వాళ్లది మొండివైఖరి.. వితండవాదన: హరీశ్ | Sakshi
Sakshi News home page

వాళ్లది మొండివైఖరి.. వితండవాదన: హరీశ్

Published Thu, Jun 23 2016 12:38 PM

వాళ్లది మొండివైఖరి.. వితండవాదన: హరీశ్

జల వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండి వైఖరితో ఉందని, కేంద్రం చేసిన సూచనలను అసలు పట్టించుకోలేదని.. వితండ వాదన చేస్తోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు. కృష్ణా జలాల పంపిణీపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత రాలేదని, చర్చలు అసంపూర్తిగానే మిగిలాయని చెప్పక తప్పదని అన్నారు. ట్రిబ్యునల్ ఇప్పటికే స్పష్టంగా అవార్డు ఇచ్చిందని, అయినా వాళ్లు పట్టించుకోవడం లేదని తెలిపారు. పై రాష్ట్రాలకు హక్కులుంటాయి కాబట్టే తమకు రావల్సిన 90 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని తెలంగాణ చెప్పిందని తెలిపారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు జూలై మొదటివారంలో అధికారులను నియమిస్తామని, అప్పటివరకు యథాతథ స‍్థితి కొనసాగించాలని కేంద్రం చెబితే తాము ఒప్పుకొన్నామని.. కానీ ఏపీ ప్రభుత్వం మొండి, విచిత్రవైఖరి అనుసరించడం వల్ల చర్చ అసంపూర్తిగా ముగిసిందని హరీశ్ రావు చెప్పారు.

అయితే, అసలు తాము చెప్పిన తర్వాత మాత్రమే కేంద్ర జలవనరుల శాఖ అధికారులకు పరిస్థితిపై అవగాహన వచ్చిందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. రాయలసీమ నాలుగు జిల్లాలు కరువులో ఉన్నాయని, వాళ్లకు తాగునీరు కూడా ఇ‍వ్వకుండా ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు సమాచారం ఇవ్వకుండా.. కృష్ణామేనేజిమెంటు బోర్డు ఆదేశాలను పట్టించుకోకుండా ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తికి నీళ్లు ఎలా ఇచ్చారని అడిగితే కేంద్ర అధికారులు ఆశ్చర్యపోయారని అన్నారు. తాము అడిగేసరికి వాళ్లు సమాధానం చెప్పలేకపోయారని, వాస్తవాలను కేంద్రం అర్థం చేసుకుందని చెప్పారు. 3 రోజుల చర్చల్లో విభజన చట్టంలో నీళ్ల కేటాయింపు అంశం గురించి తాము చెప్పిన తర్వాతే కేంద్ర జలనవరుల అధికారులకు అవగాహన వచ్చిందని ఉమా అన్నారు.

Advertisement
Advertisement