Sakshi News home page

‘మాడా’ ఇళ్లకు మంచి గిరాకీ

Published Fri, Jun 13 2014 10:57 PM

‘మాడా’ ఇళ్లకు మంచి గిరాకీ - Sakshi

మాడా నిర్మించిన 2,641 ఇళ్లకు 94,118 దరఖాస్తులు రావడంతో లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ నెల 25న లాటరీ నిర్వహిస్తారు.
 
సాక్షి, ముంబై: మహారాష్ట్ర గృహనిర్మాణ అభివృద్ధి సంస్థ (మాడా) నిర్మించిన 2,641 ఇళ్లకు 94,118 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల దారుల నుంచి డిపాజిట్ రూపంలో సేకరించిన రూ.286.94 కోట్లు మాడా ఖాతాలోకి చేరాయి. ఈ ఇళ్లకు నెల 25న బాంద్రాలోని రంగశారద సభాగృహంలో మాడా లాటరీ నిర్వహించనుంది. ఇందులో ఇళ్లు వచ్చిన వారు దరఖాస్తుతో చెల్లించిన డిపాజిట్ డబ్బులు మినహా మిగతా మొత్తాన్ని బ్యాంకులో జమ చేయాల్సి ఉంటుంది.
 
ఇళ్లురాని వాళ్లు దరఖాస్తు సమయంలో చెల్లించిన మొత్తాన్ని తమ తమ బ్యాంకు ఖాతాల్లోకి మళ్లీ డిపాజిట్ చేస్తామని మాడా ప్రజా సంబంధాల అధికారి వైశాలి సదానంద్ సింగ్ చెప్పారు. ముంబై రీజియన్‌లో ప్రతీక్షానగర్ (సైన్), మాన్‌ఖుర్ద్, తుంగవా (పవాయి), వినోబాభావే నగర్ (కుర్లా), శేలేంద్ర నగర్ (దహిసర్), మాగఠ్నే (బోరివలి), కోలేకల్యాణ్ (శాంతక్రజ్) ప్రాంతాల్లో మాడా 814 ఇళ్లు నిర్మించింది. అలాగే కొంకణ్ రీజియన్‌లోని విరార్-బోలింజ్ ప్రాంతంలో,1,716 ఇళ్లు, వెంగుర్లా (సింధుదుర్గ్)లో 111 ఇళ్లు నిర్మించింది. వీటికి ప్రత్యక్షంగా లేదా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 11 సాయంత్రం వరకు గడువు విధించింది.
 
గడువు ముగిసిన తరువాత దరఖాస్తులు లక్షకుపైగా ఉన్నట్టు తేలింది. డిపాజిట్లు చెల్లించి దరఖాస్తు చేసుకున్నవి 94,118 ఉన్నాయి. ఈ దరఖాస్తుదారుల నుంచి లాటరీ ద్వారా అర్హులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తుదారుల్లో 59,120 మంది డిమాండ్ డ్రాఫ్టుల ద్వారా రూ.169.59 కోట్లను మాడా ఖాతాలో జమ చేశారు. అలాగే ఆన్‌లైన్ విధానంలో 34,998 మంది దరఖాస్తుదారులు రూ.117.35 కోట్లు చెల్లించారని వైశాలి చెప్పారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన డిమాండ్ డ్రాఫ్ట్‌లను లెక్కిస్తే మరింత నగదు వస్తుందని ఆమె అన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement