రక్తం పీల్చయినా సరే : షూజిత్ సర్కార్ | Sakshi
Sakshi News home page

రక్తం పీల్చయినా సరే : షూజిత్ సర్కార్

Published Wed, Aug 21 2013 10:50 PM

The new trailer of Shoojit Sircar's Madras Café gives us a better glimpse of the plot and instills curiosity in the viewers' minds.

ముంబై: తన కొత్త సినిమా మద్రాస్ కేఫ్ ఫలితంపై దర్శకుడు షూజిత్ సర్కార్ ఎంతో ధీమాగా ఉన్నాడు. శ్రీలంక పౌరయుద్ధం ఆధారంగా తీసిన ఈ సినిమా జాన్ అబ్రహం, నర్గిస్ ఫక్రికి మంచి పేరు తెస్తుందని ఘంటాపథంగా చెబుతున్నాడు. నటుల్లోని రక్తం పీల్చి అయినా వారి నుంచి ఫలితం రాబట్టడం తనకు తెలుసన్నాడు. మద్రాస్‌కేఫ్‌లో వీళ్లద్దరూ అద్భుతంగా నటించారని కితాబిచ్చాడు. పదేళ్లుగా బాలీవుడ్‌లో ఉంటూ ధూమ్, దోస్తానా, హౌస్‌ఫుల్ 2, రేస్ 2, షూటౌట్ ఎట్ వాడాలా వంటి పెద్ద చిత్రాల్లో నటించినా జాన్‌కు ఇప్పటికీ పెద్దనటుడిగా గుర్తింపు లేదు. 
 
 రాక్‌స్టార్‌తో హిందీ సినిమాల్లోకి వచ్చిన నర్గిస్ ఫక్రి నటన ఏమీ బాగాలేదని విమర్శలు రావడంతో ఈ బ్యూటీ కెరీర్ కూడా ప్రమాదంలో పడింది. శుక్రవారం విడుదలవుతున్న మద్రాస్‌కేఫ్ చూసిన తరువాత ప్రేక్షకులు జాన్, నర్గిస్‌పై ఇది వరకు ఉన్న అభిప్రాయాన్ని మార్చుకుంటారని సర్కార్ అంటున్నాడు. ‘ప్రతి ఒక్కరిలోనూ నటనాసామర్థ్యం ఉంటుంది. దాన్ని ఎలా ఉపయోగించుకుంటారనేదే ముఖ్యం. ఇంతకుముందు నేను తీసిన వికీ డోనర్ పూర్తిగా నటుడు, పాత్రలపై ఆధారపడ్డ సినిమా. నేను ఏ ఒక్క నటుడినీ వదిలిపెట్టను. వాళ్ల రక్తం పీల్చి మరీ నటనను రాబట్టుకుంటాను.
 
 మద్రాస్‌కేఫ్ విడుదల తరువాత జాన్, నర్గిస్‌పై విమర్శకుల ఆలోచనావిధానం మారుతుంది. అవసరమైతే ఈ విషయాన్ని కాగితంపై రాసిస్తాను’ అని షూజిత్ స్పష్టం చేశాడు. ఈ సినిమాకు మొదటి నుంచి జాన్‌నే తీసుకోవాలని భావించినా, నర్గిస్ పేరు మాత్రం అనుకోలేదని చెప్పాడు. మద్రాస్‌కేఫ్ నర్గిస్‌కు కొత్త కెరీర్‌ను ఇస్తుందని హామీ ఇచ్చాడు. ‘ఈ సినిమా ప్రచారం కోసం ఏవో గిమ్మిక్కులు చేసి కథపై ప్రేక్షకులకు శ్రద్ధ లేకుండా చేయిద్దని మార్కెటింగ్ వాళ్లను హెచ్చరించాను. మనం బాధల్లో ఉన్న వాళ్ల గురించి ఇందులో చెప్పాం. వాళ్ల దుస్థితిని సొమ్ము చేసుకోకూడదు’ అని షూజిత్ సర్కార్ వివరించాడు.
 

Advertisement
Advertisement