ఇక మా ఇద్దరి దారి వేరు | Sakshi
Sakshi News home page

ఇక మా ఇద్దరి దారి వేరు

Published Tue, Nov 1 2016 11:59 PM

ఇక మా ఇద్దరి దారి వేరు

కమల్‌హాసన్ నుంచి విడిపోయిన గౌతమి
కమల్‌హాసన్ వైవాహిక జీవితం విషయానికి వస్తే... 1978లో నృత్య కళాకారిణి వాణీ గణపతిని వివాహం చేసుకున్నారు. దశాబ్ద కాలం పాటు వారి వైవాహిక జీవితం సజావుగా సాగింది. ఆ తరువాత మనస్పర్ధల కారణంగా విడిపోయారు. మొదటి భార్య నుంచి విడిపోయిన కొన్నాళ్లకు  బాలీవుడ్ నటి సారికను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు కమల్. నిజానికి వీరి పెళ్లి కన్నా ముందే అంటే 1986లో శ్రుతీహాసన్ పుట్టారన్నది గమనార్హం. 1991లో ఈ దంపతులకు అక్షరా హాసన్ పుట్టారు.

కాగా 2002లో విడాకులు తీసుకోవాలను కున్నారు. ఆ తర్వాత రెండేళ్లకు చట్టపరంగా విడాకులు తీసుకున్నారు. అటుపైన కొన్నాళ్లకు గౌతమితో కమల్ అనుబంధం మొదలైంది. ముఖ్యంగా ఆమెకు కేన్సర్ సోకినప్పుడు బాగా దగ్గరయ్యారు. ఆ సమయంలో కమల్ ఇచ్చిన సపోర్ట్ మరచిపోలేనిదని గతంలో ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గౌతమి పేర్కొన్నారు.
 
గతంలో భర్త నుంచి విడాకులు...
విశాఖకు చెందిన తెలుగమ్మాయి అయిన గౌతమి హీరోయిన్‌గా బిజీగా ఉన్నప్పుడే 1998లో వ్యాపారవేత్త సందీప్ భాటియాను వివాహం చేసుకున్నారు గౌతమి. 1999లో వారికి పాప పుట్టింది. తర్వాత మనస్పర్థల కారణంగా గౌతమి, సందీప్ భాటియా విడాకులు తీసుకున్నారు.

‘‘ఈ మాట చెప్పడానికి నా మనసు ముక్కలైనట్లుగా అనిపిస్తోంది. కానీ, చెబుతున్నా. నేనూ, మిస్టర్ హాసన్ (కమల్‌హాసన్) విడిపోయాం. ఇప్పుడు మేం కలసి ఉండటం లేదు’’ అని మంగళవారం సోషల్ మీడియా ద్వారా తన నిర్ణయం గురించి ఓపెన్‌గా ప్రకటించారు. భర్త నుంచి విడిపోయాక కొన్నేళ్లు ఒంటరిగానే ఉన్న గౌతమికి కమల్‌తో మంచి అనుబంధం ఏర్పడడం, అది సహజీవనంగా మారడం అందరికీ తెలిసిందే. దాదాపు పదమూడేళ్లుగా ఈ ఇద్దరూ కలసి ఉంటున్నారు. ఇన్నేళ్ల బంధానికి ఇప్పుడు ఫుల్‌స్టాప్ పెట్టేశారు. ఆ విషయం గురించి గౌతమి మాటల్లో...
 
‘‘నా జీవితంలో తీసుకోవాల్సి వచ్చిన అతి కఠినమైన నిర్ణయాల్లో ఇదొకటి. పదమూడేళ్ల బంధాన్ని కాదనుకోవడం అంత సులువు కాదు. ఒక బంధానికి చాలా సిన్సియర్‌గా కట్టుబడి ఉన్న నేపథ్యంలో ఇద్దరి దారులు వేరని తెలిసినప్పుడు రెండు దార్లు ఉంటాయి. ఒకటి తమ కలలలను భగ్నం చేసుకుని రాజీపడి పోయి ఉండటం, రెండోది విడిపోయి ఎవరి దారిన వాళ్లు జీవించడం. మనసు ముక్కలయ్యే ఈ నిజాన్ని జీర్ణించుకోవడానికి కొంత సమయం పట్టింది. ఇది అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం కాదు.  చివరికి ఒక నిర్ణయం తీసుకునేలా చేసింది.
 
