తప్పు చేసినవాళ్లు అనుభవించాల్సిందే | Sakshi
Sakshi News home page

తప్పు చేసినవాళ్లు అనుభవించాల్సిందే

Published Fri, Sep 28 2018 5:37 AM

Nana Patekar REACTS over the controversy with Tanushree Dutta - Sakshi

‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’ (2008) చిత్రానికి చెందిన టైటిల్‌ సాంగ్‌ చిత్రీకరణ సమయంలో నటుడు నానా పటేకర్‌ తనను లైంగికంగా వేధించినట్లు నటి తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రాకేష్‌ సారంగ్, నిర్మాత సమి సిద్ధిఖీ, నృత్యదర్శకుడు గణేశ్‌ ఆచార్యలు లొకేషన్‌లో ఉన్నప్పటికీ తన ఇబ్బందిని పట్టించుకోలేదని ఆమె పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడీ ఈ వివాదంపై సదరు చిత్రబృందం ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ‘‘తనుశ్రీ బాలీవుడ్‌లో తిరిగి అవకాశాలు దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే ఇప్పుడీ వివాదాన్ని సృష్టిస్తున్నారు.

ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ ‘నథానీ ఉతారో’ మొదట్లో సోలో సాంగ్‌ అని, కావాలనే డ్యూయెట్‌గా మార్చామంటున్న ఆమె మాటల్లో వాస్తవం లేదు. ఒకవేళ అదే నిజమైతే ఈ పాట కోసం ఆమె సాధన చేసినప్పుడు మేల్‌ వాయిస్‌ కూడా ఉందనే విషయాన్ని గుర్తుచేసుకోవాలి. సందేహం ఉంటే అప్పుడే అడగాలి. కానీ అడగలేదు. ఆ పాటను మొదట్నుంచి డ్యూయెట్‌గానే అనుకున్నాం. నానా పటేకర్‌ చాలా కాలం తర్వాత ఓ పాటకు రెడీ అయిన టైమ్‌ అది. ఆ అత్యుత్సాహం ఆమెకు చెడు ప్రవర్తనగా అనిపించి ఉండొచ్చు.

నాలుగు వందలమంది చూస్తున్నప్పుడు ఓ మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించడానికి ఎవరైనా ధైర్యం చేస్తారా? ఆ తర్వాత ఈ విషయమై నానా పటేకర్‌కు చెందిన వాళ్లు ఆమె కారును ధ్యంసం చేశారని సినీ ఆర్టిస్టు అండ్‌ టెలివిజన్‌ ఆర్టిస్టు అసోసియేషన్‌ (సిఐఎన్‌టీఏఏ)కు ఫిర్యాదు చేశారు తనుశ్రీ. కొన్ని డిమాండ్స్‌ కూడా చేశారు. ఈ సమస్యను సిఐఎన్‌టీఏఏ అప్పట్లోనే పరిష్కరించింది. మళ్లీ ఇప్పుడు తనుశ్రీ ఇలా చేస్తున్నారు. ఈ విషయంపై నానా పటేకర్‌ చట్టపరంగా ముందుకు వెళ్తారనుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చారు చిత్రదర్శకుడు సారంగ్‌.

‘‘రిహార్శల్స్‌ టైమ్‌లోనే ఈ సాంగ్‌లో నానా పటేకర్‌ కూడా ఉంటారని నేను తనుశ్రీకి  చెప్పాను. నానాజీ చాలా మంచి వ్యక్తి. అతను ఎప్పుడు అలా చేయరు’’ అని ఈ సాంగ్‌ కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ పేర్కొన్నారు. ‘‘లొకేషన్లో 50 నుంచి 100 మంది ఉన్న నేపథ్యంలో లైంగికంగా వేధించాననడం విచిత్రంగా ఉంది. మరి.. తనుశ్రీ మాటలకు అర్థం ఏంటో నాకు అర్థం కావడం లేదు. లీగల్‌గా ఎలా ప్రొసీడ్‌ అవుతానో వేచి చూడండి’’ అన్నారు నానా పటేకర్‌.

రాకేశ్‌ సారంగ్, గణేశ్‌ ఆచార్యల కామెంట్స్‌పై తనుశ్రీ రెస్పాండ్‌ అయ్యారని బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ‘‘గణేశ్‌ ఆచార్య అబద్ధం చెబుతున్నాడు. అతనికి రెండు ముఖాలు ఉన్నాయి. పదేళ్ల క్రితం వేధింపులకు సంబంధించిన వారిలో ఇతని పేరు కూడా ఉంది. ఈ విషయాన్ని అతను ఒప్పుకోడు. ఇలాంటివారిపై నిషేధం విధిస్తే తప్పుచేయాలనుకునేవారికి ఉదాహరణగా ఉంటారు. నా ఫైట్‌ నానా పటేకర్, గణేశ్‌ ఆచార్యలపై కాదు. వాళ్లతో నేను వర్క్‌ చేయాలనుకోవడం లేదు. అయితే వాళ్లు చేసినదానికి అనుభవించాలనుకుంటున్నాను’’ అంటూనే బాలీవుడ్‌లో మళ్లీ సినిమాలు చేయాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారట తనుశ్రీ.

మరి.. ఈ వివాదం ఎక్కడి దాకా వెళుతుందో చూడాలి. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘థగ్స్‌ ఆఫ్‌ హిందోస్థాన్‌’ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌లో భాగంగా బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్, ఆమిర్‌ ఖాన్‌ల ముందు తనుశ్రీ దత్తా విషయం ఉంచితే.. ‘‘ఈ విషయంపై స్పందించడానికి నేనేం తనుశ్రీని కాదు. నానా పటేకర్‌ని కాను. నేం చెప్పలేను’’ అని అమితాబ్‌ పేర్కొన్నారు. ‘‘ఒక విషయంపై కచ్చితమైన అవగాహన లేకుండా నా అభిప్రాయాన్ని చెప్పలేను. అయితే ఇలాంటివి  జరగకూడదనే కోరుకుంటాను. నిజంగా ఇలాంటి సంఘటనలు బాధాకరం’’ అని ఆమిర్‌ చెప్పారు.
 

Advertisement
Advertisement