Sakshi News home page

సంక్రాంతికి సీనియర్ల సందడి

Published Thu, Jun 23 2016 11:36 AM

సంక్రాంతికి సీనియర్ల సందడి - Sakshi

కుర్ర హీరోల హవా పెరగడంతో కొంతకాలంగా సీనియర్ హీరోలు స్లోగా సినిమాలు చేస్తున్నారు. దీంతో గతంలోలా పండగ సీజన్ లో ఒకేసారి సీనియర్ హీరోల సందడి కనిపించటం లేదు. ఒకప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిందంటే కనీసం ఇద్దరు స్టార్ హీరోలు బరిలో నిలిచేవారు. కానీ ప్రస్తుతం ఉన్న మార్కెట్, థియేటర్ల సంఖ్య దృష్ట్యా ఇటీవల కాలంలో ఆ స్థాయి పోటీ కుదరటం లేదు.

అయితే గత సంక్రాంతికి గట్టి పోటీనే కనిపించింది. ఇద్దరు సీనియర్ హీరోలు, ఇద్దరు యంగ్ హీరోలు ఒకేసారి బరిలో దిగి సత్తా చాటారు. అదే జోష్ లో వచ్చే సంక్రాంతికి కూడా భారీ పోటీకి రెడీ అవుతున్నారు తెలుగు దర్శక నిర్మాతలు. ఈ సారి ఏకంగా నలుగురు టాప్ స్టార్స్ బరిలో దిగే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.

సీనియర్ హీరోల్లో ఇప్పటికీ మంచి ఫాంలో ఉన్న నాగార్జున ప్రస్తుతం మరో భక్తిరస చిత్రం నమో వెంకటేశాయలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించేశారు. ఇక బాలకృష్ణ వందోచిత్రంగా తెరకెక్కుతున్న గౌతమీ పుత్ర శాతకర్ణిని కూడా అదే సమయంలో రిలీజ్ చేసుకుందుకు రెడీ అవుతున్నారు.

చాలా ఏళ్లుగా ఊరిస్తున్న మెగా స్టార్ రీ ఎంట్రీ చిత్రం కత్తిలాంటోడును కూడా సంక్రాంతి బరిలోనే దించాలన్న ప్లాన్ లో ఉంది మెగా కాంపౌండ్. అంతేకాదు మరో మెగాహీరో పవన్ కళ్యాణ్ హీరో డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాను కూడా సంక్రాంతి సమయానికి ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఒకే సమయంలో టాప్ హీరోలు రిలీజ్ లు ప్లాన్ చేస్తే థియేటర్ల సమస్య తప్పదన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ సమస్యలను పక్కన పెట్టి బరిలో దిగుతారో లేక ఇబ్బంది లేకుండా డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటారో చూడాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement