ఆయనొక్కడే! | Sakshi
Sakshi News home page

ఆయనొక్కడే!

Published Thu, Jun 5 2014 11:17 PM

ఆయనొక్కడే!

వంద సినిమాలు చేసిన హీరోలు చాలామంది ఉన్నారు. వంద సినిమాల దర్శకులు కూడా చాలా మందే ఉన్నారు. కానీ వంద సినిమాల నిర్మాతలు ఎంత మంది ఉన్నారు? అంటే మాత్రం ఒకే ఒక్క సమాధానం ‘డి. రామానాయుడు’. నాలుగైదు భాషల్లో సినిమాలు తీసిన నిర్మాతలు చాలామంది ఉన్నారు. కానీ దేశంలో ఎన్ని భాషల్లో సినిమా ఉందో, దాదాపు అన్ని భాషల్లోనూ సినిమాలు తీసిన నిర్మాతలు ఎంత మంది ఉన్నారు? అనడిగితే... దానికీ సమాధానం ఒక్కటే ‘డి. రామానాయుడు’. ప్రపంచ సినీ చరిత్రలోనే ఎక్కడా కనిపించని, ఇంకెక్కడా వినిపించని ట్రాక్ రికార్డ్ ఇది.
 
 సినిమా సకలకళల సమ్మేళనమే. కానీ నిజానికి అదొక జూదం. ఎంత తేలిగ్గా శిఖరాగ్రానికి చేరుస్తుందో, అంతే తేలిగ్గా అథః పాతాళానికి తొక్కేస్తుంది. అందుకు ఎందరో నిర్మాతల జీవితాలే ఉదాహరణ. కానీ... నాయుడు మాత్రం సముద్రపు అంచున రాయి లాంటివారు. అలల తాకిడిని తట్టుకోవడమే కాదు, వాటితో అభిషేకం చేయించుకునే జాతకం ఆయనది. అందుకే నిర్మాతగా ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు చేరుకోగలిగారు. ఇది కేవలం అదృష్టమే అనుకుంటే పొరపాటు. దీని వెనుక అవిరళ కృషి ఉంది. స్క్రిప్ట్ చదువుకోకపోతే నిద్ర పట్టని నిర్మాత ఆయన.
 
 ప్రస్తుతం సినిమాలు తీయడం తగ్గించినా... నేటికీ ఏదో ఒక కథ చదవకపోతే ఆయనకు నిద్ర పట్టదంటే.. కథలపట్ల, కళల పట్ల ఆయనకు ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు.నిర్మాత డబ్బు పెడితే సరిపోదు. నిర్మాతకు అభిరుచి అవసరం, అవగాహన అవసరం, జడ్జిమెంట్ అవసరం. కళాత్మక దృష్టి అవసరం, విలు వలు అవసరం.. అవే రామానాయుడ్ని మూవీ మొగల్‌ని చేశాయి. ప్రస్తుతం తెలుగు సినిమాకు పెద్ద దిక్కు అంటే నాయుడుగారే.పద్మభూషణుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అయిన డి.రామానాయుడు పుట్టిన రోజు నేడు. 79వ పడిలోకి అడుగుపెడుతున్నారాయన. ఇలాగే వందేళ్లు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ...
 

Advertisement
Advertisement