నేటి నుంచి అంతర్జాతీయ వాణిజ్య మేళా | Sakshi
Sakshi News home page

నేటి నుంచి అంతర్జాతీయ వాణిజ్య మేళా

Published Fri, Nov 14 2014 12:33 AM

నేటి నుంచి అంతర్జాతీయ వాణిజ్య మేళా - Sakshi

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రారంభం
* ఈ నెల 14 నుంచి 18 వరకు వాణిజ్య సందర్శకులకు మాత్రమే అనుమతి
* సీనియర్ సిటిజన్లకు, వికలాంగులకు ఉచిత ప్రవేశం

సాక్షి, న్యూఢిల్లీ: 34వ అంతర్జాతీయ వాణిజ్య మేళాకు నగరం ముస్తాబైంది. శుక్రవారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి ఈ మేళాను ప్రగతిమైదానంలో ప్రారంభిస్తారు. ఈ నెల 27 వరకు మేళా కొనసాగుతోంది. ఈ నెల 14 నుంచి 18 వరకు వాణిజ్య సందర్శకులను మాత్రమే అనుమతిస్తారు. 18 నుంచి 27 వరకు సామాన్యులకు ప్రవేశం ఉంటుంది.

ఉదయం 9 .30 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు మేళా తెరచి ఉంటుంది. ఐదున్నర వరకూ మేళాలో ప్రవేశ సదుపాయం ఉంటుంది. టికెట్ల విక్రయం మాత్రం సాయంత్రం నాలుగు గంటలకు నిలిపివేస్తారు. సెలవు రోజులు, వారాంతపు రోజుల్లో మధ్యాహ్నం రెండు గంటలకే టికెట్ల విక్రయం నిలిపివేస్తారు.
 
ప్రవేశ టికెట్లు ఇలా..: మేళాలో ప్రవేశం కోసం గేట్ నంబర్ 1, 2 వద్ద టికెట్లు లభిస్తాయి. అన్ని మెట్రో స్టేషన్లలో మేళా టికెట్లు లభిస్తాయి. ప్రవేశ టికెట్ వెలను వివిధ కేటగిరీలు నిర్ణయించారు. వ్యాపారులకు రోజుకు రూ.400, కాగా సీజనల్ టికెట్ ధర రూ.15,00, సామాన్యుల విషయానికి వస్తే పెద్దలకు రూ.50, పిల్లలకు రూ 30 ఉంది. సెలవు రోజుల్లో శని,ఆదివారాల్లో మేళాను సందర్శించేందుకు పెద్దలు రూ. 80, పిల్లలు రూ.50 టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు, వికలాంగులకు గుర్తింపుపత్రంపై ఉచిత ప్రవేశ సదుపాయం ఉంది. మెట్రో ప్రయాణికుల కోసం ప్రగతిమైదాన్‌లో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. మెట్రో స్టేషన్లలో కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించడం కోసం మెట్రో టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు.
 
6000 ఎగ్జిబిట్లు: మహిళా ఎంటర్ ప్రెన్యుయర్లు ఇతివృత్తంగా జరిగే ఈ మేళాలో 6,000 ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం మేళాలో దక్షిణాఫ్రికా భాగస్వామ్య దేశం హోదాలో, థాయ్‌లాండ్ ఫోకస్ కంట్రీ హోదాలో పాల్గొంటున్నాయి. ఢిల్లీ ఫోకస్ రాష్ట్రం హోదాలో మేళాలో పాల్గొంటోంది.

Advertisement
Advertisement