మా శ్రీదేవికి మరణం లేదు: చిరు | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 25 2018 1:46 PM

 Chiranjeevi Expresses His Deepest Condolences To Sridevi Family - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నటనతో కోటాను కోట్ల మంది ప్రేమను పొందిన శ్రీదేవికి మరణం లేదని, అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మెగాస్టార్‌ చిరంజీవి తెలిపారు. ఉదయం ఆమె మరణ వార్తను వినగానే ఒక్కసారిగా షాక్‌ గురయ్యానని ఆయన చెప్పారు. వాస్తవాన్ని జీర్ణించుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మనసు మనసులో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. ఇంత చిన్న వయసులో శ్రీదేవిని తీసుకెళ్లి ఆ భగవంతుడు అన్యాయం చేశారన్నారు.  శ్రీదేవి వంటి నటి గతంలో ఎవరూ లేరని, భవిష్యత్తుల్లో వస్తారని కూడా భావించడం లేదని చెప్పారు. శ్రీదేవికి నటన తప్ప మరొకటి తెలియదని..మరో ధ్యాస కూడా లేదన్నారు. అంతటి అంకిత భావం ఉన్న నటిని చూడలేమన్నారు. శ్రీదేవి అంకితభావాన్ని చూసి తాను కూడా ఎంతో నేర్చుకున్నానని, స్పూర్తి పొందానని చెప్పారు.

ఆమె కోసమే పాత్రలు పుట్టేవి...
శ్రీదేవితో తొలిసారి ‘రాణికాసుల రంగమ్మ’లో చేశానని, ఆ తర్వాత రెండు మూడు సినిమాలు తమ కాంబినేషన్లో వచ్చినప్పటికి అద్భుత చిత్రం మాత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ అని మెగాస్టార్‌ తెలిపారు. ఈ సినిమాలో దేవత పాత్రలో శ్రీదేవి ఒదిగిపోయిందన్నారు. ఆ పాత్ర కోసమే ఆవిడ పుట్టిందా అనిపించిందన్నారు. ఇక చివరి సారిగా ‘ఎస్పీ పరుశురాం’ లో నటించామన్నారు.

సినిమాల పరంగానే కాకుండా ఇరు కుటుంబాలకు మంచి సాన్నిహిత్యం ఉందన్నారు. ఎవరి కుటుంబంలోనైనా వేడుకలు జరిగితే కలుసుకునేవారమని చెప్పారు. తన 60వ పుట్టినరోజు వేడుకకు కూడా శ్రీదేవి, బోనీ కపూర్‌లు వచ్చి విష్‌ చేసారని మెగాస్టార్‌ గుర్తు చేసుకున్నారు.

Advertisement
Advertisement