2జీ, కోల్‌గేట్‌లో మన్మోహన్! | Sakshi
Sakshi News home page

2జీ, కోల్‌గేట్‌లో మన్మోహన్!

Published Fri, Sep 12 2014 1:03 AM

2జీ, కోల్‌గేట్‌లో మన్మోహన్!

స్కామ్‌లలో ఆయన ప్రమేయం ఉంది: మాజీ కాగ్ వినోద్ రాయ్
 

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై మాజీ కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) గురువారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ అధినేతగా మన్మోహన్ సింగ్ వ్యవహార శైలిని, ఆయన నేతృత్వంలో సాగిన సంకీర్ణ రాజకీయాలను కూడా తూర్పారబట్టారు. మన్మోహన్ కేవలం, పదవిలో సుదీర్ఘకాలం కొనసాగడానికే ప్రాధాన్యం ఇచ్చారంటూ దుయ్యబట్టారు. 2జీ స్పెక్ట్రం, బొగ్గు క్షేత్రాల కేటాయింపు వ్యవహారంలో మన్మోహన్ సింగ్‌కు ప్రమేయం ఉందన్నారు. ఆడిట్ నివేదికల్లో ప్రధాన మంత్రి పేరు ప్రస్తావన కూడా లేకుండా చేయడానికి కాంగ్రెస్ నేతలు పలువురు తనపై ఎన్నో ఒత్తిళ్లు తీసుకువచ్చారని వినోద్ రాయ్ చెప్పారు.  టైమ్స్ నౌ టీ వీ న్యూస్ చానల్‌కు, అవుట్‌లుక్ మ్యాగజైన్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలలో ఆయన ఈ తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలో ఉంటూ, నిజాయితీగా వ్యవహరించడం కేవలం ఆర్థికపరమైన అంశం మాత్రమేకాదని, అది మేధస్సుతోను, వృత్తినైపుణ్యంతోనూ కూడుకున్న వ్యవహారమని ఆయన మన్మోహన్ సింగ్‌కు సూచించారు.

రాజ్యాంగం పేరుమీద ప్రమాణం స్వీకరించిన సంగతిని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. రాజ్యం చేతిలో జాతిని అణచివేతకు గురికానివ్వరాదని, మంచి రాజకీయాలు సరైన ఆర్థిక వ్యవహారాలకు దారి తీయాలని, అయితే మంచి రాజకీయాలంటే ఎక్కువకాలం పదవిలో కొనసాగడమని ఎలా అనుకుంటామని ప్రశ్నించారు. తాను పదవిలో ఉండగా తన టెలిఫోన్‌ను యూపీఏ ప్రభుత్వం ట్యాప్ చేసిందన్నారు. 2జీ స్పెక్ట్రమ్‌ను మొదట వచ్చినవారికి మొదట అనే ప్రాతిపదికన కేటాయించడం, బొగ్గు బ్లాకులను వేలం లేకుండా కట్టబెట్టడం వంటి  నిర్ణయాల్లో మన్మోహన్ సింగ్‌కు పాత్ర ఉందన్నారు. 2జీ, బొగ్గు బ్లాకుల వ్యవహారాల్లో మన్మోహన్ తన బాధ్యత నుంచి తప్పించుకోజాలరన్నారు.

 రాయ్ ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు

►2జీ వ్యవహారంలో అప్పటి కేంద్రమంత్రి ఏ రాజా తన లేఖలను ప్రధానికే రాశారు. వాటికి ప్రధానే స్వయంగా తిరుగు జవాబులు రాశారు. నేను రాసిన లేఖలకు మాత్రం బదులివ్వలేదు.
 ►   2జీ వ్యవహారంలో నష్టాన్ని రూ. 1.76లక్షల కోట్లుగా లెక్కగట్టడం సరికాదని 2010 నవంబర్ 16న మన్మోహన్ నాతో అన్నారు. మీరు నేర్పించిన ఆర్థిక గణితశాస్త్ర పద్ధతిలోనే ఆ లెక్కవేశానంటూ ఆయనకు బదులిచ్చాను.
► రిలయన్స్ ఇండస్ట్రీస్ కేసు విషయంలో మంత్రి స్థాయిలో నిర్ణయం జరగనే లేదు. ముకేశ్ అంబానీయే అంతా నడిపించారు.
► 2జీ, బొగ్గు బ్లాకుల ఆడిట్ నివేదికలో ప్రధాని పేరు ప్రస్తావించరాదంటూ సందీప్ దీక్షిత్, సంజయ్ నిరుపమ్, అశ్వనీ కుమార్ వంటి కాంగ్రెస్ ఎంపీలు నాపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు.
►2జీ కుంభకోణం జరక్కుండా ప్రధాని హోదాలో మన్మోహన్ చర్యలుతీసుకుని ఉండవచ్చు. ఎందుకంటే, ప్రకృతి వనరులను వేలంలేకుండా కేటాయించడం సరికాదని ఆయన మంత్రివర్గమే సూచించింది.
►కోల్‌బ్లాక్ కే టాయింపులో ఉన్న లోపాలను, దిద్దుబాటు చర్యలను గురించి, నేను, ప్రణబ్ మఖర్జీతో కలసి మన్మోహన్ సింగ్  వివరించినా ప్రయోజన లేకపోయింది.
 ►సంకీర్ణ ఒత్తిళ్ల వల్లే యూపీఏ సర్కారు స్కామ్‌లపై తగు రీతిలో స్పందించలేదు.
(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement
Advertisement