కట్‌ చెప్పడం మరచిపోయా.. కన్నీటితో ఆనందపడ్డా! | Sakshi
Sakshi News home page

కట్‌ చెప్పడం మరచిపోయా.. కన్నీటితో ఆనందపడ్డా!

Published Mon, Feb 6 2017 11:38 PM

కట్‌ చెప్పడం మరచిపోయా.. కన్నీటితో ఆనందపడ్డా! - Sakshi

‘‘ఒక కథ విన్నప్పుడు ఎప్పుడెప్పుడు చిత్రీకరణ మొదలుపెట్టాలా? అనే ఉద్వేగం కలగాలి. నేను తీసే సినిమాలన్నింటికీ దాదాపు ఇలానే జరుగుతుంది. హాథీరామ్‌ బాబా గురించి భారవి చెప్పినప్పుడు వెంటనే షూటింగ్‌ మొదలుపెట్టేయాలన్నంత ఎగై్జట్‌మెంట్‌ కలిగింది’’ అని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. నాగార్జున టైటిల్‌ రోల్‌లో ఆయన దర్శకత్వంలో ఏ. మహేశ్‌రెడ్డి నిర్మించిన ‘ఓం నమో వేంకటేశాయ’ ఈ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా కె. రాఘవేంద్రరావు చెప్పిన విశేషాలు..

►  టీటీడీ బోర్డ్‌ మెంబర్‌గా, ఈ సినిమా కారణంగా దాదాపు రెండేళ్లుగా ఆధ్యాత్మిక ప్రయాణంలోనే ఉన్నాను. నిర్మాత మహేశ్‌రెడ్డి సంకల్ప బలం వల్లే ‘నమో వేంకటేశాయ’ సాధ్యమైంది. నాతో ఆయన ‘శిరిడిసాయి’ తీసిన తర్వాత, ‘మళ్లీ మీరు నాగార్జునతో ఆధ్యాత్మిక సినిమా చేయాలంటే నాకే చెప్పండి’ అన్నారు. అప్పుడే.. అంటే నాలుగైదేళ్ల క్రితమే జేకే భారవి ఈ హాథీరామ్‌ బాబా గురించి చెప్పారు. ఇప్పటివరకూ ఈ పాయింట్‌ని ఎవరూ టచ్‌ చేయలేదు. ఎన్టీ రామారావుగారు ‘శ్రీ వెంకటేశ్వర మహత్యం’లో చిన్న సీన్‌లో హాథీరామ్‌ బాబా గురించి చెప్పారు. నేటి తరానికి, భవిష్యత్‌ తరాలకు మన చరిత్ర గురించి చెప్పాలని ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘శిరిడిసాయి’ తీశాను. ఇప్పుడు ఈ సినిమా కూడా అందుకే తీశాం.

► 600 ఏళ్ల క్రితం జరిగిన చరిత్రతో ఈ సినిమా తీశాం. అప్పట్లో తిరుమల ఎలా ఉండేది? అని ఊహించి, సెట్స్‌ వేశాం. కొంత గ్రాఫిక్స్‌ వర్క్‌ చేశాం. ఈ సినిమా షూటింగ్‌ అప్పుడు జరిగిన కొన్ని మహిమల గురించి చెబితే, ఆశ్చర్యపోతారు. మేం సెట్స్‌ వేసిన ప్రదేశానికి కొంత దూరంలో భారీగా వర్షం కురిసేది. మా దగ్గర మాత్రం ఉండేది కాదు. వింతగా అనిపించేది. బ్రహ్మోత్సవాల సీన్స్‌ తీసేటప్పుడే తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగాయి. అలాగే, అనుష్క చేసిన దుర్గా దేవి సీన్స్‌ చిత్రీకరణ అప్పుడు దుర్గాష్టమి పండగ. ఇవన్నీ చూసి, నాస్తికులు కూడా ఉంటే ఆస్థికులుగా మారిపోతారేమో అనిపించింది.

