విశ్వాసం కీర్తికేనా? | Sakshi
Sakshi News home page

విశ్వాసం కీర్తికేనా?

Published Sun, Nov 26 2017 8:34 AM

keerthi suresh romance with ajith? - Sakshi

తమిళసినిమా: విశ్వాసం కీర్తికే దక్కనుందా? అందుకు ఎక్కువ అవకాశం ఉందంటున్నారు కోలీవుడ్‌ వర్గాలు. రజనీమురుగన్, రెమో, భైరవా చిత్రాల తరువాత నటి కీర్తిసురేశ్‌ను కోలీవుడ్‌ తెరపై చూడలేదు. అలాగని ఈ బ్యూటీకి అవకాశాలు లేవని కాదు. నిజానికి తమిళం, తెలుగు అంటూ చేతినిండా చిత్రాలు ఉన్నాయి. అయితే అవన్నీ నిర్మాణ దశలోనే ఉండడంతో కీర్తిని చూసి చాలా కాలమైందని చెప్పవచ్చు. దివంగత మహానటి సావిత్రి జీవిత చరిత్రతో తెలుగు, తమిళం భాషల్లో తెరకెక్కుతున్న మహానది, విక్రమ్‌కు జంటగా సామి 2, విశాల్‌తో సండైకోళి–2 వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్న కీర్తిసురేశ్‌ సూర్యతో రొమాన్స్‌ చేస్తున్న తానాసేర్న్‌ద కూటం సంకాంత్రి బరిలోకి దూకడానికి సిద్ధం అవుతోంది.

ఈ ముద్దుగుమ్మ ఖాతాలో మరో భారీ చిత్రం చేరే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల టాక్‌ చక్కర్లు కొడుతోంది. నటుడు అజిత్‌ వివేగం వంటి సంచలన చిత్రం తరువాత చిన్న శస్త్ర చికిత్సతో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. రీచార్జ్‌ అయి నూతనోత్సాహంతో విశ్వాసం అంటూ తెరపైకి రావడానికి సమాయత్తం అవుతున్నారు. వీరం, వేదాళం, వివేగం చిత్రాల దర్శకుడు శివనే ఈ చిత్రానికి మెగాఫోన్‌ పట్టనున్నారు.వివేగం వంటి హాలీవుడ్‌ చిత్రాల స్థాయి చిత్రాన్ని నిర్మించిన సత్యజ్యోతి ఫిలింస్‌నే ఈ విశ్వాసం చిత్రాన్ని నిర్మించడానికి  సన్నాహాలు చేస్తున్నారు. దీనికి యువన్‌శంకర్‌ రాజా సంగీతాన్ని అందించనున్నట్లు ప్రచారంలో ఉన్నా, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఇందులో అజిత్‌కు జంటగా నటించే నటి ఎవరన్న చర్చ జోరుగా సాగుతోంది.ఈ పోటీలో నటి కీర్తిసురేశ్‌ పేరు ముందుందనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది.అయితే స్వీటీ నటి అనుష్క పేరు వినిపిస్తుండడం విశేషం. అయితే ఎక్కువ చాన్స్‌ కీర్తిసురేశ్‌కే ఉన్నట్లు ప్రచారం వైరల్‌ అవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement