వినాయకచవితికి విజయ్ చిత్ర టైటిల్ | Sakshi
Sakshi News home page

వినాయకచవితికి విజయ్ చిత్ర టైటిల్

Published Sat, Sep 3 2016 1:56 AM

వినాయకచవితికి విజయ్ చిత్ర టైటిల్

విజయ్ ఈలేస్తే ఆయన అభిమానుల గుండెల్లో ఆనందాల సవ్వడి మోగుతుంది. అంతటి వీరాభిమానం గల నటుడు ఇళయదళపతి. తెరి చిత్రంతో మరోసారి తన సత్తా చాటుకున్న విజయ్ తాజాగా తన 60వ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్ బ్యానర్‌సై బి.వెంకటరామిరెడ్డి సమర్పణలో బి.భారతీరెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో ఇలయదళపతి ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. కీర్తీసురేశ్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి భరతన్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర షూటింగ్ ఇప్పటికి 70 శాతం పూర్తి చేసుకుందని సమాచారం. అయినా ఇప్పటికీ చిత్రానికి పేరును నిర్ణయించలేదు. అయితే ఉంగవీట్టిపిళ్లై అని ఇంకేదో అని ఊహాగానాలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
 
 తమ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదని త్వరలోనే మంచి పేరును పెట్టనున్నట్లు చిత్ర నిర్మాతల తరఫున ఇటీవలే ఒక ప్రకటన వెలువడింది. తాజా సమాచారం ఏమిటంటే విజయ్ 60వ చిత్రానికి వినాయకచవితి పర్వదినాన టైటిల్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. విజయ్ చిత్రానికి తగ్గట్టుగా ఒక అందమైన పేరును ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. అదే విధంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ, విడుదల వివరాలను వెల్లడించనున్నట్లు సమాచారం. ఇది విజయ్ అభిమానులకు నిజంగా ఆనందాన్ని నింపే తీపి కబురే అవుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదులే. ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయన్నది ప్రస్తావించనక్కర్లేని విషయం.
 

Advertisement
Advertisement