లాస్ ఏంజిల్స్ టాకీస్ ప్రారంభం... | Sakshi
Sakshi News home page

లాస్ ఏంజిల్స్ టాకీస్ ప్రారంభం...

Published Mon, May 26 2014 12:44 AM

లాస్ ఏంజిల్స్ టాకీస్ ప్రారంభం...

‘‘సినిమాపై ఇష్టంతో ఇక్కడకు చాలామంది వస్తుంటారు. 24 శాఖల్లో ఏదో ఒక శాఖలో తమ సత్తా చాటడానికి ఉవ్విళ్లూరుతుంటారు. కానీ... అర్హతలెన్ని ఉన్నా అవకాశాలు మాత్రం రావు. అలాంటి వారికి అండగా ఉంటూ... ప్రోత్సహించడమే మా సంస్థ ప్రధాన లక్ష్యం’’ అంటున్నారు లాస్ ఏంజిల్స్ టాకీస్ వ్యవస్థాపకులు జయదేవ్, కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటి, వెన్ అల్లూరి. ఈ సంస్థపై అమెరికాలో కూడా పలు చిత్రాలను నిర్మించిన వీరు... తెలుగు చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సంస్థ లోగోను హైదరాబాద్‌లో డా. డి.రామానాయుడు, కె.రాఘవేంద్రరావుల చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు.
 
 నిర్మాతల్లో ఒకరైన జయదేవ్ మాట్లాడుతూ- ‘‘సినిమా అంటే నాకిష్టం. నాకున్న వ్యాపారాలతో పాటు సినీరంగంలో కూడా ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో మిత్రులతో కలిసి లాస్ ఏంజిల్స్ టాకీస్ సంస్థను స్థాపించాను. మేమేంటో నిరూపించుకోవడానికి అందరూ కొత్తవాళ్లతో ‘రన్’ అనే సినిమాను లాస్ ఏంజిల్స్‌లో చేశాం. ఇక్కడ ‘గాలిపటం’ అనే సినిమాతో టైఅప్ అయ్యాం. అంతేకాదు పలు చిత్రాలకు క్వాలిటీతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చేసి పెడతాం. అమెరికా ‘ట్రిబెకా ఫిలిం ఫిలిం ఫెస్టివల్స్’లో తెలుగు సినిమాను ప్రదర్శింపజేయడం మా లక్ష్యం’’ అని చెప్పారు. తెలుగు సినిమా అభ్యున్నతిలో పాలుపంచుకోవాలనే మంచి ఉద్దేశంతో ప్రారంభమైన ‘లాస్ ఏంజిల్స్ టాకీస్’ సంస్థకు అల్లు అరవింద్, అశ్వనీదత్, సంపత్‌నంది, నిఖిత, స్వప్న శుభాకాంక్షలు అందించారు.
 

Advertisement
Advertisement