మార్పులు అనివార్యం
అందరి దగ్గర సానుభూతి సంపాదించుకోవాలన్నది నా అభిమతం కాదు. ఈ జీవిత ప్రయాణంలో మార్పు అనేది అనివార్యం అని అర్థమైంది. జీవితం ఎప్పుడూ ఒకేలా సాగదు. పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి మార్పుకీ ఓ కారణం ఉంటుంది. ఈ మార్పులు ముందుగా గ్రహించలేనివి. అయితే వీటి ప్రభావం అనుబంధాల మీద చాలానే ఉంటుంది. పదమూడేళ్ల బంధానికి ముగింపు పలకడం అనే నిర్ణయం తీసుకోవడం ఏ మహిళకైనా కష్టమే. పైగా ఇప్పుడు నేనున్న స్థితిలో చాలా కష్టం. కానీ, తప్పదు. ఎందుకంటే ముందు నేను తల్లిని. నా బిడ్డకు ‘బెస్ట్ మదర్’గా ఉండటం నా బాధ్యత. అలాగే, నేనూ ప్రశాంతంగా ఉండడం నాకు ముఖ్యం.

హాసన్ అభిమానిని
మిస్టర్ హాసన్‌కి నేను అభిమానిని అనే విషయం సీక్రెట్ కాదు. నేను ఇండస్ట్రీ రాక ముందు నుంచే ఆయనంటే ఇష్టం. ఆయన ప్రతిభ మీద నాకు అపారమైన గౌరవం. ఆయన ఎదుర్కొన్న ప్రతి సవాళ్లకు నేను వెన్నంటే ఉన్నాను. అవి నాకు అమూల్యమైన క్షణాలు. నేను ఆయన సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేసినప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాను. నా క్రియేషన్ ద్వారా ఆయన సినిమాలకు న్యాయం చేసినందుకు గర్వంగా ఉంది. ఆయన ఎన్నో చేశారు. కానీ, ఆడియన్స్ కోసం ఇంకా ఆయన నుంచి చాలా రావాల్సి ఉంది. ఆయన రానున్న విజయాలను చూసి, ఆనందించాలనుకుంటున్నా.

అందరికీ ధన్యవాదాలు
ఇప్పుడు నా జీవితంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీ (ప్రేక్షకులు) అందరితో పంచుకోవడానికి కారణం ఉంది. నేనెప్పుడూ హుందాగానే ఉన్నాను. నా స్థాయికి తగ్గట్టుగా బెస్ట్ అనేటట్లే జీవించాను. మీరందరూ నా జీవితంలో ఓ భాగం. గడచిన 29 ఏళ్లల్లో మీ ప్రేమాభిమానాలు, అండదండలు నాకు మెండుగా దక్కాయి. నా ‘పెయిన్‌ఫుల్ టైమ్స్’ నుంచి నేను బయటపడటానికి అవి కారణమయ్యాయి. అందుకే ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.’’

కమల్‌తో కలసి పని చేస్తా!
ఇది ఇలా ఉండగా, కమల్‌హాసన్ నటిస్తున్న అన్ని చిత్రాలకూ గౌతమి కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేస్తున్నారు. ప్రస్తుతం రూపొందుతున్న ‘శభాష్ నాయుడు’కి కూడా ఆమే డిజైనర్. విడిపోతున్నప్పటికీ, ఇకపై కూడా కమల్ చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేయడం తనకు అభ్యంతరం లేదనీ, అది తన వృత్తి అనీ ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ గౌతమి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement