సుమంత్ అశ్విన్‌కి మంచి భవిష్యత్తు ఉంది : ప్రభాస్ | Sakshi
Sakshi News home page

సుమంత్ అశ్విన్‌కి మంచి భవిష్యత్తు ఉంది : ప్రభాస్

Published Sun, Nov 16 2014 11:07 PM

సుమంత్ అశ్విన్‌కి మంచి భవిష్యత్తు ఉంది :  ప్రభాస్

 ‘‘నాకు ‘వర్షం’ వంటి విజయవంతమైన చిత్రం ఇచ్చారు ఎమ్మెస్ రాజుగారు. ఆ సినిమా అప్పుడు సుమంత్ అశ్విన్ చిన్నవాడు. ఇప్పుడు హీరో అయ్యాడు. తనకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలి’’ అని ప్రభాస్ చెప్పారు. ఇలవల ఫిలింస్ సమర్పణలో రచయిత వేమారెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ, సీహెచ్. నరసింహాచారి, నరసింహారెడ్డి ఇలవల నిర్మిస్తున్న చిత్రం ‘చక్కిలిగింత’. సుమంత్ అశ్విన్, రెహానా నాయకా నాయికలు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ పాటలు స్వరపరిచారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుకలో అతిథిగా పాల్గొన్న ప్రభాస్ సీడీని ఆవిష్కరించి దర్శకుడు సుకుమార్‌కి ఇచ్చారు.
 
 ప్రచార చిత్రాన్ని ‘దిల్’ రాజు, సంస్థ లోగోను సుకుమార్, సురేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ - ‘‘ప్రభాస్ నా ఫేవరెట్ హీరో. ‘వర్షం’ సినిమాలో ప్రభాస్ జీప్ ఎత్తే సన్నివేశం, ఇంట్రడక్షన్ సీన్ తీసినప్పుడు లొకేషన్లోనే ఉన్నాను. హీరో అంటే ఇలా ఉండాలనుకున్నాను. ఆయన ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో నాది చాలా మంచి పాత్ర’’ అన్నారు. మంచి కథ కావడంతో చక్కని స్వరాలివ్వగలిగానని మిక్కీ చెప్పారు. దర్శకునిగా తనకిది తొలి చిత్రమనీ, అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలని వేమారెడ్డి అన్నారు. ఈ చిత్రంలో నటించడంపట్ల రెహానా ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకలో ఎమ్మెస్ రాజు, బీవీయస్‌యన్ ప్రసాద్, మారుతి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement