భవసాగరం ఈదుకుంటూ...పడవెళ్లిపోయింది! | Sakshi
Sakshi News home page

భవసాగరం ఈదుకుంటూ...పడవెళ్లిపోయింది!

Published Thu, Jul 16 2015 11:40 PM

భవసాగరం ఈదుకుంటూ...పడవెళ్లిపోయింది!

జీవనదిలా... పాట సాగుతుంది..! జీవితమన్న పడవ పల్లవుల అలల్లో... చరణాల హోరుల్లో... లేస్తూ పడుతూ...
 దారిన నిలబడిన శ్రోతల హృదయాలలో తీగలు మీటుతూ... మంత్రముగ్ధులను చేస్తూ... ప్రయాణానికి ఆమంత్రిస్తూ... సాగిపోయింది. పాట జీవనదిలా చిరస్థాయిగా మిగిలిపోయింది... అపురూప మధు‘రామకృష్ణ’ స్వరమాధుర్యం
 తీపి జ్ఞాపకంగా మనసును ఒకసారి గిలిగింతలు పెడుతూ, మరోసారి తన్మయత్వానికి గురిచేస్తూ... ఇంకొకసారి
 తాత్వికంగా నిలదీస్తూ మిగిలిపోయింది. స్వరప్రసాదంగా చిరస్థాయిగా నిలిచిపోయింది.

 
 విజయనగరంలో పుట్టి పెరిగిన విస్సంరాజు రామకృష్ణకు బాల్యంలోనే స్వరానుబంధం ఏర్పడింది. విస్సంరాజు రంగశాయి, రత్నం దంపతులకు 1947 ఆగస్టు 20న జన్మించారాయన. రామకృష్ణ తల్లి సుప్రసిద్ధ వయొలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు శిష్యురాలు. ఇంట్లోనూ ఆమె సంగీత సాధన సాగించేవారు. ఆమె ప్రభావంతోనే రామకృష్ణకు బాల్యం నుంచి సంగీతంపై ఆసక్తి, అనురక్తి ఏర్పడ్డాయి. రామకృష్ణ మాతామహులు పులిపాక ముకుందరావు ప్రముఖ వైణికులు. సంగీత కుటుంబంలో పుట్టిపెరిగిన రామకృష్ణ తన పదిహేనో ఏట కర్ణాటక సంగీత విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి వద్ద స్వరాభ్యాసం చేశారు. తండ్రి రంగశాయి మైన్స్ అండ్ జియా లజీ శాఖ డెరైక్టర్. ఆయన ఉద్యోగ రీత్యా వారి కుటుంబం హైదరాబాద్‌లో ఉండేది. ‘యువవాణి’ ద్వారా రామకృష్ణ రేడియోశ్రోతలకు పరిచయమ య్యారు. చిత్తరంజన్ స్వరకల్పనలో లలిత గీతాలు ఆలపించారు.

 అవకాశమిచ్చిన అక్కినేని
 చదువు పూర్తయ్యాక పాటలపై పూర్తిస్థాయిలో దృష్టిపెడదామని భావించిన రామకృష్ణకు అనూహ్యంగా అక్కినేని నాగేశ్వరరావు తొలి సినీ అవకాశం ఇచ్చారు. సారథి స్టూడియోలో ఒక డాక్యుమెంటరీ కోసం పాడుతుండగా, అక్కడే ఉన్న అక్కినేని రికార్డింగ్ పూర్తవుతూనే రామకృష్ణను అభినందించారు. తాను హీరోగా నటించే ‘విచిత్రబంధం’ చిత్రంలో పాడా ల్సిందిగా కోరారు. అప్పటికి బీఎస్సీ పరీక్షలకు మరో రెండు నెలలే గడువు ఉండటంతో, పరీక్షలు పూర్తయ్యాక పాడతానన్నారు రామకృష్ణ. అప్పటి వరకు నిరీక్షించి మరీ అక్కినేని ‘విచిత్రబంధం’ (1972)లో రామకృష్ణతో పాడించారు. ఆ చిత్రంలో సుశీలతో కలసి పాడిన ‘వయసే ఒక పూల తోట’, ‘చిక్కావు చేతిలో చిలకమ్మా’ పాటలు ఉర్రూత లూపాయి. ఆ తరువాత ‘భక్త తుకారాం’, ‘ధనమా? దైవమా?’, ‘అందాల రాముడు’, ‘శారద’, ‘భక్త కన్నప్ప’, ‘తాత -మనవడు’, ‘మహాకవి క్షేత్రయ్య’, ‘దానవీరశూర కర్ణ’, ‘కురుక్షేత్రం’, ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ వంటి పలుచిత్రాల్లో రామకృష్ణ పాటలు హిట్టు.

 ఘంటసాల ప్రోత్సాహం
 రామకృష్ణ చిన్నప్పటి నుంచి ఘంటసాలను విపరీతంగా అభిమానించేవారు. ఆయన బాణీనే ప్రామాణికంగా భావించేవారు. ‘తాత- మనవడు’లో ‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం..’ పాట రికార్డింగ్ అప్పుడు ఆ పాట విన్న ఘంటసాల ‘నా అంతటి గాయకుడివి కావాలి’ అని రామకృష్ణను ఆశీర్వదించారు. అంతేకాదు, తన ఆరోగ్యం క్షీణించి, పాడలేని పరిస్థితుల్లో నిర్మాతలకు చెప్పి మరీ, రామకృష్ణ చేత చాలా పాటలు పాడించారు. ‘అల్లూరి సీతారామ రాజు’లో ‘తెలుగువీర లేవరా..’ పాట తొలి సగం పాడిన తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో, ఆ పాట మిగిలిన సగాన్ని రామ కృష్ణ చేత ఘంటసాలే పాడించారు. ‘భక్త తుకారాం’ శతదినోత్సవంలో ‘కరుణామయా దేవా’ రికార్డు వినిపిస్తుండగా రామకృష్ణ పక్కనే కూర్చున్న ఘంటసాల ‘ఈ పాట నేను పాడిందా నువ్వు పాడిందా?’ అని అడిగారు. ‘ఘంటసాల ప్రశంసకి మించి అవార్‌‌డ లేదు’ అని రామ కృష్ణ వినమ్రంగా చెప్పేవారు.

 ఇవాళ్టికీ రామకృష్ణ పేరు చెప్పగానే జనసామాన్యంలో ఎన్టీఆర్ ‘దానవీరశూర కర్ణ’లోని తిరుపతి వేంకట కవుల ప్రసిద్ధ రాయబారం పద్యాలు, ‘వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’లోని పాటలు, తత్త్వాలు, కాలజ్ఞానం గుర్తుకొస్తాయి. గ్రామ్‌ఫోన్ రికార్డుల దశ నుంచి క్యాసెట్ల దశ మీదుగా ఇవాళ్టి సీడీ, పెన్‌డ్రైవ్‌లలో ఎమ్పీ3 దశ దాకా ఆ పాటలు, పద్యాలు, తత్త్వాల సేల్స్ సూపర్‌హిట్టే.

 వినమరుగైన ప్రాభవం
 ఘంటసాల మాస్టారి చివరి రోజుల్లో 1970వ దశకంలో సినీ రంగ ప్రవేశం చేసిన రామకృష్ణ, మాస్టారి మరణం తరువాత కొంతకాలం వరకు తన హవా సాగించారు. అప్పట్లో రామకృష్ణ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గళాలు పోటాపోటీగా తెలుగు సినీగీతాల శ్రోతలకు వినిపించేవి. అయితే, 1977 తరువాత ఎస్పీబీ తిరుగులేని గాయకుడిగా స్థిరపడడంతో, రామకృష్ణ గాన ప్రాభవం క్రమంగా తగ్గింది. తరువాతి రోజుల్లో ఆయన ప్రధానంగా ప్రైవేట్ కచ్చేరీలు, ప్రైవేట్ ఆల్బమ్‌లలో పాటల మీద దృష్టి పెట్టారు. ‘వెంగ మాంబ’ లాంటి కొన్ని సినిమాల్లో, కొన్ని టీవీ సీరియళ్ళలో కొన్ని పాత్రలు పోషించి, తన నటనాభిలాషను తీర్చు కున్నారు. నాగార్జున - కృష్ణవంశీల ‘నిన్నే పెళ్ళాడతా’ (1996), ‘సీతక్క’ (1997) లాంటి సినిమాల్లో అడపా దడపా ఆయన గొంతు వినిపించింది. కొన్నేళ్ళ క్రితం ‘హైటెక్ స్టూడెంట్స్’లోనూ గళం విప్పిన రామకృష్ణ చివరిసారిగా గుమ్మడి నటించిన ‘జగద్గురు శ్రీకాశీనాయని చరిత్ర’ (2007)లో పాడారు. ఆ సినిమాలో గురుచరణ్ రాసిన ‘ఈ క్షేత్రకథాగానం...’ ఆయన చివరి సినీ గీతం.

