

ఆ సమయంలోనే ఒక మంచి స్నేహితుడిలా నువ్వు నాకు దగ్గర అయ్యావు అని చెప్పింది. ఇక నాకు ఏం అర్థం కాలేదు. తనే నా ప్రాణం అని అనుకున్నాను. కానీ, తన ప్రాణం ఇంకొకరు అని తెలిశాక తన ప్రాణాన్ని తనకి ఇవ్వాలి అనిపించింది. మనం ప్రేమించిన వారు సంతోషంగా ఉండడమే కదా మన సంతోషం అని అనుకుని. నాకు తెలిసిన నా స్నేహితుడి సంస్థలో వినయ్‌కి ఉద్యోగం వచ్చేలా చేశాను. ఆ తర్వాత వాళ్లిద్దరిని ప్రియ వాళ్ల ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ నాన్నతో మాట్లాడి వాళ్లిద్దరి పెళ్లికి ఒప్పించాను. దానితో ప్రియ ఎంతో సంతోషించింది. ఇక వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారు. ప్రియని ప్రేమించిన వ్యక్తిగా తన సంతోషాన్ని తనకి ఇచ్చి ఒక మంచి ప్రేమికుడిలా కాకపోయినా ఒక మంచి స్నేహితుడిలా తన దృష్టిలో మిగిలిపోయాను. మనం ప్రేమించిన వాళ్లకి మన ప్రేమను పంచడంలో ఎంత ఆనందం ఉంటుందో. వారి కోసం మనం పడే బాధలో కూడా అంతే ఆనందం ఉంటుంది. ప్రియ నాకు దక్కలేదన్న బాధ ఏమాత్రం లేదు. తను ఇష్టపడ్డ వాడిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది. అది కూడా నా వల్లనే జరిగినందుకు నాకు చాలా సంతషంగా ఉంది.
- రవి


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు