ఈ బ్రేక్ కోసమే ఏడేళ్లు ఎదురు చూశా! | Sakshi
Sakshi News home page

ఈ బ్రేక్ కోసమే ఏడేళ్లు ఎదురు చూశా!

Published Mon, Feb 23 2015 12:18 AM

ఈ బ్రేక్ కోసమే ఏడేళ్లు ఎదురు చూశా!

 - సంగీత దర్శకుడు సాయి కార్తీక్
‘‘ఇటీవల విడుదలైన ‘పటాస్’ కమర్షియల్‌గా నాకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ బ్రేక్ కోసమే ఏడేళ్లుగా ఎంతో ఓపికగా సినిమాలు చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు పెద్ద చిత్రాలకు కూడా అవకాశం వస్తోంది. ‘సాయి మంచి పాటలిస్తాడు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగా చేస్తాడు’ అనే పేరు తెచ్చుకోగలిగాను. ఆ పేరు నిలబెట్టుకుంటాను’’ అని సంగీతదర్శకుడు సాయి కార్తీక్ చెప్పారు. నేడు సాయి కార్తీక్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన కెరీర్, ఇతర విశేషాల గురించి సాయి మాట్లాడుతూ - ‘‘మాది ఒంగోలు. మా నాన్నగారు తబలిస్ట్. అమ్మ గాయని.

దాంతో నాకూ సంగీతం మీద మమకారం ఏర్పడింది. సంగీతదర్శకుడు కావాలనే ఆశయంతో కోటి, మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్ వంటి సంగీత దర్శకుల దగ్గర ‘లైవ్ డ్రమ్మర్’గా చేశాను. ‘కాల్ సెంటర్’ సినిమాతో సంగీతదర్శకునిగా పరిచయం అయ్యి, ఇప్పటికి దాదాపు 20 చిత్రాలకు పాటలు స్వరపరిచాను. గత రెండేళ్లుగా నా కెరీర్ చాలా బాగుంది. రాంగోపాల్‌వర్మగారితో ‘రౌడీ’ సినిమా చేయడం, కృష్ణవంశీగారితో ‘పైసా’ చేయడం నా అదృష్టం.

‘ఈ మధ్య కాలంలో నేను చేసిన చిత్రాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్’ గురించి కూడా అందరూ మాట్లాడుకున్న సినిమా ‘రౌడీ’యే అని వర్మగారు అన్నప్పుడు చాలా ఆనందపడ్డాను. ‘జెండా పై కపిరాజు’, ‘ప్రతినిధి’ బ్యాగ్రౌండ్ స్కోర్ విని, కృష్ణవంశీగారు ‘పైసా’కి అవకాశం ఇచ్చారు. గత ఏడాది విడుదలైన చిత్రాల్లో ‘టాప్ 10’ ఆల్బమ్స్‌లో ‘పైసా’ ఉండటం ఓ ఆనందం’’ అని చెప్పారు.

Advertisement
Advertisement