 తెలంగాణ ఉద్యమవేళ అంద్శైరచన ‘జయ జయహే తెలంగాణ జననీ...’ గీతాన్ని రామకృష్ణ పాడారు. ఉద్యమ కారులకు ఊపునిచ్చిన ఆ పాటే ప్రత్యేక రాష్ట్రసాధన తర్వాత తెలంగాణ రాష్ట్రగీతమై, ఇప్పటికీ ఆ గొంతులో వినిపిస్తోంది. రామకృష్ణ ‘‘పాడిన సినీ గీతాలు 400లోపుంటాయి. ఆ పాటలు, పద్యాలన్నీ సేకరించాం. అవి కాక వందల ప్రైవేట్ గీతాలుంటాయి. ఆయన పాడిన సినీ గీతాలు, పద్యాల సమగ్ర సమాచారంతో ఈ ఆగస్టులో ఆయన పుట్టినరోజుకు పుస్తకం తీసుకొస్తున్నాం. ఈ లోగానే ఈ దుర్ఘటన జరిగింది’’ అని రాజమండ్రికి చెందిన సినీగీత సేకర్త గోలి సాయిబాబు తెలిపారు. భక్తి, రక్తి, జీవన తాత్త్విక గీతాలు మూడూ పాడి, ఘంటసాలను తలపించిన రామకృష్ణ ఓ పాటలో అన్నట్లు... ‘‘పడవెళ్ళిపోయింది.’’ తీపిగుర్తుగా పాట మిగిలిపోయింది.
 
► పాటల పూదోటలో... కొన్ని మల్లెలు...
► వయసే ఒక పూలతోట - ‘విచిత్ర బంధం’ (1972)
► చిక్కావు చేతిలో చిలకమ్మా - ‘విచిత్ర బంధం’ (1972)
► అనుబంధం ఆత్మీయత.. అంతా ఒక బూటకం - ‘తాత-మనవడు’ (1972)
► ఒసే వయ్యారీ రంగీ... వగలమారి బుంగీ - ‘పల్లెటూరి బావ’ (1973)
►శారదా నను చేరగా - ‘శారద’ (1973)
► పాండురంగనామం పరమపుణ్యధామం - ‘భక్త తుకారాం’ (1973)
► రాముడేమన్నాడోయ్ - ‘అందాల రాముడు’ (1973)
► ఎదగడానికెందుకురా తొందరా - ‘అందాల రాముడు’ (1973)
► కృష్ణవేణి తెలుగింటి విరిబోణి - ‘కృష్ణవేణి’ (1974)
► అందాలు కనువిందు చేస్తుంటే - ‘కన్నవారి కలలు’ (1974)
► నాయుడోళ్ల ఇంటికాడ నల్లతుమ్మ చెట్టు కింద - ’అందరూ దొంగలే’ (1974)
► మనసు లేని దేవుడు - ‘ప్రేమలు-పెళ్లిళ్లు’ (1974)
► తెలుగు వీర లేవరా - ‘అల్లూరి సీతారామరాజు’ (1974)
► ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు - ‘ముత్యాల ముగ్గు’ (1975)
► శివ శివ శంకరా... భక్తవశంకర! - ‘భక్త కన్నప్ప’ (1976)
► మనసు లేని బ్రతుకొక నరకం - ‘సెక్రటరీ’ (1976)
► నా పక్కన చోటున్నది ఒక్కరికే- ‘సెక్రటరీ’ (1976)
► జాబిల్లి పిలిచేను - ‘మహాకవి క్షేత్రయ్య’ (1976)
►విఠలా! పాండురంగ విఠలా - ‘చక్రధారి’ (1977)
►నా జీవన సంధ్యా సమయంలో - ‘అమర దీపం’ (1977)
► ఎవరికి ఎవరు... చివరికి ఎవరు - ‘దేవదాసు మళ్లీ పుట్టాడు’ (1978)
► పువ్వుల కన్నా పున్నమి వెన్నెల కన్నా - ‘కరుణామయుడు’ (1978)
► ఆశయాల పందిరిలో అనురాగం సందడిలో - ‘యువతరం కదిలింది’ (1980)
► వినరా వినరా - ‘శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రప్వామి చరిత్ర (1984)
► నందామయా గరుడ నందామయా - ‘శ్రీమద్విరాట్ పోతులూరి
► వీరబ్రహ్మేంద్రప్వామి చరిత్ర (1984)