►  భక్తి సినిమా తీసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. మొత్తం యూనిట్‌ అంతా చాలా నిష్టగా ఉండేవాళ్లం. ఉదయం ప్రసాదం తిన్న తర్వాతే టిఫిన్‌ తినేవాళ్లం. సాయంత్రం ప్యాకప్‌ చెప్పగానే.. ఏడుకొండలవాడా.. గోవిందా.. గోవిందా అని అందరూ అంటుంటే, తిరుమల క్షేత్రంలో ఉన్న భావన కలిగేది.

►  ‘అన్నమయ్య’ కన్నా గొప్ప సినిమా రాదని చెప్పిన నాగార్జున కథ వినగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ చిత్రానికి ఓకే చెప్పారు. ఇక, నటన అంటారా? అద్భుతం. ఎమోషనల్‌ సన్నివేశాల్లో గ్లిజరిన్‌ అవసరం లేకుండా ఆయనకు కన్నీళ్లు వచ్చేసేవి. అంతగా లీనమైపోయారు. ఒక్కోసారి కెమేరామేన్‌ ఎస్‌. గోపాల్‌రెడ్డి కెమేరా ఆన్‌లోనే ఉంచి.. అలా చూస్తుండిపోయేవారు. నేను ‘కట్‌’ చెప్పడం మరచిపోయేవాణ్ణి. అంత ఉద్వేగానికి గురయ్యేవాణ్ణి. కన్నీటితో ఆనందపడేవాణ్ణి. వెంకటేశ్వరుని పాత్ర చేసిన సౌరభ్‌ జైన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆ గెటప్‌లో తనని చూస్తే, నిజమైన తిరుమలేశుడేమో అనిపిస్తుంది. అలాగే, ఫ్లాష్‌బ్యాక్‌ సీన్స్‌లో జగపతిబాబు కాసేపే కనిపించినా, చాలా ఇంపాక్ట్‌ ఉంటుంది. ఈ చిత్రానికి ‘సోల్‌’ కీరవాణి పాటలు, భారవి రచన.

► ఏడు కొండలు అంటాం కానీ, వాటి ప్రాశస్త్యం గురించి చాలామందికి తెలియదు. అది ఈ సినిమాలో చెప్పాం. ఎవరికీ తెలియని కొత్త కొత్త విషయాలు చాలా చెప్పాం. ఇప్పటివరకూ తిరుమల వెళ్లినవాళ్లు ఈ సినిమా చూశాక వెళితే అక్కడి పరిసర ప్రాంతాలను వేరే దృక్పథంతో చూస్తారు. ‘ఇక్కడ ఇలా జరిగిందా? ఇలా ఉండేదా?’ అని ఆసక్తిగా చూస్తారు. అలాగే, దేవుణ్ణి చూసే విధానంలో కూడా మార్పొస్తుంది. భక్తి సినిమాలను యూత్‌ కూడా చూస్తున్నారు. తిరుమలకు కాలి నడకన వెళ్లేవాళ్లల్లో యూత్‌ ఎక్కువగా ఉన్నారు. ఎగ్జామ్స్‌ పాస్‌ అవ్వాలనో, ఉద్యోగం రావాలనో... స్వామివారిని దర్శించుకుంటున్నారు. టెక్నాలజీ పరంగా యూత్‌ ఎంత ముందున్నా.. చరిత్ర కూడా తెలుసుకోవాలి. మన సంస్కృతి, సంప్రదాయాల మీద అవగాహన పెంచుకోవాలి. ఇలాంటి సినిమాల వల్ల అవి తెలుస్తాయి.

► భక్తి సినిమాలంటే రాఘవేంద్రరావుగారే తీయాలంటుంటారు. ఆ మాటతో ఏకీభవించను. నేటి తరం దర్శకులూ తీయగలరు. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలతో పాటు వాళ్లు ఏడాదికి ఈ తరహా సినిమా ఒకటి తీస్తే యూత్‌కు మన మూలాల గురించి చెప్పినట్టవుతుంది. పురాణాలకు సంబంధించిన పుస్తకాల్లో పది పేజీలు చదివినా చాలు.. భక్తి సినిమాలు తీసే అవగాహన వచ్చేస్తుంది.

