బెంగాల్ రెండో దశలో 80 శాతం పోలింగ్ | Sakshi
Sakshi News home page

బెంగాల్ రెండో దశలో 80 శాతం పోలింగ్

Published Mon, Apr 18 2016 1:46 AM

బెంగాల్ రెండో దశలో 80 శాతం పోలింగ్ - Sakshi

కోల్‌కతా: చెదురుమదురు హింసాత్మక ఘటనలు మినహా పశ్చిమబెంగాల్ రెండో దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 80 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 383 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఉత్తర బెంగాల్‌లోని అలీపుర్‌దౌర్, జల్పాయ్‌గురి, డార్జిలింగ్, ఉత్తర దినాజ్‌పుర్, దక్షిణ దినాజ్‌పుర్, మాల్డాతో పాటు దక్షిణ బెంగాల్లోని బీర్బూమ్ జిల్లాలోని 56 నియోజకవర్గాల్లో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. బీర్బూమ్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియగా మిగతా చోట్ల సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగింది.

తృణమూల్ కాంగ్రెస్ వివాదాస్పద నేత అనుబ్రత మండల్‌పై ఈసీ నిరంతర నిఘా పెట్టింది. చొక్కాపై తృణమూల్ పార్టీ గుర్తుతో ఓటు వేసేందుకు అనుబ్రత వెళ్లడం మరో వివాదానికి దారితీసింది.  దీనిపై కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేశారు.  మాల్డా జిల్లాలోని ఇంగ్లిష్‌బజార్ నియోజకవర్గంలో తృణమూల్, సీపీఎం కార్యకర్తల ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారు. పోలింగ్ అధికారి తృణమూల్‌కు అనుకూలంగా వ్యవరించడంతో అతన్ని తక్షణం విధులనుంచి తప్పించారు. బీర్బూమ్ జిల్లా డుమ్రుత్ గ్రామంలో ఉదయం బీజేపీ, తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణలో ఎనిమిది మంది గాయపడ్డారు.

Advertisement
Advertisement