 
 అది కొడుక్కైనా దక్కాలనుకున్నాడు!
  ఘంటసాల గారినే గురువుగా భావించి, ఆ పాటలే వేదికలపై పాడుతూ వచ్చిన రామకృష్ణ గొంతు ఆయనకు చాలా దగ్గరగా ఉండేది. ఘంటసాల గారు గతిం చాక, జనం అలాంటి మంచి వాయిస్‌ను రామకృష్ణలో చూసుకున్నారు. తొలి రోజుల్లో పరిశ్రమ ప్రోత్సహించింది. అతని గొంతు విని, సంగీత దర్శకుడు రమేశ్‌నాయుడు మా ‘తాత మనవడు’కు ‘అనుబంధం ఆత్మీయత’ పాడించారు. తర్వాత ‘దేవదాసు మళ్ళీ పుట్టాడు’ సహా నా సినిమాలు చాలా వాటిలో పాడాడు. కొన్ని కారణాల వల్ల పరిశ్రమలో అతనికి చిన్న గ్యాప్ వచ్చి, నెమ్మదించాడు. అతను ఫ్రాంక్‌గా మాట్లాడేవాడు. నిర్మాత లను డబ్బు కోసం డిమాండ్ చేసేవాడు కాదు. తనకు రాని పేరు కొడుక్కైనా దక్కాలని సంగీతం నేర్పించాడు.
 - దాసరి నారాయణరావు, దర్శకుడు
 
 అంకితభావానికి అది గుర్తు!
 రామకృష్ణది మంచి గొంతు. మా సిని మాలు ‘కృష్ణవేణి’, ‘అమర దీపం’లో రామకృష్ణతో పాటలు పాడించా. అవి ఇవాళ్టికీ పాపులరే. కానీ, చిత్రంగా పెద్దగా అవకాశాలెందుకో రాలేదు. ఆ తరువాత ‘భక్త కన్నప్ప’లో కిరాతార్జునీయ గీతం తప్ప, అన్నీ పాడించా. అందులో ‘ఆకాశం దించాల’ లాంటి పాటలన్నీ పెద్ద హిట్టు. అందుకే, ఎప్పుడూ ‘నాకు మీరు లైఫ్ ఇచ్చారు’ అంటూ, కృతజ్ఞత చూపేవాడు. ‘తాండ్ర పాపారాయుడు’ (1986)లో మంచి దమ్ముతో పాడాల్సిన పద్యానికి పిలిస్తే, చాలా రిహార్సల్స్ చేసి, తృప్తిగా వచ్చేవరకు పాడాడు. అది ఆయన అంకితభావానికి నిదర్శనం. వ్యక్తిగతంగా మంచి మనిషి.’
 - కృష్ణంరాజు, నటుడు
 