► ఈ మధ్య కొరటాల శివ తీసిన ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ నచ్చాయి. ఒక కమర్షియల్‌ సినిమాలో సమాజానికి ఉపయోగపడే విషయం చెప్పాడు. తీసే సినిమాలో ప్రయోజనాత్మక అంశం ఉంటే బాగుంటుందంటున్నా.

►  ‘ఇదే నా చివరి సినిమా’ అనడం లేదు. ముందు చెప్పినట్లు కథ వినగానే ఎగై్జట్‌ అయితే చేసేయడమే. భక్తి సినిమా అనే కాదు.. ఏ సినిమా అయినా చేస్తాను.

‘రావణ’ మోహన్‌బాబు మాత్రమే చేయగలరు
మోహన్‌బాబు టైటిల్‌ రోల్‌లో ‘రావణ’ ప్లాన్‌ చేసింది నిజమే. ఆయన ఎప్పుడంటే అప్పుడు చేయడానికి నేను రెడీ. ఒక్క మోహన్‌బాబు మాత్రమే చేయగల సినిమా అది.

ఆ రెండు సినిమాలు చేయలేదని బాధ!
దాదాపు 40 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేశాను. కానీ, రెండు సినిమాలు చూసినప్పుడు మాత్రం చాలా బాధ అనిపించింది. ఒకటి ‘గాంధీ’, మరొకటి ‘భాగ్‌ మిల్కా భాగ్‌’. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీ జీవిత చరిత్రను మనం తీయలేదు. దర్శకుడు రిచర్డ్‌ అటన్‌బరో ఇంగ్లిష్‌లో తీశారు. ‘మనల్ని బానిసలను చేసినవాళ్లే అంత బాగా తీస్తే మనం ఎందుకు తీయలేదు’ అని బాధపడ్డాను. అలాగే, మిల్కా సింగ్‌ జీవిత చరిత్రతో వచ్చిన ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ చూసి, ‘మనం ఎందుకు చేయలేకపోయాం’ అని ఆలోచించాను.

ప్లాన్‌ చేసి తీసేవాణ్ణి
నేను బాపు, విశ్వనాథ్‌గార్లకన్నా గొప్ప దర్శకుణ్ణి అనను. అయితే వాళ్లందరికీ రాని ఛాన్స్‌ నాకు ‘అన్నమయ్య’ రూపంలో వచ్చింది. భక్తిరసాత్మక చిత్రాలు తీయడం మాటల్లో చెప్పలేని తృప్తినిస్తుంది. 40 ఏళ్ల కెరీర్‌లో మొదట్లో ఓ ప్లానింగ్‌ ప్రకారం సినిమాలు తీసేవాణ్ణి. ఎన్టీఆర్‌తో ‘అడవిరాముడు’ వంటి సూపర్‌ హిట్‌ తీశాక, మళ్లీ అదే జానర్‌ అంటే ప్రేక్షకులు ఎక్కువ ఆశిస్తారు కాబట్టి, ‘జ్యోతి’ తీశా. చిరంజీవితో ‘జగదేక వీరుడు–అతిలోక సుందరి’ తీశాక, మోహన్‌బాబు హీరోగా ‘అల్లుడుగారు’ తీశాను. కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు వచ్చారు.

ఆ సినిమా నాన్నగారు చూడలేదని ఫీలయ్యా!
‘అన్నమయ్య’ సినిమా ప్రారంభించినప్పుడు మా నాన్నగారు (దర్శకుడు కేయస్‌ ప్రకాశ్‌రావు) ఉన్నారు. పూర్తయ్యేసరికి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆ సినిమా చూసి, ‘మా అబ్బాయి మంచి భక్తి సినిమా తీశాడు’ అని నాన్నగారు మెచ్చుకోవాలన్నది నా కోరిక. కానీ, అది నెరవేరలేదు.

Advertisement
Advertisement