 ఆయన, ఈయన చెరిసగం పాడారు!
 రామకృష్ణ గారు మరణించారన్న సంగతి ఇందాక టీవీలో చూసి షాక్ అయ్యా. ఒక మంచి గాయకుడిగా, మంచి మనిషిగా ఆయన తెలుసు. చూసి, చాలా రోజులైంది. అనారోగ్యం గురించి తెలి యదు. తక్కువ పాటలే పాడినా, కెరీర్‌లో చాలా హిట్లున్న గాయకుడు ఆయన. మా ‘అల్లూరి సీతారామరాజు’లోని ‘తెలుగు వీర లేవరా’ పాటను ఘంటసాల పాడితే, అందులో చివర వచ్చే ‘స్వాతంత్య్ర వీరుడా స్వరాజ్యభానుడా...’ అనే బిట్‌ను రామకృష్ణ గానం చేశారు. ఘంటసాల అనారోగ్యంతో ఆ బిట్ పూర్తి చేయలేక, తానే స్వయంగా రామకృష్ణ గారిని పిలిచి మరీ ఆ పాట పూర్తి చేయించారు. ఇవాళ్టికీ ఆ పాట అందరి నోటా నిలిచింది. ఘంట సాలను తలపించే రామకృష్ణ గొంతు మూగపోయినందుకు బాధగా ఉంది.
 - విజయనిర్మల, నటి - దర్శకురాలు
 
 తనమీద తానే జోక్స్ వేసుకునేవారు!
 రామకృష్ణ గారు చాలా సరదా అయిన మనిషి. ప్రముఖ సినీ సంగీత దర్శకులు రాజ్ - కోటి గార్లు ముందుగా ‘రుద్రాక్ష మాల’ అనే క్యాసెట్‌కి సంగీతం చేశారు. అప్పుడు నేను, రామకృష్ణ గారు కలసి పాడడం జరిగింది. ఆ తరువాత ఎన్నో వేదికలపై కలసి పాడాం. ఎన్నో కచ్చేరీలు కలసి చేశాం. బయట చాలామందికి తెలియని గొప్ప కోణం ఏమిటంటే, ఆయన ఎప్పుడూ సరదాగా, ఏవో జోక్స్ వేస్తూనే ఉంటారు. ముఖ్యంగా తన మీద తానే జోక్స్ వేసుకొనేవారు. ఆయన పోయారనే వార్త హైదరాబాద్‌లో షూటింగ్‌కి వచ్చిన నాకు షాకింగ్ న్యూస్. స్వయంగా వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించా. ఇవాళ ఆయన మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా.
 - ఎస్పీ శైలజ, సినీ గాయని
 
 వాళ్లది సంగీత కుటుంబం
 రామకృష్ణ కుటుంబమంతా నాకు బాగా తెలుసు. రామకృష్ణే కాదు, అతని చెల్లెలు బి.ఎ. లక్ష్మి, తమ్ముడు వాసుదేవ్ మంచి సింగర్స్. 1960ల చివర్లో ‘హైదరాబాద్ ఫిల్మ్ టాలెంట్స్ గిల్డ్’ అనే ఆర్కెస్ట్రాతో సినీ, లలిత గీతాల కచ్చేరీలు ఇక్కడ చేసేవాళ్ళం. చదువుకొనే రోజుల్లోనే రేడియోలో, ఆ ఆర్కెస్ట్రాలో నా దగ్గర రామకృష్ణ పాడేవాడు. అప్పట్లో ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్‌కి పాడడానికి చాన్స్ వస్తే, నాకు కుదరక సారథీ స్టూడియోకు అతణ్ణి పంపా. అక్కడ అతని గొంతు విని, దైవికంగా ఏయన్నార్ ఫస్ట్ సినిమా ఛాన్సిచ్చారు. నా వల్లే ఆ ఛాన్స్ వచ్చిం దంటూ, ఆ సంగతి ఎప్పుడూ అందరికీ చెబుతుండేవాడు. అన్నీ బాగా పలికే, మంచి గాత్రం అతనిది. ఘంటసాలను తలపిస్తూ చాలా సినీగీతాలు పాడాడు.
 - ఎం. చిత్తరంజన్, లలిత సంగీతజ్ఞుడు

Advertisement
Advertisement